చేర్యాల, వెలుగు: సిద్దిపేట జిల్లా చేర్యాల శివారులో హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న మెడికో చనిపోగా, ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రానికి చెందిన గడసంతల శ్రీ సాహిత్(20) సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సురభి కాలేజీలో ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.
ఫస్ట్ సెమ్ పరీక్షలు పూర్తవడంతో ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆలేరు నుంచి తన స్నేహితులు రాఘవ, అక్షయచారిని తీసుకెళ్లేందుకు వచ్చాడు. స్కూటీపై ముగ్గురు కలిసి వెళ్తుండగా, చేర్యాల శివారులో ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టడంతో శ్రీ సాహిత్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. మిగిలిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడి తండ్రి మధుసూదన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గూడ అపూర్వారెడ్డి తెలిపారు.
