రూపాయి ఖర్చు లేకుండా 70, 80 ఏళ్లున్న సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం: బెస్ట్ హెల్త్ స్కీమ్స్ ఇవే

రూపాయి ఖర్చు లేకుండా 70, 80 ఏళ్లున్న సీనియర్ సిటిజన్లకు ఉచిత వైద్యం: బెస్ట్ హెల్త్ స్కీమ్స్ ఇవే

దేశంలో వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లకు వైద్య ఖర్చులు ఒక పెద్ద ఆర్థిక భారంగా మారుతున్నాయి. 70, 80 ఏళ్లు దాటిన తర్వాత తరచూ వచ్చే అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ బిల్లులు కట్టలేక ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులైన తల్లిదండ్రుల ఆరోగ్య సంరక్షణ కోసం రూపాయి ఖర్చు లేకుండా.. పూర్తిగా ఉచితంగా లేదా క్యాష్‌లెస్ సదుపాయంతో వైద్యం అందించేందుకు అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన ప్రభుత్వ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆయుష్మాన్ భారత్ స్కీమ్:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆయుష్మాన్ భారత్ - ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' స్కీమ్ దేశంలోని వృద్ధులకు కొండంత అండగా మారింది. ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయం ప్రకారం.. 70 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు అందరికీ ఈ స్కీమ్ ఇప్పుడు వర్తిస్తుంది. ఇందులో అత్యంత సానుకూలమైన విషయం ఏమిటంటే.. వారి కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా, ధనిక-పేద అనే భేదం లేకుండా ప్రతి సీనియర్ సిటిజన్‌కు ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తారు. ఈ స్కీమ్ పూర్తిగా ఉచితం కావడం వల్ల లబ్ధిదారులు రూపాయి కూడా జేబులోంచి పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా సాధారణ ఇన్సూరెన్స్ కంపెనీలలా వెయిటింగ్ పీరియడ్ లేకుండా, ముందే ఉన్న రోగాలకు కూడా మొదటి రోజు నుంచే కవరేజ్ లభిస్తోంది.

ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ: 
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో అమలవుతున్న ఆరోగ్యశ్రీతో పాటుగా.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఉద్దేశించిన ఈహెచ్‌ఎస్ స్కీమ్స్ సీనియర్ సిటిజన్లకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వైట్ రేషన్ కార్డ్ ఉన్న వృద్ధులకు ఆరోగ్యశ్రీ కింద ఎంపిక చేసిన నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో రూపాయి ఖర్చు లేకుండా పూర్తి క్యాష్‌లెస్ వైద్యం అందుతుంది. ఎలాంటి వయోపరిమితి లేకుండా 70, 80 ఏళ్ల పైన ఉన్న వారు కూడా ఈ సేవల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు. పెన్షన్ పొందే సీనియర్ సిటిజన్లు ఈహెచ్‌ఎస్ కార్డుల ద్వారా ఎలాంటి క్యాష్ చెల్లించకుండానే ఖరీదైన వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలు పొందే వీలుంది. వృద్ధాప్యంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు కట్టలేని వారికి ఈ ప్రభుత్వ పథకాలు ఆర్థిక రక్షణను కల్పిస్తున్నాయి.