లక్నో ఖేల్ ఖతం.. ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్‌‌‌‌‌‌‌‌

లక్నో ఖేల్ ఖతం.. ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి ఔట్‌‌‌‌‌‌‌‌

లక్నో: ఐపీఎల్‌‌‌‌–18లో లక్నో సూపర్ జెయింట్స్‌‌‌‌ ప్లే ఆఫ్స్ రేసు నుంచి వైదొలిగింది. ఇప్పటికే  రేసు నుంచి తప్పుకున్న సన్ రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ పోతూపోతూ లక్నో ఆశలపైనా నీళ్లు కుమ్మరించింది. నాకౌట్ రేసులో నిలవాలంటే ప్రతీ మ్యాచ్‌‌‌‌ గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న లక్నోను సొంతగడ్డపై చావు దెబ్బ కొట్టింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (20 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 59) మెరుపులతో సోమవారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో 6 వికెట్లతో లక్నో పై విజయం సాధించింది. దాంతో 12 మ్యాచ్‌‌‌‌ల్లో ఏడో ఓటమి లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలగగా..  రైజర్స్ నాలుగో విజయంతో ఊరట దక్కించుకుంది. 

హైస్కోరింగ్ పోరులో తొలుత లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 205/7 స్కోరు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్‌‌‌‌ (39 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65), ఐడెన్ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ (61 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 61) ఫిఫ్టీలతో విజృంభించగా.. నికోలస్ పూరన్ (26 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 45) రాణించాడు. రైజర్స్‌‌‌‌ బౌలర్లలో ఎషాన్‌‌‌‌ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 18.2  ఓవర్లలో 206/4  స్కోరు చేసి గెలిచింది. అభికి తోడు హెన్రిచ్ క్లాసెన్ (28 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌తో 47 ), కమిందు మెండిస్ (21 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లతో 32 రిటైర్డ్ హర్ట్‌‌‌‌) కూడా రాణించారు. అభిషేక్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

తొలి వికెట్‌‌‌‌కు 115 రన్స్ భాగస్వామ్యం

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ అద్భుత ఆరంభం ఇచ్చారు. వీళ్లు ఔటైన తర్వాత మధ్యలో సన్ రైజర్స్‌‌‌‌ బౌలర్లు పుంజుకొని లక్నో మరింత స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. తొలి సగం ఓవర్లలో మాత్రం మార్ష్, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. కమిన్స్‌‌‌‌ వేసిన ఫస్ట్ ఓవర్లోనే మార్ష్​ 4, 6తో తన ఉద్దేశం ఏంటో చెప్పాడు. హర్ష్‌‌‌‌ దూబే బౌలింగ్‌‌‌‌లోనూ సిక్స్ బాదాడు. నాలుగో ఓవర్లో 6,4తో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ కూడా టచ్‌‌‌‌లోకి రాగా.. మార్ష్‌‌‌‌ అదే జోరు కొనసాగించడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలోనే లక్నో 69/0 స్కోరు చేసింది.

ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా ఓపెనర్లు ఏమాత్రం వెనక్కుతగ్గలేదు. స్పిన్నర్ జీషన్ అన్సారీతో పాటు హర్షల్ పటేల్ బౌలింగ్‌‌‌‌లో మంచి షాట్లు కొట్టడంతో సగం ఓవర్లకు ఆ జట్టు 108/0తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఫిఫ్టీ దాటిన మార్ష్‌‌‌‌ను తర్వాతి ఓవర్లో   ఔట్ చేసిన హర్ష్‌‌‌‌ దూబే ఎట్టకేలకు ఈ జోడీని విడదీశాడు. ఇక్కడి నుంచి రైజర్స్‌‌‌‌ బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. స్లో బాల్స్‌‌‌‌లో రన్స్ కట్టడి చేశారు. మరోసారి ఫెయిలైన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (7) మలింగ బౌలింగ్‌‌‌‌లో బౌల్డ్ అయ్యాడు. 

28 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌తో పాటు హిట్టర్ నికోలస్ పూరన్ షాట్లు ఆడలేకపోవడంతో రన్‌‌‌‌రేట్ తగ్గిపోయింది. హర్షల్‌‌‌‌ పటేల్ వేసిన 16వ  ఓవర్లో సిక్స్‌‌‌‌తో మళ్లీ వేగం పెంచే ప్రయత్నం చేసిన మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌ అదే ఓవర్లో ఫుల్‌‌‌‌ టాస్‌‌‌‌కు బౌల్డ్ అయ్యాడు. ఆయుష్​ బదోనీ (3)ని మలింగ వెనక్కు పంపడంతో జెయింట్స్‌‌‌‌  200 రన్స్ చేయడం కష్టం అనిపించింది.  హర్షల్ వేసిన 19వ ఓవర్లో పూరన్ రెండు ఫోర్లు రాబట్టాడు. నితీశ్ రెడ్డి వేసిన చివరి ఓవర్లో ముగ్గురు రనౌటైనా.. రెండు సిక్సర్లు, ఫోర్ సహా 20 రన్స్‌‌‌‌ రావడంతో లక్నో స్కోరు 200 మార్కు అందుకుంది. 

అభిషేక్‌‌‌‌ ధనాధన్​

భారీ ఛేజింగ్‌‌‌‌ను సన్‌రైజర్స్ మెరుపు వేగంతో మొదలు పెట్టింది. ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా ఓపెనింగ్‌‌‌‌కు వచ్చిన అథర్వ తైడే (13) వెంటవెంటనే మూడు ఫోర్లు కొట్టి రెండో ఓవర్లోనే ఔటైనా.. మరో ఓపెనర్‌‌‌‌‌‌‌‌ అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. ఓ ఎండ్‌‌‌‌లో ఇషాన్ కిషన్‌‌‌‌ (35)ను నిలబెట్టి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న అభి.. ఆకాశ్ దీప్, ఒరూర్క్ ఓవర్లలో రెండేసి ఫోర్లు, సిక్సర్లతో వేగం పెంచాడు. అవేశ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో వరుసగా రెండు ఫోర్లు బాది పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేను 72/1తో ముగించాడు. ఏడో ఓవర్లో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌  రవి బిష్ణోయ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌కు రాగా అభి ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 

ఆ ఓవర్ చివరి నాలుగు బాల్స్‌‌‌‌కు నాలుగు సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో 18 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ, తర్వాతి ఓవర్లో దిగ్వేష్ రాఠీ వేసిన ఔట్‌‌‌‌ సైడ్ ఆఫ్​ గూగ్లీని వెంటాడి శార్దూల్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో రెండో వికెట్‌‌‌‌కు 82  రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న ఇషాన్‌‌‌‌.. మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ బౌలింగ్‌‌‌‌లో 4,6తో జోరందుకోగా  సగం ఓవర్లకు రైజర్స్‌‌‌‌ 120/2తో నిలిచింది.

క్లాసెన్‌‌‌‌ కూడా రెండు ఫోర్లు, ఓ సిక్స్‌‌‌‌తో స్పీడందుకోవడంతో రైజర్స్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ, దిగ్వేశ్ బౌలింగ్‌‌‌‌లో రివర్స్‌‌‌‌ స్వీప్‌‌‌‌కు ట్రై చేసిన ఇషాన్ బౌల్డ్ అవడంతో లక్నో తిరిగి రేసులోకి వచ్చే ప్రయత్నం చేసింది. కానీ, క్లాసెన్‌‌‌‌కు తోడైన కమిందు మెండిస్ ఆ చాన్స్ ఇవ్వలేదు. ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండ్రీలు కొట్టడంతో రైజర్స్ టార్గెట్‌‌‌‌ను ఈజీగానే అందుకుంది. 

సంక్షిప్త స్కోర్లు

లక్నో: 20 ఓవర్లలో 205/7 (మార్ష్‌‌‌‌ 65, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్ 61, మలింగ 2/28)
హైదరాబాద్‌‌‌‌: 18.2  ఓవర్లలో 206/4 (అభిషేక్ 59, క్లాసెన్ 47 ,  దిగ్వేశ్ రాఠీ 2/37).

150 సన్ రైజర్స్ పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హర్షల్ పటేల్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌లో బాల్స్ పరంగా వేగంగా 150 వికెట్లు పడగొట్టిన బౌలర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు.  2,381 బాల్స్‌‌‌‌లో ఈ మార్కు అందుకుని లసిత్ మలింగ (2,444  బాల్స్‌‌‌‌) రికార్డు బ్రేక్ చేశాడు.