ఎప్పట్లెక్కనే!..సిటీ ఓటర్ల తీరు మారలే

ఎప్పట్లెక్కనే!..సిటీ ఓటర్ల తీరు మారలే

హైదరాబాద్,వెలుగు : సిటీ ఓటర్ల అనాసక్తి కారణంగా జంటనగరాల్లో పోలింగ్​శాతం ఊహించని విధంగా అత్యల్పంగా నమోదు కావడం రాజకీయ వర్గాలను, ఎన్నికల అధికారులను విస్మయానికి గురి చేసింది. ఇంత తక్కువ స్థాయిలో 47.88 శాతం రావడానికి గల కారణాలను విశ్లేషించే పనిలో పడిపోయారు. సిటీలోని పలు స్థానాల్లోని పోలింగ్​ సరళిని చూస్తే.. యాకత్​పురా సెగ్మెంట్​లోనే రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా 39.64 శాతం  నమోదవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. సిటీ మొత్తంగా కలిపి ఓటింగ్​47.88 శాతానికే పరిమితమైంది. 

ఇంత తక్కువగా పోలింగ్​జరగడానికి ఓటర్ల బద్ధకమా? లేక ప్రభుత్వంపై వ్యతిరేకతనా? అనేది కూడా ఆలోచించాలని నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా   గోషామహల్​లో 55.38 శాతం పోలింగ్ నమోదైంది. సికింద్రాబాద్​, ఖైరతాబాద్​ సెగ్మెంట్లలో 55 శాతం లోపే  ఓటింగ్​జరిగింది. ఈసారి ఐటీ ఎంప్లాయీస్​ పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటారని ఎన్నికల అధికారులు భావించారు.  కానీ.. వారు కూడా ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించ లేదని స్పష్టమవుతున్నది. సిటీలో 7.5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండగా.. వీరిలో 50 శాతం మందికి పైగా ఓటు హక్కు ఉంది. దీంతో ఎన్నికల  అధికారులు కూడా ప్రత్యేకంగా వారి ఆఫీసుల్లోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.  అయినా ఓటు వేసేందుకు వారు ఆసక్తి చూపలేదు. 

ఓల్డ్ సిటీలో ఎందుకు తగ్గిందంటే...

 ఓల్డ్ సిటీలో పోలింగ్​శాతం చాలా తక్కువగా ఉంది. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈసారి బాగా పడిపోయింది. దాదాపు అన్ని చోట్ల ఓటింగ్​ శాతం భారీగా తగ్గిపోయింది. దీనికి కారణం కొత్త ఓటర్ల జాబితా అనంతరం ఇక్కడ బోగస్​ ఓట్లు భారీగా నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వాటిని అధికారులు కట్టడి చేయగలిగారు. ఓటర్ల జాబితాలో ఒకే కుటుంబానికి చెందినవి ఒకే బూత్​లో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లోని బూత్​ల్లో నమోదు కావడం, ఇంటి నుంచి పోలింగ్​కేంద్రాలు చాలా దూరంలో ఉండడంతో  తమ ఓటు వేయలేక పోయామని పలు ప్రాంతాల వారు ఆరోపిస్తున్నారు. 

ర్యాపిడో బైక్, ట్యాక్సీ లాంటి సంస్థలు సైతం పోలింగ్​ఎక్కువ జరిగేలా ప్రోత్సహించడానికి ఫ్రీ సర్వీస్​ఆఫర్​చేసినా ఎవరూ పెద్దగా ఉపయోగించుకోలేదు. ఓ ప్రైవేట్​సంస్థ ఇలా 2,600 పోలింగ్ స్టేషన్లకు ఫ్రీ సర్వీస్​ఆఫర్ ​చేసింది. అయినా ఓటర్లు ఇంటి నుంచి బయటకు రాకపోవడం ఆలోచించాల్సినదే.  ఈసారి పోలీసు బందోబస్తు పటిష్టం చేయడంతో దొంగ ఓట్లు వేయకుండా చర్యలు చేపట్టారు. చాలా ప్రాంతాల్లో మజ్లిస్​పై మైనారిటీలు కూడా వ్యతిరేకంగానే ఉండడం వల్ల కూడా వారు ఓటు వేయకుండా తమ నిరసన తెలిపినట్లు తెలుస్తోంది. 

రెండేసి చోట్ల ఓట్లు ఉండడం కూడా కారణం

జంటనగరాల్లోని చాలా సెగ్మెంట్లలో ముఖ్యంగా కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్​బీనగర్, ఉప్పల్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి చోట్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారు, ఉద్యోగులు, విద్యార్థుల్లో చాలా మంది రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారు. వారంతా ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్​లో తమ ఓటు వేయలేకపోయారు. ముఖ్యంగా నల్లగొండ, మహబూబ్​నగర్, వరంగల్​, కరీంనగర్​, మెదక్​, సిద్దిపేట తదితర జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వారు ఉండగా.. చాలా మందికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. 

తాను ఓటు వేసేందుకు వరంగల్​వెళ్లానని.. అందుకే సిటీలో ఓటేయలేదని ప్రభుత్వ ఉద్యోగి నారాయణ రావు తెలిపారు. ఇలాంటి వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో కూడా పోలింగ్​శాతం బాగా తగ్గింది. సిటీలో ఊహించని విధంగా ఇంత తక్కువస్థాయి పోలింగ్​ జరగడంతో ఏ పార్టీ అభ్యర్థి కూడా కచ్చితంగా తాను గెలుస్తానని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న దానిపైనే ఆసక్తి నెలకొంది.