అసైన్డ్ భూములు దర్జాగా అమ్మి పత్తాలేకుండా పోయిన లీడర్లు, రియల్టర్లు

అసైన్డ్ భూములు దర్జాగా అమ్మి పత్తాలేకుండా పోయిన లీడర్లు, రియల్టర్లు

అమ్మినోళ్లు, కొన్నోళ్ల మధ్య ఎల్ఆర్ఎస్​ లొల్లి

ప్లాట్ల రెగ్యులరైజేషన్​కు భారంగా మారిన ఓపెన్​స్పేస్ ఫీజులు

లక్షల్లో ఉండడంతో ఎవరు కట్టాలనే దానిపై పంచాయితీలు

శిఖం, అసైన్డ్​ భూముల్లో ప్లాట్లు కొన్నవాళ్లలో ఆందోళన

దర్జాగా అమ్మి పత్తాలేకుండా పోయిన లీడర్లు, రియల్టర్లు

సర్కారు తీరుపై అయోమయంలో సామాన్యులు

యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన సురేష్​ రెండు నెలల కింద గజానికి రూ. 10 వేల చొప్పున  రూ. 20 లక్షలతో 200 గజాల ప్లాటు కొన్నాడు. అడ్వాన్సుగా రూ. 5 లక్షలు ఇచ్చి, మిగిలిన అమౌంట్​ రెండు నెలల్లో చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకునేలా అగ్రిమెంట్​ చేసుకున్నాడు. ఇప్పుడు సర్కారు ఎల్ఆర్ఎస్ తెచ్చింది. దీని కింద రెగ్యులరైజేషన్ ఫీజు రూ. 24 వేలు కాగా, ఓపెన్ ప్లేస్ వ్యాల్యూ 14 శాతం ఫీజు కింద రూ. 1.40 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఓపెన్​ ప్లేస్​ వ్యాల్యూ ఫీజు తాను చెల్లించే ప్రస్తకే లేదని సురేష్​అంటున్నాడు. ముందే ఓపెన్​స్పేస్​ తీసేస్తే ఆ రేటుకు ప్లాట్​ఇచ్చేవాడినే కాదని​ రియల్టర్​అంటున్నాడు. దీంతో వీళ్లిద్దరి నడుమ పంచాయితీ నడుస్తోంది.

యాదాద్రి/జనగామ, వెలుగు: సర్కారు తన ఖజానా నింపుకోవడానికి తెచ్చిన ఎల్ఆర్ఎస్ కారణంగా భూములు అమ్మినవారు, కొన్నవారి నడుమ పంచాయితీలు మొదలయ్యాయి. ముఖ్యంగా 10 పర్సెంట్​ ఓపెన్​ స్పేస్​వదలని వెంచర్లలో ప్లాట్లు కొన్నవారు, ప్లాట్​ మార్కెట్​ వ్యాల్యూలో 14 శాతం ఫీజు చెల్లించాల్సి వస్తోంది. దీంతో తామెందుకు నష్టపోవాలని కొన్నవారు అమ్మినవారిని నిలదీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది ప్లాట్లు ఇప్పటికే అనేక చేతులు మారడంతో ఇప్పుడీ వ్యవహారం అందరి మెడకూ చుట్టుకొని, చివరికి రియల్టర్ల వద్దకు వచ్చి ఆగుతోంది. అడ్వాన్స్​ ఇచ్చి రిజిస్ట్రేషన్​ చేసుకోనివారైతే అగ్రిమెంట్లు క్యాన్సిల్​ చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల కొన్నవారు, అమ్మినవారు చెరోసగం భరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అసైన్డ్​, శిఖం, ఎఫ్ టీఎల్​ భూముల్లోని ప్లాట్లను ఎల్ఆర్ఎస్​ కింద రెగ్యులరైజ్​ చేయబోమని ఆఫీసర్లు చెబుతుండడంతో కొన్నవాళ్లంతా లబోదిబోమంటున్నారు.

ఎవరు భరించాలి?

రాష్ట్రవ్యాప్తంగా అర్బన్ ఏరియాల్లో​3,892, రూరల్ ఏరియాల్లో 11 వేల అక్రమ వెంచర్లు, వీటి పరిధిలో 14,95,745 ప్లాట్లు రూల్స్​కు విరుద్ధంగా ఉన్నాయని ఆఫీసర్లు తేల్చారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్​స్కీమ్​కింద రెగ్యులరైజ్​​చేసుకుంటే తప్ప ఆయా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయబోమని సర్కారు చెబుతోంది.  ఫీజులు చూస్తే వేలకు వేలు ఉండడంతో ఎలా కట్టాలో తెలియక సామాన్యులు సఫర్​ అవుతున్నారు. రెగ్యులరైజ్​ఫీజులు కాస్త అందుబాటులోనే ఉన్నప్పటికీ 10 శాతం ఓపెన్​ప్లేస్​ వదలని వెంచర్లలోని  ప్లాట్లకు ‘ప్రోరాట ఓపెన్​ స్పేస్​చార్జెస్’ కింద  ప్లాట్​ వ్యాల్యూలో ఏకంగా 14 శాతం ఫీజులు వసూలు చేస్తుండడం ప్రధాన సమస్యగా మారింది. అర్బన్​ ఏరియాల్లో 200 గజాల ప్లాటుకు లక్షకు పైగా, రూరల్​ ఏరియాల్లో సుమారు రూ.40 వేల దాకా అవుతుండడంతో ఈ మొత్తాన్ని  అమ్మినవారు భరించాలా.. కొన్నవారు భరించాలా అనే ప్రశ్న వస్తోంది. రియల్టర్లు, భూయజమానులు చేసిన తప్పులకు తామెందుకు బలికావాలని కొన్నవారు ప్రశ్నిస్తున్నారు. తాము ముందే ఓపెన్​స్పేస్​ వదిలితే ప్లాటు ఎక్కువ రేటుకు అమ్మేవాళ్లమని, ఆ మేరకు తక్కువ ధరకు ఇచ్చినందున కొన్నవాళ్లే భరించాలని రియల్టర్లు, భూయజమానులు అంటున్నారు. దీంతో చాలాచోట్ల ఈ వ్యవహారం అమ్మినవాళ్లు, కొన్నవాళ్లకు మధ్య గొడవలకు దారితీస్తోంది. కొన్నిచోట్ల అడ్వాన్స్​ ఇచ్చి రిజిస్ట్రేషన్​ చేసుకోనివాళ్లయితే అగ్రిమెంట్లు క్యాన్సిల్​ చేసుకుంటున్నారు.

శిఖం భూములకు నో ఎల్ఆర్ఎస్​

రాష్ట్రవ్యాప్తంగా పలువురు లీడర్లు, రియల్టర్లు శిఖం, ఎఫ్​టీఎల్,​ అసైన్డ్​ భూముల్లో వెంచర్లు చేసి సామాన్యులకు అమ్మి పత్తా లేకుండా పోయారు. తక్కువ ధరకు వస్తున్నాయని చెరువులు, కుంటలు అని చూడకుండా కొనుగోలు చేసినవారు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. గవర్నమెంట్​ ప్రకటించిన లే అవుట్​ రెగ్యులరైజేషన్ స్కీం వీళ్లకు వర్తించడం లేదు. ఎందుకైనా మంచిదని ఎఫ్​టీఎల్, శిఖం, కాలవల సమీపంలో కొన్నవాళ్లంతా  అప్లై చేస్తున్నా ఆఫీసర్లు రిజెక్ట్​ చేస్తున్నారు. కొందరి అప్లికేషన్లను ప్రస్తుతానికి తీసుకుంటున్నా ఫీల్డ్​ విజిట్​ చేసే టైంలో ఎక్కడ రిజెక్ట్​చేస్తారోనని భయపడుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్​– వరంగల్ హైవే మీద అత్యంత కీలకమైన జనగామలో ల్యాండ్​కు చాలా డిమాండ్​ ఉంది. ఇక్కడ రంగప్ప చెరువు, కొత్త కుంట, గార్లకుంట, బతుకమ్మకుంట, కుమ్మరి కుంట, బుడుగు కుంటను ఆనుకొని శిఖం, ఎఫ్​టీఎల్​పరిధిలో  సుమారు వెయ్యి నుంచి 1500 పైగా ప్లాట్లు ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.  ఇప్పుడు వాటిని కొన్నవారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. రూల్స్​ప్రకారం వెళ్తే ఆఫీసర్లు వీటిని ఎల్ఆర్ఎస్​ కింద రెగ్యులరైజ్​చేయరు. ఒకవేళ ఇదే జరిగితే ఈ భూములను అమ్మిన రియల్టర్లు, లీడర్లను కొన్నవాళ్లు నిలదీయడం ఖాయం. ఈ తరహా గొడవలు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రమాదం ఉందని ఆఫీసర్లు అంటున్నారు.

For More News..

వీడియో: ఒక కాలు లేకున్నా.. ఒంటికాలుతో పొలం పనులు

ఓపెనింగ్ చేయక ముందే కొట్టుకుపోయిన బ్రిడ్జీ

ఉదయం మాయం​.. రాత్రి ప్రత్యక్షం

హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌లో భారీ మార్పులు.. కస్టమర్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి