ఆధ్యాత్మికం : మన గురించి మనం ఆలోచించటం స్వార్థం అవుతుందా.. స్వార్థం మంచిదా చెడ్డదా..?

ఆధ్యాత్మికం : మన గురించి మనం ఆలోచించటం స్వార్థం అవుతుందా.. స్వార్థం మంచిదా చెడ్డదా..?

 ఒక్కటే ప్రశ్న.. 'స్వార్థం మంచిదా లేక చెడ్డదా?' అందరి నోటినుంచి ఠక్కున వచ్చే జవాబు ముమ్మాటికి చెడ్డదే. కానీ, నిజంగా స్వార్థం అంత చెడ్డదా? లాభాన్ని ఆశించడం క్షమించరాని తప్పా? మన గురించి మనం ఆలోచించుకోవడం అంత పెద్ద పాపమా? కానే కాదు. ఎందుకంటే అసలు స్వార్థంలో ఇసుమంతైనా తప్పులేదు. కానీ, ఆ స్వార్థం ఎందుకోసం అన్నదే మనుషులు స్వార్థపరులా? కాదా? అన్న విషయాన్ని చెప్తుంది. అది అర్థం చేసుకోవాలంటే స్వార్థంలో ఉన్న రెండు కోణాల్ని చూడాలి.

స్వార్థం.. ఈ పదం మనకి ప్రతిరోజూ వినబడుతూనే ఉంటుంది. అతను స్వార్థపరుడని.. వాళ్లు స్వార్థంతో చేయకూడని పనులెన్నో చేశారని.. ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. ఈ లోకం మొత్తం స్వార్థాన్ని నేరంగానే చూస్తుంటుంది కూడా. కానీ, నిజంగా స్వార్థం అంత చెడ్డదా? అంటే లేదు... ఎందుకంటే స్వార్థంలోని మొదటి అక్షరం 'స్వ' అంటే స్వయం అని అర్ధం. అంటే ఏ పనిలో కేవలం స్వయం అనే అర్థం ఉందో, కేవలం స్వీయలాభం మాత్రమే ఉందో అదే స్వార్థం. ఇక్కడ అందర్నీ వెంటాడే ప్రశ్న ఒక్కటే స్వార్థంలో ఉన్న ఆ 'స్వయం' అనేది తప్పేకదా అని... అవును.. ఆ స్వయంలో మనం మాత్రమే ఉంటే కచ్చితంగా స్వార్థపరులమే.

ఒకవేళ మన స్వయంలో మన కుటుంబం ఉంటే.. మనం 'పరివార ప్రేమికులం' అవుతాం. అదే స్వయంలో మన ఇరుగుపొరుగు ఉంటే 'పరోపకారులం' అవుతాం. అదే ఈ స్వయంలో ఈ ప్రపంచం మొత్తం ఉంటే అప్పుడు మన స్వార్థం 'పరమార్థం' అవుతుంది. అందుకే స్వార్థానికి దూరంగా వెళ్లకూడదు. దాన్ని మరింత పెంచుకోవాలి. అందులో మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్లని కూడా కలుపుకోవాలి. అప్పుడు అది స్వార్ధం కాదు. మనిషికి అన్నింటికన్నామంచి లక్షణం అదే అవుతుంది. అందుకు ఉదాహరణే భాగవత గాథ.

ఇద్దరిదీ స్వార్ధమే కానీ...

భాగవతం మొత్తంలో పరమ స్వార్ధపరుడు కంసుడు. ఆకాశవాణి మాటలు విని అపురూపంగా పెంచుకున్న చెల్లిని, ఆమె భర్తని చంపాలనుకున్నాడు. చివరకు వాళ్లు ప్రాధేయపడటంతో బంధిస్తాడు. వాళ్ల సంతానాన్ని చంపేస్తాడు. తాను మాత్రమే రాజు అవ్వాలన్న స్వార్థంతో బాంధవ్యాన్ని మర్చిపోయి. కన్న తండ్రిని కూడా కారాగారంలో పెడతాడు.

తన స్వార్థం కోసం రాక్షస రాజులు, బాణుడు, భౌముడు, జరాసంధుడు మొదలైన వాళ్లతో స్నేహం చేసి యదువంశీయులతో వైరం పెంచుకుంటాడు. శ్రీమహావిష్ణువే మరోచోట పుట్టి పెరుగుతున్నాడన్న విషయం తెలియగానే.. అతడ్ని చంపడానికి చుట్టుపక్కల రాజ్యాలన్నీ జల్లెడ పట్టిస్తాడు. తన ప్రాణం కాపాడుకోవడానికి ఎంతోమంది చిన్న పిల్లల ప్రాణాలు బలితీసుకుంటాడు. జీవితంలో చివరి నిమిషం వరకు తన గురించి మాత్రమే ఆలోచించుకుంటాడు. అందులో తను తప్ప..... కుటుంబం, రాజ్యం.. ఇలా ఎవరూ ఉండరు. అందుకే కంసుడు పరమ స్వార్థపరుడయ్యాడు.


అలాంటి కంసుడిపై శ్రీకృష్ణుడు యుద్ధం చేశాడు. ప్రాణాలు తీశాడు. అందులోనూ స్వార్థం ఉంది. కానీ, ఆ స్వార్థంలో తన తల్లిదండ్రులున్నారు. తన రాజ్యంలోని ప్రజల క్షేమం ఉంది. సమస్త లోకాల్ని నడిపే ధర్మం ఉంది. అందుకే శ్రీకృష్ణుడి స్వార్థంపరమార్థమైంది.

మహాభారత యుద్ధంలో జరిగింది కూడా ఇదే. శ్రీకృష్ణుడు ఆ మహాయుద్ధంలో అర్జునుడికి రథ సారధి అయ్యాడు. గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేశాడు. కౌరవుల రాజ్యాన్ని పడగొట్టడానికి ఎన్నో మాయలు చేశాడు. కానీ, అక్కడ కూడా అతని స్వార్ధంలో లోక ధర్మం ఉంది. అదే యుద్ధంలో శకుని పాత్ర చూస్తే.. అతని స్వార్ధమే ఆ యుద్ధానికి మూల కారణమైంది..

తన స్వలాభం కోసం ఎన్నో పాపాలు చేశాడు శకుని. చివరికి ఆ స్వార్ధమే అతడి మింగేసింది. మన విషయంలోనూ ఇదే జరుగుతుంది. మన స్వార్థం కల్మషం లేనిది అయితే పరమార్ధం అవుతుంది. అదే మన స్వార్థంలో మనం మాత్రమే ఉంటే.. మనకే హాని తలపెడుతుంది. కానీ, ఇది అర్థం చేసుకునేది చాలా కొద్దిమందే.

మన స్వార్థంలో అందరూ ఉండాలి

అందరూ స్వార్థాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి. కానీ, అందులో మనం మాత్రమే ఉండకూడదు. మన ప్రయోజనాలు మాత్రమే ఉండకూడదు. మన స్వార్థం ఎప్పుడూ మన అభివృద్ధి కోసం, సొసైటీలో మన పేరు, ప్రతిష్టలు పెంచుకోవడానికి.. ఇతరుల కంటే అన్ని విషయాల్లో ముందుండటానికే కాకూడదు. అలాంటి స్వార్థం మన పనులకు వేరొకర్ని బాధ్యుల్ని చేస్తుంది.

ముఖ్యంగా ఎవరో ఒకరు ఎప్పుడూ మనతోనే ఉంటూ.. మనల్ని నిలబెడుతూ..మనకు ఎప్పుడూ సాయం చేస్తూ ఉంటే.. అలాంటి వాళ్లని మన స్వార్థం కోసం వాడుకుంటే..పతనమయ్యేది మనమే. స్వలాభం మన నాశనానికే కారణం అవుతుంది. చుట్టూ ఉన్నవాళ్లందర్నీ దూరం చేసి ఏకాకిని చేస్తుంది. మనకి రకరకాల పేర్లు పెడుతుంది. అందుకే 'నా' అనే దాంట్లో అందర్నీ కలుపుకోవాలి. మనతో పాటు మన కుటుంబం, ఇరుగుపొరుగు.. మన చుట్టూ ఉన్న చెట్టూపుట్టలూ.. ఇలా మన స్వార్థంలో అందరూ ఉండాలి.. అలాంటి స్వార్థం ఎప్పుడూ మంచే చేస్తుంది.