గంటల తరబడి కీమోథెరపీకి చెక్.. జస్ట్ 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్ లాంచ్

గంటల తరబడి కీమోథెరపీకి చెక్.. జస్ట్ 7 నిమిషాల్లో క్యాన్సర్ ఇంజెక్షన్ లాంచ్

ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటిగా మారుతోంది. ముఖ్యంగా మనదేశంలో ఇదొక పెద్ద సమస్యగా పరిణమించింది. ఏటా ఇండియాలో 80వేల మందికి పైగా కేవలం ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో సగానికి పైగా ప్రజలు వ్యాధి ముదిరిన స్టేజ్‌లోనే ఆసుపత్రులకు వస్తున్నారు. పైగా వీరిలో ఎక్కువ మంది రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం క్యాన్సర్ బాధితులకు ఇస్తున్న కీమోథెరపీ చికిత్సకు దాదాపు 1 నుండి 3 గంటల సమయం పడుతోంది.

రోచ్ ఫార్మా ఇండియా కంపెనీ 'టెసెంట్రిక్' పేరుతో ఒక సరికొత్త మందును భారత మార్కెట్లోకి పరిచయం చేసింది. ఆసుపత్రుల్లో గంటల కొద్దీ సమయం తీసుకునే సంప్రదాయ IV చికిత్స లాగా కాకుండా.. ఈ పద్ధతిలో మందును నేరుగా చర్మం కిందకు ఇంజెక్షన్ ద్వారా పంపుతారు. దీనికి కేవలం 7 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఇది దేశంలో లంగ్ క్యాన్సర్ చికిత్సలో ఒక మైలురాయిగా నిలవనుంది.

►ALSO READ | ఆధ్యాత్మికం: సంతోషంగా జీవించాలంటే.. మనసుని ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలో తెలుసా..!

ఈ మందు మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపించి, క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి సహాయపడుతుంది. ఈ ఇంజెక్షన్‌కు భారత ఔషధ నియంత్రణ మండలి ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీనివల్ల చికిత్స సమయం 80 శాతం వరకు తగ్గుతుంది. ఫలితంగా రోగులు ఆసుపత్రుల్లో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం తప్పుతుంది. అయితే ఈ మందు ధర మాత్రం సామాన్యులకు పెను సవాలుగా మారింది. ఈ ఇంజెక్షన్ ఒక్కో డోస్ ధర అక్షరాలా రూ.3లక్షల 60వేలుగా ఉంది. క్యాన్సర్ తీవ్రతను బట్టి రోగులు 3 నుంచి 6 డోసుల వరకు దీనిని ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు.