BCCI vs KKR: ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. ఆటగాళ్ల ఫిట్‌నెస్ పై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శనివారం (మే 16న ) ఈడెన్ గార్డెన్స్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 29 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కానీ, ఈ మ్యాచ్‌లో గాయంతో బాధపడుతున్న టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించడం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీసింది. బీసీసీఐ (BCCI) సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన వరుణ్ కి గాయం ఉన్నప్పటికీ కేకేఆర్ జట్టు మైదానంలోకి దించడంపై భారత క్రికెట్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
అసలేం జరిగింది?:
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి గాయపడి మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన ముఖ్యమైన మ్యాచ్‌కు కూడా అతడు దూరంగా ఉన్నాడు. స్కాన్ రిపోర్టుల్లో వరుణ్ చక్రవర్తి ఎడమ కాలికి 'హెయిర్‌లైన్ ఫ్రాక్చర్' అయినట్లు తేలింది. ఇలాంటి తీవ్రమైన గాయం ఉన్నప్పటికీ, శనివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే అతడిని తుది జట్టులోకి తీసుకోవడమే కాకుండా, తన కోటా 4 ఓవర్లు పూర్తిగా బౌలింగ్ చేయించాడు. అంతేకాదు వరుణ్ చక్రవర్తి మైదానంలో ఫీల్డింగ్ కూడా చేశాడు.
విచారణకు బీసీసీఐ ఆదేశం?:
ముందు ముందు టీమిండియా ఆడబోయే అంతర్జాతీయ టీ20 సిరీస్‌లలో వరుణ్ చక్రవర్తి కీలక బౌలర్. బోర్డు పరిధిలో ఉన్న ఆటగాడి ఫిట్‌నెస్‌ను పణంగా పెట్టి ఫ్రాంచైజీ మ్యాచ్ ఆడించడంపై బీసీసీఐ సీరియస్ అయింది. పిటిఐ (PTI) నివేదిక ప్రకారం.. శనివారం నాడు జరిగిన ఘటనను భారత్ క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించిందని, దీనిపై కేకేఆర్ ఫ్రాంచైజీపై అధికారిక విచారణ (Inquiry) చేపట్టే ఛాన్స్ ఉందని సమాచారం.
►ALSO READ | టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై.. తుది జట్టులో ధోనీకి నో ఛాన్స్
బీసీసీఐతో కేకేఆర్ కి పాత గొడవలు:
ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ ఫ్రాంచైజీకి, బీసీసీఐకి మధ్య వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ సీజన్ ప్రారంభానికి ముందే ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చాయి. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముస్తాఫిజుర్ రెహమాన్ ను జట్టు నుంచి రిలీజ్ చేయాలని బీసీసీఐ కేకేఆర్‌ను ఆదేశించింది. ఇది ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఆ జట్టు ప్రధాన పేసర్లు హర్షిత్ రాణా, మతీషా పతిరణ గాయాల వల్ల దూరమవగా.. రిజర్వ్ బెంజ్ బౌలర్ ఆకాష్ దీప్ కూడా గాయపడ్డాడు.
బౌలర్ల కొరతతో కేకేఆర్ ఇబ్బంది:
బౌలర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న కేకేఆర్.. ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఒత్తిడిలోనే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని ఆడించినప్పటికీ.. దేశీయ ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో బీసీసీఐ తీసుకోబోయే తదుపరి చర్యలు ఇప్పుడు కేకేఆర్ క్యాంప్‌లో టెన్షన్ పుట్టిస్తున్నాయి.
