
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సోమవారం సెక్రటేరియెట్ లో ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం.. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.
జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రానున్న రెండు మూడు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, జిల్లాల్లోని అన్ని విభాగాలతో పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలన్నారు. విపత్తు సహాయక బృందాలు అందుబాటులో ఉండి తక్షణమే స్పందించాలన్నారు. సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలని ఉన్నతాధికారులు, కలెక్టర్లను సీఎం ఆదేశించారు.