ఆధ్యాత్మికం:  అధికమాసం మొదలైంది.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు.!

ఆధ్యాత్మికం:  అధికమాసం మొదలైంది.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు.!

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో అధిక మాసం అత్యంత విశిష్టమైనది. అధికమాసంలో శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.  అయితే, లౌకిక సుఖాల కంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధికి, దైవచింతనకు అధిక మాసం ఒక వరంలాంటిదని పురాణాల ద్వారా తెలుస్తుంది. 2026వ సంవత్సరంలో మే 17వ తేదీ నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కానుంది. ఈ అధిక జ్యేష్ఠమాసంలో ఏం చేయవచ్చు...ఏం చేయకూడదో తెలుసుకుందాం.

సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని  సంక్రాంతి' అంటారు. ఏ మాసంలో అయితే సూర్య సంక్రమణం జరగదో, ఆ మాసాన్ని అధిక మాసం అంటారు. శాస్త్రీయంగా చూస్తే, సౌరమానానికి (365 రోజులు), చాంద్రమానానికి (354 రోజులు) మధ్య ఉండే 11 రోజుల తేడాను సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి ఒక నెల అదనంగా వస్తుంది.  అలా వచ్చిన నెలను అధికమాసమని.. పురుషోత్తమ మాసమని అంటారు.

అధికస్య అధికం ఫలం అన్న నానుడి ప్రకారం.. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యమైనా వేయి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. పురాణాల ప్రకారం.. అధికమాసానికి అధిష్ఠాన దేవత ఎవరూ లేకపోవడంతో.. దేవతలందరూ శ్రీమహావిష్ణువ దగ్గరకు వెళ్లి అధిక మాసానికి అదిష్టాన దేవత ఎవరు అడిగారట. అప్పుడు  శ్రీమహావిష్ణువు కరుణించి, ఈ మాసానికి తన పేరైన 'పురుషోత్తమ' నామాన్ని ఇచ్చి.. దీనికి అధిపతిగా మారారు. అందుకే ఈ నెలలో విష్ణుమూర్తి ఆరాధన అనంతమైన ఫలితాలనిస్తుంది. ఈ అధికమాసంలో పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువును విరాజమానంగా ఆరాధిస్తారు. సత్యనారాయణ వ్రతాలు విరివిగా చేస్తారు.

అధికమాసంలో చేయాల్సినవి ఇవే

అధిక మాసంలో కొన్ని  గొప్ప పనులు తప్పనిసరిగా చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ మాసంలో ఇష్టదైవం నామస్మరణ, గాయత్రీమంత్రం జపం, నరసింహ కవచం వంటివి పఠించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు, ఈ మాసంలో పండ్లను, పిండి వంటలను, స్వయంపాకాన్ని దానం చేయడం వలన సుఖశాంతులు లభిస్తాయి. ముఖ్యంగా ద్వాదశి, పౌర్ణమి, అమావాస్య తిథుల్లో ఈ దానాలు చేయాలి. పితృదేవతల సద్గతి కోసం ఈ మాసమంతా సంధ్యాసమయంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన పితృదేవతలు సంతోషించి కుటుంబానికి, వంశాభివృద్ధికి సహకరిస్తారు. ఇక ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, నవగ్రహ హోమాలు, శాంతిపూజలు నిర్వహిస్తారు.

►ALSO READ | జ్యోతిష్యం :  శని నక్షత్రం మారాడు.. నాలుగు రాశుల వారికి రాజయోగం.. చేతినిండా డబ్బే..!

అధిక మాసంలో దానం చేయడం వల్ల ఎన్నో రెట్ల పుణ్యఫలం వస్తుంది. ఈ అధిక మాసంలో పేదలకు లేదా ఇతరులకు ఏమి దానం చేసినా ఎంతో మంచిది. అయితే అన్నిదానాల్లో కన్న మిన్న అయిన అన్నదానం చేస్తే మంచిది లేదా విద్యా దానం చేసినా కూడా మీకు శుభప్రదమైన ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.. 

ఏమి చేయకూడదు

అధిక మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి లౌకిక శుభకార్యాలు చేయకూడదు. ఉపాకర్మ, చూడకర్మ, , వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, యజ్ఞం, సన్న్యాసం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకర్మాది సంస్కారములు, మొదలైనవి చేయరాదు.  కొత్త వ్యాపారాలు ప్రారంభించడం మరియు కొత్తగా భూములు కొనడం లేదా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం వంటివి నివారించాలని పండితులు అంటున్నారు.

ఒక్కమాటలో చెప్పాలంటే అధిక మాసం అంట విరామం అని అర్థం కాదు. భక్తికి ఇచ్చే అదనపు సమయం. బాహ్యమైన వేడుకలకు దూరంగా ఉంటూ...అంతరంగంలో దైవాన్ని నింపుకోవడానికి ఇది ఓ మంచి అవకాశం. 2026 మే 17 నుంచి ప్రారంభమయ్యే ఈ పురుషోత్తమ మాసంలో పుణ్యకార్యాలు చేస్తూ సకల బాధలు.. కష్టాలు తీరుతాయని  ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.