ముంబైకి లక్నో బ్రేక్​.. 5రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ

ముంబైకి లక్నో బ్రేక్​.. 5రన్స్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ

లక్నో: గెలిస్తే ప్లే ఆఫ్స్‌‌ బెర్తు ఖాయమయ్యే  కీలక మ్యాచ్‌‌లో ముంబై ఇండియన్స్‌‌ చేతులెత్తేసింది. బ్యాటింగ్‌‌ వైఫల్యంతో నార్మల్​ టార్గెట్‌‌ను కూడా ఛేదించలేకపోయింది. మరోవైపు సూపర్​ బౌలింగ్​తో ఆకట్టుకున్న లక్నో సూపర్​ జెయింట్స్​ మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో 5 రన్స్‌‌ తేడాతో ముంబైకి చెక్‌‌ పెట్టింది. టాస్‌‌ ఓడిన  లక్నో తొలుత 20 ఓవర్లలో 177/3 స్కోరు చేసింది. మార్కస్‌‌ స్టోయినిస్‌‌ (47 బాల్స్‌‌లో 4 ఫోర్లు, 8 సిక్స్‌‌లతో 89 నాటౌట్‌‌) దంచికొడితే, క్రునాల్‌‌ పాండ్యా (42 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 1 సిక్స్‌‌తో 49) అండగా నిలిచాడు. తర్వాత ముంబై 20 ఓవర్లలో 172/5 స్కోరుకే పరిమితమైంది. ఇషాన్‌‌ కిషన్‌‌ (39 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 59), రోహిత్‌‌ శర్మ (25 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్స్‌‌లతో 37), టిమ్‌‌ డేవిడ్‌‌ (19 బాల్స్‌‌లో 1 ఫోర్‌‌, 3 సిక్స్‌‌లతో 32 నాటౌట్‌‌) చెలరేగినా ప్రయోజనం లేకపోయింది. స్టోయినిస్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

స్టోయినిస్‌‌ జోరు..

ఆరంభంలో తడబడినా స్టోయినిస్​ జోరుతో లక్నో మంచి స్కోరు చేసింది. మొదట్లో ముంబై బౌలర్లు లక్నోను ఘోరంగా దెబ్బకొట్టారు. మూడో ఓవర్లో వరుస బాల్స్‌‌లో బెరెన్‌‌డార్ఫ్‌‌ (2/30).. దీపక్‌‌ హుడా (5), ప్రేరక్ (0)ను ఔట్‌‌ చేశాడు. ఏడో ఓవర్‌‌లో చావ్లా (1/26).. డికాక్‌‌(16)ను పెవిలియన్‌‌కు పంపడంతో లక్నో 35/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌‌ క్రునాల్‌‌ నిలకడగా ఆడితే, స్టోయినిస్‌‌ తన బ్యాట్‌‌ పవర్‌‌ చూపెట్టాడు. స్పిన్నర్లు షోకీన్‌‌, చావ్లా బౌలింగ్‌‌లో భారీ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అవతలి వైపు పాండ్యా స్ట్రయిక్​ రొటేట్​ చేయడంతో సగం ఓవర్లకు లక్నో 68/3 స్కోరుతో కాస్త తేరుకుంది. ఇక్కడి నుంచి ఇద్దరూ సింగిల్స్‌‌తో పాటు వీలైనప్పుడల్లా బాల్‌‌ను బౌండ్రీకి తరలించారు. అయితే 16వ ఓవర్లో క్రునాల్‌‌ రిటైర్డ్‌‌ కావడంతో నాలుగో వికెట్‌‌కు 82 రన్స్‌‌ పార్ట్​నర్​షిప్​ ముగిసింది.  స్లాగ్‌‌ ఓవర్లలో పూరన్‌‌ (8 నాటౌట్‌‌) అండతో స్టోయినిస్‌‌ దంచికొట్టాడు. జోర్డాన్‌‌ (0/50) వేసిన 18వ ఓవర్‌‌లో 6, 4, 4, 6, 4తో 24 రన్స్‌‌ రాబట్టాడు. తర్వాతి రెండు ఓవర్లలో మూడు సిక్స్‌‌లు కొట్టాడు. ఓవరాల్‌‌గా ఆఖరి మూడు ఓవర్లలో 54 రన్స్‌‌ రావడంతో లక్నో  స్కోరు170 దాటింది.

రోహిత్​సేన చేజేతులా.. 

ఛేజింగ్‌‌లో  ఇషాన్‌‌ కిషన్‌‌, రోహిత్‌‌ అదిరిపోయే ఆరంభం ఇచ్చినా.. వీళ్లు ఔటైన తర్వాత  డీలా పడ్డ ముంబై చేజేతులా ఓడింది. తొలుత ఫోర్‌‌, సిక్స్‌‌తో ఇషాన్‌‌ ఖాతా తెరిస్తే, రోహిత్‌‌ మూడు సిక్సర్లతో జోష్‌‌ తీసుకొచ్చాడు. దీంతో పవర్‌‌ప్లేలో ముంబై 58/0 స్కోరుతో మంచి స్థితిలో నిలిచింది. అయితే 10వ ఓవర్‌‌లో స్పిన్నర్‌‌ రవి బిష్ణోయ్‌‌ (2/26).. రోహిత్‌‌ను ఔట్‌‌ చేయడంతో తొలి వికెట్‌‌కు 90 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. 11వ ఓవర్లో ఫోర్‌‌తో  ఫిఫ్టీ పూర్తి చేసిన  ఇషాన్​ను కూడా బిష్ణోయ్‌‌ ఔట్​ చేశాడు. ఈ టైమ్​లో నెహాల్‌‌ వదేరా (16)  స్లోగా ఆడగా.. 15వ ఓవర్లో యశ్​ ఠాకూర్‌‌ (2/40).. సూర్య (7) వికెట్‌‌ తీసి షాకిచ్చాడు. దీంతో ముంబై 115/3తో ఎదురీత మొదలుపెట్టింది.  ఇదే ఓవర్‌‌లో టిమ్‌‌ డేవిడ్‌‌ రెండు ఫోర్లు కొట్టడంతో టార్గెట్‌‌ 30 బాల్స్‌‌లో 50 రన్స్‌‌గా మారింది. వదేరా, విష్ణు వినోద్‌‌ (2) కూడా ఔట్​ కాగా.. చివరి రెండు ఓవర్లలో  ముంబైకి 30 రన్స్​ అవసరం అయ్యాయి. చివర్లో గ్రీన్‌‌ (4 నాటౌట్‌‌) సాయంతో 19వ ఓవర్లో  డేవిడ్‌‌  రెండు సిక్స్​లు సహా 19 రన్స్​ రాబట్టడంతో ముంబై రేసులోకి వచ్చింది. ఆఖరి ఓవర్‌‌లో   11 రన్స్‌‌ అవసరం కావడంతో ముంబైకే మొగ్గు కనిపించింది.కానీ, అద్భుతంగా బౌలింగ్​ చేసిన మోసిన్​ ఖాన్​ (1/26) ఐదే ఇచ్చి  లక్నోను గెలిపించాడు. 

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 177/3 (స్టోయినిస్‌‌ 89*, క్రునాల్‌‌ 49, బెరెన్‌‌డార్ఫ్‌‌ 2/30). 
ముంబై: 20 ఓవర్లలో 172/5 (ఇషాన్‌‌ 59, రోహిత్‌‌ 37, రవి బిష్ణోయ్‌‌ 2/26).