గడచిన కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మార్చి 31లోగా గ్యాస్ కనెక్షన్ సరెండర్ చేయాలనే వార్త సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? గ్యాస్ వినియోగదారులు ఏం చేయాలో పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకోండి..
మార్చి 31 డెడ్‌లైన్ నిజమేనా?
నేరుగా చెప్పాలంటే.. లేదు. LPG సిలిండర్ కనెక్షన్‌ను మార్చి 31 లోపు సరెండర్ చేయాలనే ఖచ్చితమైన డెడ్ లైన్ ఏదీ ప్రభుత్వం విధించలేదు. అసలు విషయం ఏంటంటే, మీ ప్రాంతంలో పైపుడ్ నేచురల్ గ్యాస్(PNG) సౌకర్యం అందుబాటులోకి వస్తే.. అప్పటి నుండి ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకీ మారడానికి ప్రభుత్వం సాధారణంగా 90 రోజుల సమయం ఇస్తుంది. మీ ఏరియాలో పీఎన్‌జీ కనెక్షన్ సిద్ధంగా ఉందని మీకు నోటీసు వచ్చిన రోజు నుండి ఈ 3 నెలల గడువు మొదలవుతుంది తప్ప.. అర్జెంటుగా మార్చి 31తో ముగియదు.
మరి మార్చి 31 ఎందుకు వార్తల్లో ఎందుకు ఉంది?
నిజానికి కొన్ని గ్యాస్ సరఫరా కంపెనీలు మార్చి 31ని ఒక 'ఆఫర్ డెడ్‌లైన్'గా ప్రకటించాయి. ఉదాహరణకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో IGL సంస్థ మార్చి 31 లోపు ఎల్‌పీజీ నుంచి పీఎన్‌జీకి మారే వారికి రూ.500 విలువైన ఉచిత గ్యాస్‌ను ఆఫర్ చేస్తోంది. అలాగే మహానగర్ గ్యాస్ లిమిటెడ్ రూ.500 రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేసింది. గెయిల్, బిపీసీఎల్ వంటి సంస్థలు కూడా సెక్యూరిటీ డిపాజిట్ మినహాయింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఇస్తున్నాయి. అంటే ఈ గడువు కేవలం ఆఫర్ల కోసమే తప్ప, కనెక్షన్ రద్దు కోసం కాదు.
కనెక్షన్ తీసుకోవడం ఎలా?
మీరు అద్దెకు ఉంటున్న ఇంట్లో పీఎన్‌జీ కనెక్షన్ ఇవ్వడం టెక్నికల్ కారణాల వల్ల సాధ్యం కాదని గ్యాస్ కంపెనీ 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' ఇస్తే తప్ప, గ్యాస్ పైప్‌లైన్ ఉన్న ఏరియాలో పీఎన్‌జీ తీసుకోవడం తప్పనిసరి. ఇంటి యజమానులే కాకుండా, అద్దెకు ఉండేవారు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే అద్దెదారులు యజమాని నుంచి ఎన్‌ఓసీతో పాటు రెంటల్ అగ్రిమెంట్, కరెంట్ బిల్లు సమర్పించాల్సి ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలు చూసి అనవసరంగా గ్యాస్ సిలిండర్ల విషయంలో కంగారు పడాల్సిన పనిలేదు. మీ ప్రాంతంలో పైప్‌లైన్ గ్యాస్ ఇంకా రాకపోతే లేదా గ్యాస్ కంపెనీ మీ ఇంటికి కనెక్షన్ ఇవ్వలేకపోతే మీరు ప్రస్తుతం ఉన్న ఎల్‌పీజీ కనెక్షన్ కొనసాగుతుందని గుర్తుంచుకోండి.
