
- బిల్లుల నుంచి ప్రాజెక్టులకు పర్మిషన్ల దాకా అన్నీ పెండింగ్
- బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం
- 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్రం అడ్డంకులు
- దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు లేట్
- పెండింగ్లోనే మెట్రో, ట్రిపుల్ ఆర్, మూసీ సహా కీలక ప్రాజెక్టుల అనుమతులు
- సెమీ కండక్టర్ పరిశ్రమ విషయంలోనూ మొండిచెయ్యి
- కేంద్రం తీరుపై సీఎం రేవంత్ సహా మంత్రుల ఆగ్రహం
- -పోరాటంపై పీఏసీ మీటింగ్‌లో కార్యాచరణ ప్రకటించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ రిజర్వేషన్ల బిల్లులు మొదలు కీలక ప్రాజెక్టులకు అనుమతుల వరకు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీనిపై ప్రజల్లోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. త్వరలో జరిగే పీఏసీ సమావేశంలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకువెళ్దామని తాము భావిస్తుంటే.. కేంద్రం మాత్రం వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. బీసీ బిల్లులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం వల్లే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని అంటున్నది. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో విస్తరణ లాంటి కీలక ప్రాజెక్టులకు కూడా కేంద్ర సర్కార్ అనుమతులివ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తున్నది.రాష్ట్రానికి మూడు సెమీకండక్టర్ యూనిట్లు ఇవ్వాలని కొన్నాళ్లుగా కోరుతున్నా పట్టించుకోకుండా.. ఇటీవల ఏపీ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు ఇచ్చి.. తెలంగాణను పక్కనపెట్టడాన్ని తప్పుపడ్తున్నది.
ఏపీలో విజయవాడ, వైజాగ్ మెట్రోలకు ఆమోదం తెలిపి.. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతుల విషయంలో కొర్రీలు పెట్టడంపైనా మండిపడుతున్నది. గతంలో యూపీఏ సర్కారు తెలంగాణకు కేటాయించిన ఐటీఐఆర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్)ను రద్దు చేయడం మొదలుకొని సెమీకండక్టర్పరిశ్రమ విషయంలో మొండిచెయ్యి చూపడం దాకా తెలంగాణ అభివృద్ధిని మోదీ సర్కార్అడ్డుకుంటున్నదనే నిర్ధారణకు సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు వచ్చారు. ఆఖరికి రాష్ట్రానికి కేటాయించిన యూరియాలో కావాలనే కోతలు పెడ్తూ రైతుల ఆందోళనకు కారణమవుతున్నదని అనుమానిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని, దీన్ని ప్రజల్లోనే ఎండగట్టాలని సీఎం, మంత్రులు భావిస్తున్నారు.
ట్రిపుల్ఆర్ అనుమతులు పెండింగ్లోనే..
రాష్ట్రాభివృద్ధిలో అత్యంత కీలకంగా భావిస్తున్న రీజినల్రింగ్రోడ్డు(ట్రిపుల్ ఆర్)ను కేంద్ర ప్రభుత్వం కావాలనే అడ్డుకుంటున్నదని రాష్ట్ర సర్కారు ఆరోపిస్తున్నది. ట్రిపుల్ఆర్పూర్తయితే హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కొత్త పరిశ్రమలు, స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని, భూముల రేట్లు పెరగడం వల్ల ఇక్కడి ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్తాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. హైదరాబాద్ చుట్టూ ఆరు లేన్ల ఎక్స్‌ప్రెస్ వేగా 340 కిలోమీటర్ల పొడవుతో నిర్మించతలపెట్టిన ట్రిపుల్‌ఆర్‌లో నార్త్(161.5 కి.మీ.), సౌత్(198 కి.మీ.) భాగాలున్నాయి.
నిరుడు డిసెంబర్ లో నార్త్ పార్ట్ కు ఐదు ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న టెండర్లు ఖరారు చేయాల్సి ఉండగా.. కేంద్ర కేబినెట్ ఆమోదం లేకపోవడంతో ఎన్ హెచ్ ఏ ఐ అధికారులు టెండర్లు ఓపెన్ చేయడంలేదు. ఇక నార్త్ పార్ట్ లో అనుకున్నంత ట్రాఫిక్ ఉండదని కేంద్రం కొర్రీలు పెట్టగా.. ఈమేరకు ఎన్హెచ్ఏఐ అధికారులు రీ సర్వే చేసి రిపోర్ట్ అందించారు. సౌత్ పార్ట్ భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి సుమారు రూ. 17 వేల కోట్లు ఖర్చు అవుతుందని రాష్ట్ర సర్కార్ అంచనా వేసింది. ఆ భాగాన్ని కూడా కేంద్రమే నిర్మించాలని కోరుతున్నా అటు వైపు నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.
సెమీకండక్టర్ల విషయంలో ఇదే వివక్ష
రాష్ట్రానికి మూడు సెమీకండక్టర్యూనిట్లు ఇవ్వాలని కొంతకాలంగా కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ.. ఇటీవల ఏపీ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల్లో మాత్రం రూ.4,594 కోట్లతో నాలుగు సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాస్తవానికి నిరుడు అక్టోబర్‌లో నిర్వహించిన ‘వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ’లో తెలంగాణ రాష్ట్రానికి మూడు సెమీ కండక్టర్ యూనిట్లు ఇవ్వాలని మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. సెమీకండక్టర్ రంగానికి తెలంగాణ అన్నివిధాలా అనుకూలంగా ఉన్నందున సహకరించాలని సీఎం రేవంత్ కూడా ఢిల్లీ వెళ్లినప్పుడల్లా కేంద్రానికి విన్నవిస్తూ వచ్చారు.
కానీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క యూనిట్ కూడా కేటాయించలేదని, ఇది ముమ్మాటికీ వివక్షేనని మంత్రి శ్రీధర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు హైదరాబాద్‌మెట్రో సెకండ్ ఫేజ్అనుమతుల విషయంలోనూ కేంద్రం తెలంగాణపై వివక్ష చూపుతున్నదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో విజయవాడ, విశాఖపట్టణంలో రెండు మెట్రోల నిర్మాణానికి రూ.21,600 కోట్లతో ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇటీవల రూ.5,801 కోట్లతో లక్నో మెట్రో ఫేజ్ 1బీకి కూడా ఓకే చెప్పింది. కానీ, హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు మాత్రం అనుతివ్వడం లేదు. నిజానికి మన మెట్రో నిర్మాణంలో కేంద్రం భరించాల్సింది 18 శాతమే అయినా రకరకాల కొర్రీలు పెడుతూ అడ్డుకుంటోందని రాష్ట్ర సర్కారు చెప్తున్నది.
యూరియా కోటాలో కోతలు
ఈ వానాకాలం సీజన్‌లో తెలంగాణకు 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం.. ఏప్రిల్ , జూన్, జులై నెలల్లో 32% కోత పెట్టింది. మే నెలలో ఏకంగా 45% కట్ చేసింది. యూరియా ఎక్కువ అవసరమయ్యే ప్రస్తుత ఆగస్టు నెలలోనూ 35% కోత పెట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. ఏప్రిల్, జులై మధ్య 2.10 లక్షల టన్నులు, ఆగస్టులో 0.57 లక్షల టన్నులు కోతపెట్టారని, ఈ లోటును వెంటనే భర్తీ చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, అధికారులు కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పైగా ఎక్కువ భాగం విదేశీ యూరియానే కేటాయించడం, యూరియాను తెచ్చే నౌకల వివరాలు కూడా చెప్పకపోవడం ముమ్మాటికీ కక్ష సాధింపేనని రాష్ట్ర సర్కారు భావిస్తున్నది.
అమీతుమీకి రెడీ
తెలంగాణ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. ఇదే విషయాన్ని ఆయన ఇటీవల మంత్రులు, పీసీసీ చీఫ్ తో పాటు పార్టీ ముఖ్య నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. తాము ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పోదామని భావిస్తున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం ఫెడరల్ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నదని ఆయన అన్నట్లు సమాచారం. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని ఎన్నిసార్లు కోరుతున్నా కేంద్రం స్పందించడం లేదని అన్నట్లు తెలిసింది. ఇక, బీజేపీపై ప్రజల్లోనే తేల్చుకోవాలనే నిర్ణయానికి సీఎం రేవంత్ వచ్చినట్లు సమాచారం.
త్వరలో జరగనున్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలో బీజేపీపై పోరుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే ‘ఓట్ చోరీ’కి నిరసనగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను పీసీసీ చేపడ్తున్నది. ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ అనే నినాదంతో మూడు దశల్లో ఆందోళనలకు అక్టోబర్15 వరకు షెడ్యూల్ ప్రకటించింది. దీంతోపాటే తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న తీరును ఊరూరా ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు కాంగ్రెస్‌వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.
మూసీ పునరుజ్జీవానికి భూములు బదలాయిస్తలే..
హైదరాబాద్‌ను పర్యావరణ, పర్యాటక హబ్‌గా మార్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు చేపట్టింది. ఇందులో భాగంగా ఈసా, మూసీ నదుల సంగమ స్థలమైన బాపు ఘాట్ వద్ద ‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు’ అభివృద్ధికి రక్షణ శాఖకు చెందిన 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి 2024 నవంబర్ 26న రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు.
ఈ భూమిలో గాంధీ సిద్ధాంత కేంద్రం, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, శాంతి విగ్రహం, మ్యూజియం నిర్మాణం కోసం ప్రతిపాదించారు. కానీ, ఈ భూమి బదిలీకి కేంద్రం ఇంకా ఆమోదం తెలుపలేదు. దీంతో బాపు ఘాట్ వద్ద శంకుస్థాపన పనులు ఆగిపోయాయి. మూసీ ప్రాజెక్టులో 55 కిలోమీటర్ల విస్తీర్ణంలో 27 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, నది ఒడ్డున రిటైనింగ్ వాల్స్ లాంటి నిర్మాణాల కోసం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు జరగలేదు. కేంద్రం నుంచి భూముల బదలాయింపు, పర్యావరణ అనుమతులు రాకపోవడంతో మూసీ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఆగింది.