
ప్రపంచాన్ని కదిలించిన భారత స్వతంత్ర పోరాట మహోద్యమ ప్రభావం అసఫ్ జాహీల ఏలుబడిలో ఉన్న నైజాం రాష్ట్రంలో ఏమాత్రం లేదనే అభిప్రాయం ఇప్పటికీ తెలంగాణతో పాటు దేశంలోని చాలామందికి ఉంది. తీవ్ర నిర్బంధం, వాక్ స్వతంత్రం, స్వేచ్ఛ లేని నైజాం రాష్ట్రంలోనూ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. అయితే, అప్పటి పరిమితమైన పరిస్థితుల వల్ల ఈ మహోజ్వల పోరాటగాథలు అంతగా బయటకు రాలేదు.
హైదరాబాద్ స్టేట్‌లో బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో మహీపతి రాయ్‌ను మొట్టమొదటివాడిగా చెప్పుకోవచ్చు. అనంతర కాలంలో నిజాం వంశానికి చెందిన ముబారిజుద్దౌలా, సర్దార్ ఖాన్ కోటేజా, తుర్రేబాజ్ ఖాన్, మౌల్వి అల్లావుద్దీన్, రాజా దీప్ సింగ్, పట్వారి రంగారావు, నానా సాహెబ్, రాంజీ గోండ్, వనపర్తి లక్ష్మయ్య, పండగ సాయన్న తిరుగుబా టు, జువ్వాడి హుస్సేన్, వాసుదేవ్ బల్వంత్ ఫడ్ కె, బాబా సాహెబ్, అనంత్ కావేరే, ప్రతివాద భయంకరాచారి, కేశవరావు కోరటకర్, వామన్ నాయక్, సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్ తదితరులెందరో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమాలు లేవనెత్తడం, బ్రిటిషర్లను తీవ్రంగా వ్యతిరేకించినవారిలో ఉన్నారు.
నైజాం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినవారిలో బిరార్ రాష్ట్ర గవర్నరుగాఉన్న మహీపతి రాయ్ ప్రముఖుడు. నిజాం ఏలుబడిలోని బిరార్ గవర్నర్‌గా ఉన్న మహీపతి రాయ్‌ని, మహారాష్ట్రులకు వ్యతికరేకంగా ఇంగ్లిష్ వారి పక్షాన పోరాడాల్సిందిగా ఆదేశించారు. దీనికి నిరాకరించిన మహీపతి రాయ్‌ని1804లో ఉద్యోగం నుంచి తొలగించారు. దీనితో అక్కడి రెండు వేలమంది సైన్యంతో మహీపతి రాయ్ షోలాపూర్ కు పరారయ్యాడు.1808లో తన 2000 వేలమంది సైన్యంతో బ్రిటిషర్లపై తిరుగుబాటు చేసాడు. బ్రిటిష్ సైన్యం మహీపతి రాయ్‌ని ఓడించాయి. తప్పించుకుని వెళ్లే మార్గంలో మహీపతి రాయ్ మరణించాడు.
జాగీర్దార్లు, రోహిల్లాల తిరుగుబాటు
1808లో బొల్లారంలోని బ్రిటిష్ సైన్యాలకు వ్యతిరేకంగా కొందరు జాగీర్దార్లు దాడికి ప్రయత్నించారు. వీరిలో నూరుల్ ఉమ్రా, రావు రాంభనింబాల్కర్ ముఖ్యులు. వీరిని గుర్తించి నిజాం ప్రభుత్వం శిక్షించింది. 1817లో జరిగిన మూడవ మహారాష్ట్ర యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయకులుగా యుద్ధం చేయాలని తన సైన్యాన్ని నిజాం ఆదేశించాడు.
అయితే, నైజాం సైన్యంలోని కొందరు రోహిల్లాలు నిరాకరించారు. దీనితో వారిని ఉద్యోగాలనుండి తొలగించారు. ఇలా తొలగించిన వారిలో ముఖ్యుడిగా ఉన్న సర్దార్ ఖాన్ కోటేజా పూనాకు వెళ్లి అక్కడి పీష్వాలతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి యుద్ధంలో మరణించారు. 1821లో నిజామాబాద్ సిర్నాపల్లి, భవానీ పేటలో, బీబీపేటలో జరిగిన తిరుగుబాట్లకు లక్ష్మణ రెడ్డి నాయకత్వం వహించారు.
బ్రిటిషర్లకు వ్యతిరేకంగా..
1939లో ఉత్తర భారతంలో వహాబీ ఉద్యమం వచ్చింది. ఇది ముస్లింలలో సంస్కరణలకై ప్రారంభమైన ఉద్యమం అయినప్పటికీ క్రమంగా అది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మారింది. ఈ ఉద్యమ నాయకులలో ఒకరైన మౌల్వీ సలీం హైదరాబాద్ నగరానికి వచ్చి బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ముబారిజుద్దౌలాను కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన కుట్రను గుర్తించి, ముబారిజుద్దౌలా, మౌల్వి సలీం, ఆయన అనుచరులకు 18 ఏండ్ల కఠిన శిక్ష విధించారు. ఐదేళ్లపాటు ఖైదీగా ఉండి తన 54 వ ఏట 1854 లో ముబారిజుద్దౌలా మరణించాడు.
తుర్రేబాజ్ ఖాన్ పోరాటం
1857లో ఉత్తర భారత దేశంలో సిపాయిలు తిరుగుబాటు చేశారని తెలిసి హైదరాబాద్ లోనూ దాని ప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా ఔరంగాబాద్ లోని నిజాం సైన్యం ఎదురు తిరిగింది. దీనిని అణచివేసి తొమ్మిది మంది తిరుగుబాటు సైనికులకు ఉరి శిక్ష విధించారు. హైదరాబాద్ నగరంలోనూ1857 ప్రభావం కనిపించింది. ఇంగ్లిష్ వారిపైన తిరుగుబాటు చేయాల్సిందిగా కోరుతూ కరపత్రాలు పంచిపెట్టారు.1887 జులై 17న తుర్రేబాజ్ ఖాన్, మౌల్వి అల్లాఉద్దీన్ నాయకత్వంలో రోహిల్లాలు రెసిడెంట్ మీద దాడి చేశారు. అప్పుడు దాదాపు రెండు గంటలపాటు కాల్పులు జరిగాయి. ఈ సందర్బంగా 25 మంది మరణించారు. తప్పించుకొని పారిపోతుండగా తుర్రేబాజ్ ఖాన్ ను తూప్రాన్ వద్ద కాల్చి చంపారు. మౌల్వి అలావుద్దీన్ అండమాన్ కారాగారంలో 1884 లో మరణించారు.
పట్వారీ రంగారావు సాహసం
బీదర్ జిల్లా నార్కేడ్ గ్రామ పట్వారిగా ఉన్న రంగారావు నాందేడ్ జిల్లాలోని దెగ్లూర్ తాలూకా లోని కౌలాస్ రాజా అయిన రాజా దీప్ సింగ్ సహాయంతో 800 మంది సైనికులను సిద్ధం చేసుకొని బ్రిటిష్ వారిని హత్య చేయాలని ప్రయత్నించారు. ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి దీప్ సింగ్, రంగారావులను అరెస్టు చేసి, దీప్ సింగ్ జాగీరును స్వాధీనం చేసుకొని మూడు సంవత్సరాల ఖైదు విధించారు. బ్రిటిష్ వారిచే అల్వాల్‌లో విచారణ చేసి మరణ శిక్ష విధించారు.
గోండుల తిరుగుబాటు
ఆదిలాబాద్ జిల్లాలోని అత్యంత అమాయకులైన ఆదివాసీ గోండులు ఇంగ్లిష్ వారికి ఎదురు తిరిగారు. రాంజీ గోండు నాయకత్వంలో గోండులకు, ఇంగ్లిష్ వారికి ఉట్నూరు వద్ద యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సహజంగానే గోండులు పరాజితులై రాంజీ గోండును నిర్బంధించి నిర్మల్ వద్ద ఒక చెట్టుకు ఉరి వేశారు. ఇప్పటికీ అక్కడ ఉన్న ఆ చెట్టును రాంజీ గోండు చెట్టుగా పిలుస్తారట. ఇక, మహబూబ్ నగర్ లోనూ పండగ సాయన్న అనే యోధుడు తెల్ల దొరలను చంపాలె అను నినాదంతో తిరుగుబాటు చేశాడు. ఇతనిని పట్టుకొని మరణ శిక్ష విధించారు.
నిజాం సైన్యంలో తిరుగుబాట్లు
నిజాం సైన్యం లో ఆఫ్గాన్లు , ఆఫ్రికన్లు, స్థానిక ముస్లింలున్నారు. బొల్లారం తిరుగుబాటుతో సహా హైదరాబాద్ స్టేట్‌లో పలుచోట్ల బ్రిటిష్ వారిపై తిరుగుబాట్లు రావడం అవి ఎక్కువగా నిజాం సైనిక దళాల నుంచి రావడం బ్రిటిషర్లు గమనించారు. దీనితో, నిజాం సైన్యానికి శిక్షణ అనే పేరుతో నిజాం సైన్యంలోనూ యూరోపియన్లను సైనికులుగా చొప్పించి హైదరాబాద్ కంటింజెంట్‌గా రూపాంతరం చేశారు. ఈ ప్రత్యేక సైనిక కాంటిజెంట్లతోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాట్లన్నింటినీ సమర్థవంతంగా అణచివేశారు. ఒక విధంగా చెప్పాలంటే,1817 నుంచి1857 వరకు హైదరాబాద్ స్టేట్ చరిత్ర ప్రజల తిరుగుబాటు అనిచెప్పవచ్చు.
1900 అనంతర కాలంలో గ్రంథాలయోద్యమం, ఆర్య సమాజ ఉద్యమం, ఆంద్ర మహాసభ, వందేమాతరం ఉద్యమం, కొమరం భీం ఉద్యమం తదితర ఉద్యమాలతో పాటు స్వామి రామానంద, బూర్గుల రామకృష్ణ రావు, పీవీ నరసింహారావు, సరోజినీ నాయుడు పలువురు ప్రముఖ యోధుల ఆధ్వర్యంలో నిజాం కు వ్యతిరేకంగా ఉద్యమం చేసినప్పటికీ ఇవన్నీ బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిపారని చెప్పవచ్చు.
(ఇందులోని సమాచారం, దేవులపల్లి రామానుజరావు రాసిన నిజాం రాష్ట్రంలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర, భారతి రే రచించిన హైదరాబాద్; బ్రిటిష్ పారామౌంట్సీతోపాటు మరికొన్ని గ్రంథాల నుంచి సేకరించడం జరిగింది)
అనేక తిరుగుబాట్లు
1858లో పైజాపూర్ కు చెందిన గోవిందరావు దేశ్ పాండే ఔరంగాబాద్ లో రెండు వేలమంది బిల్లులతో కూడిన సైన్యాన్ని తయారు చేసుకొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడు. ఇంగ్లీషు సైన్యాన్యంతో జరిగిన యుద్ధంలో 40 మంది బిల్లులు మరణించారు.1853లో గుల్బర్గా జిల్లాలోని షోలాపూర్ రాజుగా ఉన్న వెంకటప్పనాయక్ బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటులో వెంకటప్పనాయక్ ను నిర్బంధించి మద్రాస్ కు పంపిస్తుండగా, హైదరాబాద్ శివారు అంబర్ పేట వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు.1853 లో రాయచూర్ లో భీం రావ్ దేశాయి అనే వీరుడు స్వంతంగా సైన్యం సమకూర్చుకొని కోవాలి కోటను స్వాధీనం చేసుకొన్నాడు. తర్వాత, బ్రిటీష్ సైన్యం వచ్చి ఆయనపై దాడి చేయగా, భీం రావ్ దేశాయితోపాటు 150 మంది సైనికులు మరణించారు.
- కన్నెకంటి వెంకట రమణ,
జాయింట్ డైరెక్టర్, సమాచార పౌర సంబంధాల శాఖ