ఇంట్లో కరివేపాకు మొక్క ఎండిపోకుండా పచ్చగా, గుబురుగా పెరగాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి !

ఇంట్లో కరివేపాకు మొక్క ఎండిపోకుండా పచ్చగా, గుబురుగా పెరగాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి !

ఇంట్లో కరివేపాకు మొక్కను పెంచడం చాలా మందికి ఇష్టం, కానీ సరైన అవగాహన లేకపోతే ఈ మొక్క త్వరగా ఎండిపోతుంది లేదా చనిపోతుంది. కొద్దిగా శ్రద్ధ పెట్టి, కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే కరివేపాకు మొక్కను దశాబ్దాల పాటు పచ్చగా, గుబురుగా పెంచుకోవచ్చు. కొత్తగా మొక్కలు పెంచే వారి ఈ టిప్స్.....

1. మొక్క నాటడానికి  
కరివేపాకు మొక్కలు పెరగడానికి వెచ్చని వాతావరణం, వదులుగా ఉండే మట్టి, అలాగే మంచి ఎండ అవసరం. కుండీలో నీరు నిల్వ ఉంటే ఈ మొక్క అస్సలు తట్టుకోలేదు. కాబట్టి, ఎక్కవ నీరు కింద నుంచి సులభంగా బయటకు పోయే రంధ్రాలు ఉన్న కుండీని తీసుకోవాలి. ముఖ్యంగా మట్టి కుండీలు చాలా మంచివి, ఎందుకంటే ఇవి మట్టిలోని అదనపు తేమను పీల్చుకుంటాయి. మట్టి కుండీలలో తోట మట్టి, కంపోస్ట్, ఇసుక లేదా కోకోపీట్ కలిపిన వదులైన మట్టిని వాడాలి. ఇది వేర్లు నీటిలో నానకుండా, నీరు త్వరగా ఇంకిపోయేలా చేస్తుంది.

2. ఎండ చాలా ముఖ్యం
కరివేపాకు మొక్క పెరగకపోవడానికి ముఖ్య  కారణం దానికి సరిపడ ఎండ తగలకపోవడమే. ఈ మొక్క ఆరోగ్యంగా పెరగడానికి రోజుకు కనీసం 6 నుండి 8 గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. అందువల్ల ఎండ బాగా ఉండే బాల్కనీ, టెర్రస్ లేదా ఇంటి బయట ప్రదేశంలో దీనిని ఉంచాలి. ఇంట్లోనే ఉంచితే వెలుతురు చాలక ఆకులు లేత ఆకుపచ్చగా మారి, కొమ్మలు సన్నబడి మొక్క బలహీనపడుతుంది. వర్షాకాలం, శీతాకాలంలో కూడా మొక్కకు ఎక్కువ ఎండ తగిలేలా చూసుకోవాలి.

3. నీరు ఎక్కువగా 
కరివేపాకు మొక్కలు నీరు లేక చనిపోయే దానికంటే, ఎక్కువ నీరు పోయడం వల్లనే ఎక్కువగా చనిపోతాయి. ఈ మొక్కకు కాస్త పొడి వాతావరణం ఇష్టం. కాబట్టి రోజూ నీరు పోయకూడదు. కుండీలోని మట్టిని చేత్తో తాకి చూసి, అది ఎండిపోయినట్లు అనిపిస్తేనే నీరు పొయ్యాలి. వేసవిలో మట్టి త్వరగా ఎండిపోతుంది కాబట్టి తరచుగా నీరు ఇవ్వాలి. శీతాకాలం, వర్షాకాలంలో నీరు పోయాల్సిన పని లేదు. మట్టిలో తేమ ఎక్కువైతే వేర్లు కుళ్ళిపోయి, ఆకులు పసుపు రంగులోకి మారి మొక్క చనిపోతుంది.

4. కొమ్మల కత్తిరింపు
మొక్క పొడవుగా, సన్నగా పెరిగిపోకుండా గుబురుగా మారాలంటే దాన్ని క్రమం తప్పకుండా కత్తిరించాలి. మొక్క పైభాగంలో ఉన్న లేత కొమ్మలను, ఆకులను కత్తిరించడం వల్ల పక్క నుంచి కొత్త కొమ్మలు వచ్చి మొక్క దట్టంగా తయారవుతుంది. అలాగే, మొక్కకు వచ్చే పూలను కూడా కత్తిరించి తీసేయాలి. ఎందుకంటే పూలు పూస్తే మొక్క తన శక్తినంతా దానికి ఉపయోగించి, ఆకుల పెరుగుదలను ఆపేస్తుంది.

5. సరైన ఎరువులు 
మొక్క ఎదుగుతున్న దశలో దానికి మంచి ఎరువులు వేయాలి. పశువుల ఎరువు, వర్మీకంపోస్ట్ లేదా ద్రవ రూపంలో ఉండే ఎరువులను వాడవచ్చు. ఆకులు పచ్చగా, బలంగా పెరగడానికి 'నత్రజని' ఎక్కువగా ఉండే ఎరువులు అవసరం. ఇంట్లో ఉండే పుల్లటి మజ్జిగను పల్చగా చేసి లేదా సముద్రపు నాచు  ఎరువును మొక్కకు పోయవచ్చు. అయితే, ఎక్కువ ఎరువులు వేస్తే వేర్లు దెబ్బతింటాయి కాబట్టి తక్కువ మోతాదులోనే వేయాలి.

6. తెగుళ్లు, ఒత్తిడి నుండి రక్షణ
కరివేపాకు మొక్కకు సాధారణంగా  తెగుళ్లు వస్తుంటాయి. వీటి నివారణకు వారానికి లేదా పది రోజులకు ఒకసారి వేప నూనె  స్ప్రే చేయడం మంచిది. మొక్క చుట్టూ గాలి బాగా ఆడేలా చూస్తే ఫంగస్ సమస్యలు రావు. అలాగే, కరివేపాకు మొక్కలు పర్యావరణంలో మార్పులను తట్టుకోలేవు. తరచుగా కుండీ స్థలాన్ని మార్చడం, ఒకేసారి ఎక్కువ నీరు పోయడం లాంటివి చేస్తే మొక్క ఒత్తిడికి గురవుతుంది.

7. ఓపిక చాలా అవసరం
కరివేపాకు మొక్క పెరగడానికి కొంచెం సమయం పడుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ మొక్క నిద్రావస్థలోకి వెళ్తుంది. అంటే ఆ సమయంలో పెరుగుదల అస్సలు ఉండదు. చాలామంది మొక్క చనిపోయిందేమో అనుకుని అనవసరంగా ఎక్కువ నీరు పోయడం లేదా కుండీలు మార్చడం చేస్తుంటారు. అలా కాకుండా తగినంత ఎండ, అవసరమైనంత నీరు ఇస్తూ ఓపికగా ఉంటే, ఆ మొక్క చిగురించి చాలా ఏళ్ల పాటు మనకు తాజా, సువాసనగల కరివేపాకును ఇస్తుంది.