డీఎన్ఏ టెస్ట్ చేసి ఉద్యోగంలోకి తీసుకోండి..సింగరేణి మారుపేరు కార్మికుల వారసుల విజ్ఞప్తి

డీఎన్ఏ టెస్ట్ చేసి ఉద్యోగంలోకి తీసుకోండి..సింగరేణి మారుపేరు కార్మికుల వారసుల విజ్ఞప్తి

గోదావరిఖని, వెలుగు: డీఎన్ఏ టెస్ట్​లు చేసి తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సింగరేణి మారుపేరు కార్మికులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్​క్లబ్​లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న మారుపేర్ల కార్మికుల వారసులు, విజిలెన్స్​ పెండింగ్​ కేసుల బాధితుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వేదిక ప్రతినిధి లక్క శ్రావణ్​గౌడ్​ మాట్లాడుతూ తమ తండ్రులు సింగరేణిలో మారుపేర్లతో 35 నుంచి 40 ఏండ్లు పని చేసి బొగ్గు ఉత్పత్తి కోసం శ్రమించారని తెలిపారు. నేడు తమకు ఉద్యోగం ఇవ్వడానికి మారుపేర్ల కారణం చూపుతూ మేనేజ్​మెంట్​ ఇబ్బంది పెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు డీఎన్ఏ పరీక్ష చేసి అసలైన వారసులని తేలితేనే సింగరేణిలో ఉద్యోగాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. 

గతంలో గ్రామాల నుంచి సింగరేణి ప్రాంతానికి వచ్చిన వారిని పనికి పెట్టుకున్నారని, ఆ సమయంలో అసలు పేర్లు పక్కన పెట్టి మారుపేర్లతో ఉద్యోగంలోకి తీసుకున్నారని తెలిపారు. ఇలా సింగరేణి వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగం చేశారని, కానీ, నేడు మారుపేర్లపై పని చేశారనే కారణంతో వారి వారసులుగా తమకు డిపెండెంట్​ ఉద్యోగం ఇవ్వడానికి సింగరేణి మేనేజ్​మెంట్​ ఇబ్బంది పెడుతోందన్నారు. సమస్య పరిష్కరిస్తామని మాజీ సీఎం కేసీఆర్  ఇచ్చిన మారుపేర్ల సవరణ హామీ అమలు కాలేదని తెలిపారు.

 ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా మారుపేర్ల సమస్య పరిష్కరిస్తామని భూపాలపల్లిలో జరిగిన సభలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే డీఎన్ఏ టెస్ట్​ చేయించి తమకు ఉద్యోగాలివ్వాలని కోరారు.  ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఎస్‌యూఎస్, ఏఐఎఫ్టీయూ, టీబీజీకేఎస్ నేతలు మడ్డి ఎల్లయ్య గౌడ్, వైవీరావు, క్రాంతికుమార్, కృష్ణ, కుమారస్వామి, పోషమల్లు, ఎం.రామ్మూర్తి డిపెండెంట్లకు మద్దతు ప్రకటించారు. కోల్‌బెల్ట్  ప్రాంత ఎమ్మెల్యేలకు సమస్య పరిష్కరించాలని వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు.