Kartavya OTT Review: క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లింగ్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఓటీటీ మూవీ

Kartavya OTT Review: క్రైమ్, సస్పెన్స్‌ థ్రిల్లింగ్ మిస్టరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఓటీటీ మూవీ

బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కర్తవ్య’. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదలై ట్రెండింగ్లో దూసుకెళ్తోంది.

ఈ సందర్భంగా మే 15 నుంచి నెట్‌‌ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతూ ఆడియన్స్ని ఉత్కంఠకు గురిచేస్తోంది. డెస్టినీ వర్సెస్ కర్మ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో నిజాయతీ గల పోలీస్ అధికారిగా సైఫ్ అదరగొట్టారు. తన ధర్మం, కుటుంబ భద్రత మధ్య ఆయన తీసుకున్న నిర్ణయాలు హైలెట్గా నిలిచాయి. హిందీతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

ఇందులో సైఫ్ అలీ ఖాన్ తో పాటు రసికా దుగల్, సంజయ్ మిశ్రా, సౌరభ్ ద్వివేది, జాకీర్ హుస్సేన్, మనీష్ చౌదరి కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి పులకిత్ దర్శకత్వం వహించగా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్ మూవీని నిర్మించారు.

కథేంటంటే:

పవన్ మాలిక్ (సైఫ్ అలీ ఖాన్) నిజాయితీపరుడైన ఒక సాధారణ పోలీసు అధికారి. హర్యానాలోని ఝమ్లీ పోలీస్ స్టేషన్ ఇన్‌‌చార్జ్‌‌గా పనిచేస్తుంటాడు. అదే టైంలో జరుగుతున్న పిల్లల మిస్సింగ్‌, లైంగిక వేధింపుల వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టడానికి జర్నలిస్ట్ రీమా దత్తా తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. ఆమెకు పవన్ సాయం చేస్తుంటాడు. కానీ.. ఆమె హత్యకు గురవుతుంది.

ఆ మర్డర్ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం పవన్ మాలిక్‌‌కు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఒక పెద్ద సవాలుగా మారుతుంది. మరోవైపు ఆధ్యాత్మిక గురువు ఆనంద్ శ్రీ(సౌరభ్ ద్వివేది) అనుచరులు, రాజకీయ నాయకులు ఈ కేసును మూసేయాలని పవన్‌‌పై ఒత్తిడి పెంచుతారు. మరోవైపు అతని ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. పవన్ తమ్ముడు వేరే కులానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించి ఆమెతో పారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంట్లో సమస్యను ఎలా పరిష్కరించాడు? హత్య కేసుని ఎలా ఛేదించాడు? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే? 

‘కర్తవ్య’ సిరీస్.. కేవలం క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే కాదు. విధి, నైతికత, కుటుంబ బాధ్యతల మధ్య జరిగే సంఘర్షణను చూపించే కథగ వచ్చింది. “విధి వర్సెస్ కర్మ” అనే కాన్సెప్ట్‌ను దర్శకుడు పులకిత్ కథలో బలంగా మిళితం చేశారు. సినిమాలో పవన్ మాలిక్ పాత్ర ఒక సాధారణ పోలీస్ అధికారిగా మొదలై, వ్యవస్థలోని ఒత్తిళ్లు, రాజకీయ ప్రభావం, వ్యక్తిగత సమస్యల మధ్య చిక్కుకున్న వ్యక్తిగా మారుతుంది. ఓ వైపు నిజం కోసం పోరాడాల్సిన బాధ్యత, మరోవైపు కుటుంబ భద్రత.. ఈ రెండింటి మధ్య అతడు పడే మానసిక సంఘర్షణ సినిమాకు ప్రధాన బలం.

ఈ క్రమంలోనే పిల్లల మిస్సింగ్ కేసులు, జర్నలిస్ట్ హత్య వంటి అంశాల ద్వారా సమాజంలోని చీకటి కోణాలను చూపించే ప్రయత్నం చేశారు. అధికార వ్యవస్థ, రాజకీయ జోక్యం, మత ప్రభావం వంటి అంశాలు కథకు సోషల్ మెసేజ్ టచ్ ఇస్తాయి. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగినా, కథలోని మిస్టరీ ఒక్కో దశలో ఆసక్తి పెంచుతుంది. కేసు వెనుక దాగిన నిజాలు బయటపడే కొద్దీ కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. సెకండాఫ్ లో ఇన్వెస్టిగేషన్ సీన్స్, ఎమోషన్స్ పోర్షన్స్ ఆకట్టుకుంటాయి.