సంతోషం అంటే ఏమిటి? సుఖంగా బతకాలంటే ఏం చేయాలి? మనసుని ప్రశాంతంగా ఉంచడం ఎలా? ఇలా ఎన్నో ఆలోచనలు చేస్తోంది సమాజం. ఈ సమస్యకు వేల ఏళ్ల క్రితమే పరిష్కారం చెప్పాడు బుద్ధుడు. సుఖదుఃఖాలకు కారణాలే కాదు. సంతోషానికి మార్గాన్ని కూడా చూపాడు.
ధర్మం అంటే స్వభావం. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో జీవజాతులున్నాయి. ఒక్కొక్క జీవ జాతికి ఒక్కో స్వభావం ఉంటుంది. అవన్నీ తమ స్వభావానికి తగ్గట్లే నడుచుకుంటాయి. వాటి సహజ స్వభావమే తృప్తిని, సంతోషాన్నిస్తుంది. జింకలు, ఆవులు, బర్రెల్లాంటివి మాంసాన్ని తినడం.. పులులు, సింహాలు గడ్డి మేయడం.. తొక్కినా పాములు కరవకపోవడం.. పట్టుకుంటే తేళ్లు కుట్టకపోవడం.. లాంటివన్నీ అసహజం. ప్రకృతిలో రకరకాల సహజ స్వభావాలు గల జీవులున్నట్లే... మనిషి కూడా ఒక జీవే. మనిషి సహజ స్వభావం ఏమిటి? నైజం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా ఉన్నాయి.
మనసే మూలం: “పుట్టుకతో మనిషి పశువు" అని చెప్పారు కొందరు. కాముకత్వమే మనిషి సహజ నైజం అన్నారు ఇంకొందరు. హింస, విధ్వంసాలే మనిషి ప్రవృత్తి అన్నారు మరికొందరు. "మనిషి సహజ నైజం ఈ జన్మకు సంబంధించినది కాదు. అది పూర్వ జన్మ కర్మఫలం అన్నారు ఇంకొందరు. ఇలా ఎందరో తాత్వికులు మనిషిని మనిషిగా చూడలేదు.
అందుకే వాళ్లంతా మనిషి తాత్కాలికంగా ఎలా సంతోషంగాఉండగలదో చెప్పారు. కానీ, శాశ్వత దుఃఖ నివారణ గురించి చెప్పలేకపోయారు. కానీ, మనిషిని, మనసుని కేంద్రంగా చేసుకుని మానవుడి సహజ స్వభావాన్ని తెలియజేశాడు గౌతమ బుద్ధుడు. ఏం పాటిస్తే, వేటిని ఆచరిస్తే, దేన్ని దైనందిన జీవితంగా మలచుకుంటే మనిషి దుఃఖానికి దూరం అవుతాడు అనే సత్యాన్ని ఆవిష్కరించాడు బుద్ధుడు.
'ధర్మం' అంటే 'ధరించేది' అని అర్థం. 'ధరతి విశ్వం ధర్మః' అంటారు. అంటే.. విశ్వాన్ని ధరించేది అని.. విశ్వాన్ని ధరించేదే కాదు, ప్రపంచమే ధరించేది అనడం ఇంకా సరైనమాట. అలాగే.."ధరతి లోకానితి ధర్మః" లోకాల్ని ధరించేదని. మనిషి తొలిగా చేయడానికి పూనుకోవాల్సింది ఇదే. అందుకే 'థ్రియతే వా జనైరితి ధర్మః' అంటారు. అంటే జనం పూనిక చేయాల్సిందని. ఇంకా 'ధరతీతి ధర్మః' అంటారు. అంటే ధరించేది ధర్మం అని. అంటేమనుషులు ధరించవలసింది ధర్మం.
మనిషికి సుఖాన్నిచ్చేది: శరీరానికి వేసవిలో నూలు. శీతాకాలంలో ఊలు...వర్షంలో నైలాను బట్టలు సుఖాన్నిచ్చినట్లు.. 'ధర్మం' అనేది ఎల్లప్పుడూ మనిషికి సుఖాన్నిస్తుంది. ధర్మాన్ని ధరిస్తేనే దుఃఖం తొలగి, సుఖం దక్కుతుందని చెప్పేది బౌద్ధ ధర్మం. సుఖదుఃఖాలన్నీ జీవన చర్యలు, జీవన మార్గాన్ని బట్టి ఉంటాయి. సంస్కృతి, నాగరికతలే ఈ సుఖదుఃఖాల్ని తెస్తాయి.
ఈర్ష, అసూయ, ద్వేషాల ప్రభావం వల్లే మనిషికి చెడు ఆలోచనలు, చెడు ఆచరణలు, అకుశల కర్మలు. ఇవి ఉన్నంత వరకూ సుఖం లేదు.. రాదు. ఇవి సహజ స్వభావాలు కాదు. తెచ్చిపెట్టుకున్నవే! కాబట్టి వాటిని తొలగించుకుంటే మనిషిలో సహజ స్వభావం మిగిలిపోతుంది. అప్పుడది సుఖాన్నిస్తుంది.
కాబట్టి ఈ కామ, క్రోధ, ఈర్ష్య, అసూయ, ద్వేషాలనే మలినాల్ని మనం వదిలించుకోవాలి. అలా చేయాలంటే.. వాటిస్థానే అంటే అకుశల కర్మల స్థానే కుశల కర్మలు చేయాలి. అవి చస్తే మనం దుఃఖరహితులమవుతాం. అంటే ఆ కుశల కర్మలే మన 'సహజ స్వభావం' అనేది బుద్ధుడు ఆవిష్కరించిన సత్యం, ధర్మం.
దుఃఖాచారం: మనిషికి దురాచారం కంటే సదాచారం సుఖాన్నిస్తుంది. దొంగతనం కంటే దానం ఆనందాన్నిస్తుంది. దొంగతనంలో సంపద వచ్చి పడుతుంది. దానంలో కొంత సంపద పోతుంది. అది... మనకు తెలిసే పోతుంది. కాబట్టి దాన్ని 'త్యాగం' అంటాం. త్యాగం అంటేనే దానం. నిత్య జీవితంలో చూడండి. సంపదను పెంచిన దొంగతనమా? దానమా? ఏది సంతోషాన్నిస్తుంది? దొంగ.. దొంగతనానికి వెళ్లేముందు, చేస్తున్నప్పుడు, చేశాక కూడా భయంతోనే ఉంటాడు. భయం భయంగానే బతుకుతాడు. అలా బతకడమే దుఃఖం. 'దుఃఖం' అంటే బోరున ఏడ్వడం కాదు.
సుఖాచారం: దానం ఇవ్వబోయేముందు, ఇస్తున్నప్పుడు, ఇచ్చాక కూడా సంతోషంగానే ఉంటాడు దాత. కాబట్టి అన్ని వేళలా మనం ఏ పని చేస్తే సుఖం కలుగుతుందో దాన్నే మనం ధరించాలి. అదే ధర్మం. బుద్ధుడు ఆవిష్కరించిన విషయం ఇదే. 'మంచితనం' మనిషి స్వభావం. మానవులకు ఉండే ఆ స్వభావమే మానవీయత. మానవీయత మనిషి ధరించాల్సిన ధర్మం. అదే సుఖాన్నిస్తుంది. దుఃఖాన్ని దూరం చేస్తుంది. కాబట్టే... "ధర్మం శరణం గచ్ఛామి" అన్నారు
సుఖసంతోషాలకు దారి : బుద్దుడు 'మనిషికి సుఖాన్నిచ్చేది ఏది? శుభాన్నిచ్చేది ఏది?' అని తర్కించుకున్నాడు. శోధించాడు. ఆ శోధన ఫలితమే ఆయన చూపించిన దుఃఖ నివారణ మార్గం. అదే 'ధమ్మం'. ఆ ధమ్మ (ధర్మం)మే మనిషి సహజ స్వభావం. అంటే ధమ్మాన్ని పాటిస్తే మనిషి సంతోషపడతాడు. సుఖంగా మనగలుగుతాడు. ధమ్మాన్ని తప్పితే దుఃఖంలోపడి అలమటిస్తాడు. కాబట్టి ధమ్మ ఆచరణే మనిషికి ప్రాథమిక కర్తవ్యం. కాబట్టి ఇన్నివేల సంవత్సరాలుగా, ఈ భూమిపై అన్ని ప్రాంతాల మనుషుల మనసుల్లో బుద్దుడు చెప్పిన ఆ ధర్మం చిరంజీవిగా ఉంది. ఉండగలిగింది.. ఉంటుంది.
ధర్మం శరణం గచ్చామి : "బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్చామి"ఈ మూడు బౌద్ధ త్రిరత్నాలు. బుద్దుని, ధర్మాన్ని, సంఘాన్ని శరణు వేడుతున్నాను' అని వీటి అర్థం. 'ధమ్మం' అనేది పాళీ పదం. ఈ పదాన్ని సంస్కృతీకరించి 'ధర్మం'గా మార్చారు. బుద్దుని ప్రభోదాలన్నీ ఆనాటి ప్రజల భాషైన పాళీలో ఉండటం వల్ల బౌద్ధ సాహిత్యంలో "ధమ్మం"అనే పదమే అంతటా కనిపిస్తుంది. బౌద్ధాన్నే 'ధమ్మం' అనే పేరుతో కూడా పిలుస్తారు.
