నీతి కథ : ప్రాణం నిలిపిన చెట్లు.. వ్యాపారి కళ్లు తెరిపించిన ఓ రైతు ముందు చూపు..

నీతి కథ : ప్రాణం నిలిపిన చెట్లు.. వ్యాపారి కళ్లు తెరిపించిన ఓ రైతు ముందు చూపు..

ఒక గ్రామంలో కృష్ణమూర్తి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. చుట్టుపక్కల  గ్రామాలకు వెళ్లి చెట్లను కొంటుండేవాడు. వాటిని కొట్టి, కిటికీలు దర్వాజలు చేసి, ఎక్కువ ధరలకు అమ్మేవాడు. చుట్టుపక్కల గ్రామాల్లో అతనికి బాగా పేరుంది.

ఊర్లో ఏ చెట్టును అమ్మకానికి పెట్టాలన్నా, కృష్ణమూర్తికి కబురుపెట్టేవాళ్ళు “కృష్ణ మూర్తీ! చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని చెట్లను నువ్వే కొని నరికి వేస్తున్నావు. చెట్టు కని పించడమే కరువైంది. ఇలా చెట్లన్నింటిని నరుకుతూ పోతే మన ప్రాంతం ఎడారిగా మారిపోయి కరువు ఏర్పడదా?” అని ఎవరైనా అడిగితే “బాగా చెప్పావులే! బతుకుదెరువు కోసం ఏదో ఒకటి చేయాలి కదా” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చేవాడు కృష్ణమూర్తి.


ఒకరోజు వ్యాపార నిమిత్తం అలా వెళ్తున్న కృష్ణమూర్తికి చెట్టుకింద సేద తీరుతు న్న ఒక పెద్దాయన కనిపించాడు. దగ్గరకు వెళ్లి "చెట్టు అమ్మితే కొంటా” అన్నాడు పెద్దాయనతో. “నేను అమ్మను” అన్నాడు ఆయన. "దీనివల్ల నీకేం ఉపయోగం” అనడిగాడు కృష్ణమూర్తి. పెద్దాయన గట్టిగా నవ్వి “ఈ చెట్టు నాకు నీడనిస్తోంది అలసట తీరుస్తోంది. మా ఇంటికి అందాన్ని, ఆరోగ్యాన్నిస్తోంది. వర్షం పడితే గొడుగులాఉంటోంది. ఇంతకన్నా ఉపయోగం ఏం కావాలి" అన్నాడు ఆ పెద్దాయన. “అన్నీ ఇస్తోంది

కానీ ఐశ్వర్యం ఇవ్వలేదు. తిండి పెట్టలేదు. దీన్ని అమ్మితే, వచ్చే డబ్బుతో చల్లటి గాలి పంకా కొనుక్కోవచ్చు. కడుపునిండా కోరిన తిండి తినొచ్చు. నా మాట విని నాకు అమ్మేస్తే సుఖపడతావ్ ఆలోచించు" అన్నాడు కృష్ణమూర్తి. పెద్దాయనకు కోపం వచ్చింది “నువ్వు చెప్పిన సుఖాలన్నీ ఎప్పుడో ఒకప్పుడు చేజారిపోవచ్చు.

కానీ ఈ చెట్టు ముందుతరాలకి కూడా నీడ, చక్కటి గాలి ఇస్తుంది. చెట్టు పరోక్షంగా మనిషికి చాలా ఉపయోగపడుతుంది. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు” అన్నాడు పెద్దాయన. “పెద్దాయన! నేను చెప్పినవన్నీ నిజాలు. ఏదో ఒక రోజు నువ్వే నా దగ్గరకొచ్చి నా చెట్టు అమ్మేస్తున్నా కొనుక్కోమంటావులే" అన్నాడు కృష్ణమూర్తి.


కొన్ని రోజులైన తరువాత కృష్ణమూర్తి వ్యాపార నిమిత్తం ఒక గ్రామానికి వెళ్లాడు. ఆ గ్రామానికి వాహన సౌకర్యం లేకపోవడం వల్ల నడిచి వెళ్ళాడు. ఎలాగోలా కష్టపడి ఆ గ్రామానికి వెళ్లి పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యాడు కృష్ణమూర్తి. ఎండాకాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దాంతో కాసేపు చెట్టు నీడన సేద తీరాలి అనుకున్నాడు.

చుట్టుపక్కల ఎక్కడా ఒక్క చెట్టు కనిపించలేదు. “ఇక్కడున్న చెట్లన్నీ నేనే కొని, కొట్టేశా” అని అనుకుని చేసేది లేక నడవడం మొదలుపె ట్టాడు. దప్పికతో నోరు తడారిపోయి, పెదాలు ఎండిపోయాయి. గొంతులో తేమ లేదు. శరీరం శక్తి కోల్పోతోంది. ఏమి చేయాలో అర్థం కాలేదు కృష్ణమూర్తికి. మెల్లగా అడుగులు వేస్తున్నాడు. చుట్టుపక్కల ఎవరూ కనిపించలేదు. బావులు, చెరువులు ఎండిపోయి కనిపించాయి. చెట్లు లేని కారణంగా వర్షాలు పడలేదని అందరూ అంటున్నారు.

ఎట్టకేలకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఊరి మొదట్లోకి చేరుకున్నాడు. చెట్టు కింద పెద్దాయన మంచంపై కూర్చున్నాడు. ఆ చెట్టు నుండి వచ్చే చల్లటి గాలికి హాయిగా అనిపించింది కృష్ణమూర్తికి. పెద్దాయన చేతులు పట్టుకుని క్షమించమన్నాడు. జరిగిందంతా పెద్దాయనతో చెప్పాడు. ఆయన చిన్నగా నవ్వి "ఇన్నాళ్లూ వ్యాపారంలో నీ కంటే తెలివైన వాళ్ళు లేరనుకున్నావు.

కానీ నీ అతితెలివి ఒక వ్యవ స్థనే దెబ్బతీస్తోందని గ్రహించలేదు. చెట్టు కన్నతల్లి లాంటిది. తల్లిని ఎవరైనా చంపు కుంటారా? చెట్టు లేకపోతే వర్షం రాదు. వర్షం రాకపోతే గింజ రాదు. గింజ లేకపోతే తిండి దొరకదు. చెట్టు వలన మనిషికి ఎన్నో లాభాలున్నాయి” అన్నాడు పెద్దాయన. కృష్ణమూర్తి తన తప్పు తెలుసుకుని "సమయానికి చెట్టు కనపడి ప్రాణం నిలిపింది.” అనుకుని ఆ రోజు నుండి చెట్ల వ్యాపారం మానేసి, వేరే వ్యాపారం పెట్టుకున్నాడు.