ఆధ్యాత్మికం:  కాళికాంబ సప్తశతిలో  బహుజన దృక్పథం.. దీనులను రక్షించడమే తన ధ్యేయం

ఆధ్యాత్మికం:  కాళికాంబ సప్తశతిలో  బహుజన దృక్పథం.. దీనులను రక్షించడమే తన ధ్యేయం

పోతులూరి వీరబ్రహ్మం గారు పరిశోధకుల నిర్ధారణ ప్రకారం 1608 లో జన్మించి 1693 లో సజీవంగా సమాధి అయ్యారు. అంటే 17 వ శతాబ్ధి మొత్తం కాలంతో ఆయన జీవితం ముడిపడి ఉంది. ఆనాటి తెలుగు ప్రాంతం రాచరిక వ్యవస్థ తుది దశలో ఒకరకంగా భూస్వామ్య వ్యవస్థ తొలిదశలో ఉంది. ఆ కాలంలో ప్రజల మీద రాజ్యహింస ఉండేది. 

ప్రజలను పీడించకుండా రాజ్యాలు, రాజులు మనుగడ సాగించిన సందర్భాలు లేవు. ఆనాటి సామాజిక వ్యవస్థలో కులబేధాలు తారాస్థాయికి చేరిన పరిస్థితి వీరబ్రహ్మం గారి రచనలతో పాటు తనకు కొంతకాలం  ముందు జీవించిన వేమన రచనల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. 

ఆ కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. సహజంగానే దానివల్ల ప్రజల నమ్మకాలలో మూఢవిశ్వాసాలు చోటు చేసుకునేవి. ఇటువంటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో వీరబ్రహ్మం కవిగా ముందుకువచ్చారు. ఇలాంటి స్థితి కవులను రెండే రెండు విభాగాలుగా విభజిస్తుంది. అయితే రాజాస్థానాలను చేరి వారికి అనుకూలమైన కవిత్వం రాసేవారు ఒకవర్గం. అంటే ప్రజా వ్యతిరేక దృక్పథం కలిగినవాళ్లు ఈ పని చేస్తారు. 

ప్రజల వైపు నిలబడి వారిని చైతన్యపరుస్తూ కవిత్వం చెప్పేవారు రెండవ వర్గానికి చెందుతారు. వీళ్లకు ప్రజలను పీడించే రాచరిక వ్యవస్థ పట్ల ఏహ్య భావముంటుంది. వేమన, వీరబ్రహ్మం అటువంటి కవులే. వీళ్లు రాజాశ్రయాన్ని ఆశించకుండా ప్రజాశ్రయాన్ని పొందిన కవులు. తమకాలం నాటి కవులందరికంటే భిన్నంగా వ్యవహరించిన వీళ్లు మధ్య యుగపు విప్లవ కవులు.

వీరబ్రహ్మం గారిని తెలుగు ప్రాంతంలో అవతార పురుషునిగా కొలుస్తారు. కానీ.. ఆయనొక చారిత్రక వ్యక్తి. పుట్టుకరీత్యా ఆయన శూద్రుడు. ప్రజలు ఆయనను ఎంత దైవాంశ సంభూతునిగా భావించినా వర్ణాశ్రమ ధర్మం ఆయనను నెత్తిమీద పెట్టుకోలేదు.‘‘విశ్వ కర్మ నేను విప్రులు మీరయా” అన్న పద్యంలో తనను కులంపేరుతో తృణీకరించిన వాళ్లను విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయన ఆధ్యాత్మిక రంగంలోనే ఒక ప్రత్యేకమైన ఏర్పాటును చేసుకోవాల్సి వచ్చింది. వీరబ్రహ్మం గారిది బహుజన దృక్పథం. ఈ దృక్పథం ఆయన జీవితం మొత్తంలో  సిద్ధాంత రూపంలోనూ, ఆచరణ రూపంలోనూ పెనవేసుకొని సాగింది. 

ఇటు రచనల్లోనూ, ఆధ్యాత్మిక ఆచరణలోనూ ఆయన ఒకే మాట మీద నిలబడ్డారు.చెప్పిందే చేశారు. చేసిందే చెప్పారు. దానికి నిదర్శనంగా ఆయన కింది కులాలవారిని, అన్యమతాల వారిని శిష్యులుగా చేర్చుకున్నారు. తను ఆధ్యాత్మిక జీవితం ద్వారా ఏం సాధించారో తాను రాసిన కాళికాంబ సప్తశతిలోని 699వ పద్యంలో చెప్పారు.

ఆ. వె. కులమతాల జాడ్యములలోన దపియించు
 దీనజనుల సేద దీర్చు వాడ
మానవుండె ధరను మాధవుండనువాడు
కాళికాంబ హంస కాళికాంబ

కులమతాల కోరల్లో చిక్కిన దీనులను రక్షించడమే తన ధ్యేయమని స్పష్టంగా చెప్పారు వీరబ్రహ్మం. తనకాలం నాటికి వాటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటే ఆయన ఈ మాట అని ఉంటారు. ఆయన ఒక సంస్కర్తగా ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రధానమైన సమస్యలపైన గురిపెట్టారు. ఈ ప్రయత్నం చేసిన వాడే దేవుడవుతాడని కూడా స్పష్టం చేశారు. బహుశా! ఆయన చెప్పిన విధంగానే సామాన్యులు ఆయనను దేవునిగా ఆరాధిస్తున్నారు. దీనికి కారణం ఆయనకు గల బహుజన దృష్టికోణం.

ఆ.వె. అన్న మయములైనవన్ని జీవంబులు
 కూడు లేక జీవకోటి లేదు
 కూడు దినెడు కాడ కులబేధమేలకో
(కాళికాంబ సప్తశతి-661) 

అన్నది ఆయన సిద్ధాంతం. ఇది బహుజన సిద్ధాంతం. బహుజన దృష్టికోణంలోని ప్రధానమైన అంశం కుల బేధ నిరసన. కులబేధాలు నశిస్తేనే బహుజనుల ఐక్యత సిద్ధిస్తుంది. బహుజనులు ఐక్యంగా పోరాడితేనే రాజ్యాధికారం సిద్ధిస్తుంది. రాజ్యాధికారం మాత్రమే వందలేళ్లుగా బహుజనులు కోల్పోయిన ఆత్మగౌరవాన్ని తీసుకొస్తుంది. ఇదంతా ఆధునిక భావన. కానీ, ఈ క్రమంలో అత్యంత ప్రాధాన్యత వహించే అంశం కులబేధాల పట్ల నిరసన.వీరబ్రహ్మం గారి రచనల్లో అడుగడుగునా ఈ నిరసన వ్యక్తం అవుతుంది.

ఆ. వె. ఇలకు దిగెడు వేళ కులమెవ్వరికి లేదు
మొదలు శూద్రుడుగను పుట్టువందు
శ్రుతులు చదువు వెనుక శూద్రుండె విప్రుడౌ
(కాళికాంబ సప్తశతి-116) 

అని పుట్టుకతో అందరూ శూద్రులేనని సమానత్వ సూత్రాన్ని బోధించాడు. అంటే వీరబ్రహ్మం చెప్పే శూద్రత్వం శ్రుతులు చదవటం ద్వారా పోతుంది. వర్ణ వ్యవస్థను వ్యవస్థీకృతం చేసిన అగ్రవర్ణాల సిద్ధాంతాలకు ఇది పూర్తిగా వ్యతిరేకమైన భావన. ఇలా బహుజనులకు వ్యతిరేకంగా నిలబడిన బ్రహ్మణీయ భావజాలాన్ని తిరుగులేని విధంగా, సందర్భానుసారంగా ఖండించటం చాలాచోట్ల కనిపిస్తుంది. 

ఇలాంటిదే 296 వ పద్యం.
ఆ. వె. సర్వ మానవులను సమముగా ప్రేమించు
 కులమతాలనెంచి కోపపడకు
కాపు జాతినెల్ల కరుణించుమనె శ్రుతుల్.

శూద్రుల పట్ల వేదాలు కరుణ చూపించమంటే పండితులు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న ఆవేదన ఆయనలో ఉన్నట్టుంది. చాలా సందర్భాల్లో వేదాలు అందరివీ అన్న భావన వీరబ్రహ్మం గారు వ్యక్తం చేస్తారు. 

‘‘పరమ మైన బ్రహ్మ మెరుగు వాడు
వేద శాస్త్రములను వీక్షింపగా బోడు’’
(సప్త శతిలోని 671 వ పద్యం) అని అన్నారు. 

అంటే సత్యమేమిటో తెలిసిన వాడు వేదాలనీ, ఇంకొకటి అనీ తిరుగడని అర్థం. ఇంతకుముందు వేదాల గురించి ఆయన చెప్పిన అభిప్రాయాలు వేదాల ఆధిక్యత నేపథ్యంలో చెప్పినవి కావు. వేదాలైనా, ఇంకో ధార్మిక గ్రంథమైనా చదవటానికి వారు పుట్టిన కులం అర్హతను నిర్ణయించదని చెప్పటం కోసమే ఆయన అలా చెప్పారు. ఇది బహుజన తాత్విక దృక్పథానికి నిదర్శనం.వీరబ్రహ్మం దేవుణ్ణి, దైవారాదను బహుజనుల వైపు నుంచి కొత్తగా నిర్వచించారు. 

291 వ పద్యంలో-
ఆ.వె. సాటి మానవునకు సాయమ్ము పడబోక
నల్లరాళ్లు తెచ్చి గుళ్ళు కట్టి
 మ్రొక్కులిడిన బతుకు చక్కపడంబోదు- 

అంటారు. ఇది పూర్తిగా ఆధ్యాత్మిక రంగంలో  ఒక కొత్తచూపు. 


‘‘సర్వ దేవతలకు సదనమ్ము దేహమ్ము
   గుడులకేగి పాట్లు పడగ నేల’

-అన్న పద్యంలో కూడా ఇదే భావన కనిపిస్తుంది. దేహమే దేవాలయం అని చెప్పటం ‘‘అచల సిద్ధాంత” ప్రభావం. వీరబ్రహ్మం రాజయోగాన్ని ప్రచారం చేశాడు. దీనిప్రకారం సాధన ద్వారా ఎవరైనా మోక్షాన్ని సాధించవచ్చు. మోక్ష సాధనకు కులమో ఇంకొకటో అడ్డు కాదు. ఈ ప్రయాణంలో అందరూ సమానమే. ఈ ప్రభావంతోనే ఆయన...

శ్వేత శిలకు మొక్క చెప్పెనా దైవంబు
నీతి లేక జనులు సూతబడిరి
 శిలకు మొక్కునంత చిక్కునా దైవంబు-

అని అన్నారు. రాజయోగం విగ్రహారాధనను సమర్థించదు. అందుకే ఒక తత్వ గీతంలో ‘‘చిల్లర రాళ్లకు మొక్కుతునుంటే-చిత్తము చెడునురా ఒరేఒరే’’అని అంటారు. బహుజన సంస్కృతిలో మొదటినుంచీ విగ్రహారాధనకు బదులు ప్రాకృతిక చిహ్నారాధన ప్రాముఖ్యత వహించింది. గుడులు లేకుండా, స్పష్టమైన రూపాలు లేకుండా పసుపు కుంకుమలు చల్లిన ఒక మామూలు రాయిని  మైసమ్మగా, పోచమ్మగా కొలిచే పద్ధతి బహుజనులది. .

ఆ.వె. తల్లిదండ్రి గురువు దైవమ్ము లందున
 తల్లి పూజ ముఖ్యమెల్లరకును
 సృష్టికంతటికిని స్త్రీప్రధానము గదా! 

(24 వ పద్యం) అంటారు వీరబ్రహ్మం. స్త్రీ ప్రాముఖ్యతను ఇంతకన్నా గొప్పగా ఇక చెప్పటం సాధ్యం కాదు. నిజానికి ఆధ్యాత్మిక స్పర్శతో ఉన్న చాలా మంది స్త్రీలను రకరకాల కారణాలతో దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. కానీ వీరబ్రహ్మం గారు తన భార్యతో ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పంచుకున్నారు. 

ఆమెకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు. ఆయన గ్రహించిన జీవిత సత్యాన్ని ఆధ్యాత్మిక బోధనల రూపంలో, ఉపదేశం రూపంలో భార్య గోవిందమ్మకు, తనను ఆదరించిన గరిమిరెడ్డి అచ్చమ్మకు, కూతురు వీరనారాయణమ్మకు అందించారు. 

 వీరబ్రహ్మం కాలంలోని తెలుగు కవులందరూ ప్రబంధాలు రాసి ఆడవాళ్లను వ్యక్తిత్వ ప్రధానంగా కాక శృంగార వర్ణనలకు మాత్రమే పరిమితం చేసి వర్ణించారు. కానీ వీరబ్రహ్మం గారు దానికి భిన్నంగా  స్త్రీలను గౌరవ మర్యాదలతో సంబోధించారు. ఏ మహిళనైనా తల్లిగా చూడాలనే  మహత్తరమైన సందేశాన్ని ఇచ్చారు.

221 వ పద్యంలో
ఆ. వె. మాతృ పూజ చేయు మగవారికెల్లను
 అన్యకాంత తల్లియట్లు తోచు
ఎరుక మరచు వాడు నరకమ్ము పాలౌను 

అంటారు. తన కాలానికి భిన్నంగా మహిళల పట్ల ఆయన చూపిన గౌరవాదరాలు బహుజన సంస్కృతికి ప్రతిబింబాలు. ఆయన కాలంలో అగ్రవర్ణాలకు మాత్రమే ఆధ్యాత్మిక జీవితస్పర్శ ఉండేది. కానీ అది ఆడంబరాలతో కూడుకున్నది. దానికి భిన్నమైన సాధన కలిగినదే అచల సిద్ధాంతం. ఇది మొదటినుంచీ కూడా బహుజనుల జీవన తాత్వికతకు దగ్గరగా ఉండటం మూలంగా వారి మతతాత్వికతలో ఒక భాగంగా మారిపోయింది. 

ఆ నేపథ్యంలో తెలుగునాట వీరబ్రహ్మం గారు తన రచనలతో, ఉపదేశాలతో, విస్తృతమైన దేశ పర్యటనలతో చేసిన కృషి ఉపకరించింది. ఆ అచల సిద్ధాంత సారాన్ని సులభమైన పద్యాల రూపంలో కాళికాంబ శతకంలో చెప్పారు వీరబ్రహ్మం.  

సర్వమతములందు సారమ్ము గ్రహియించి
ఐకమత్య మార్గ మనుసరించి
క్రించుదనము మాని ప్రేమించుకొన మేలు 

అన్న పద్యం అన్ని మతాలవారు ప్రేమ పూర్వకంగా కలిసి ఉండాలనే సందేశాన్ని ఇస్తుంది. బహుశా వీరబ్రహ్మం, వేమనలాంటి సంస్కర్తల ప్రభావం వల్ల, సూఫీ గురువుల ప్రచారం వల్ల బహుజనులలో ఇతర మతాల పట్ల సానుకూల వైఖరి ఏర్పడి ఉంటుంది. మత సహనం భారత బహుజనుల సంస్కృతిలో ఒక అవిభాజ్యమైన అంశం.

- తోకల రాజేశం-

లైఫ్​& లిటరేచర్​ పేజీకి వ్యాసాలు పంపాల్సిన మెయిల్​ ఐడీ featureseditor@v6velugu.com