జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లిస్ట్ ఫేక్ అని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ఫేక్ లిస్ట్‌ల వల్ల అభ్యర్థులు, ఓటర్లు గందరగోళానికి గురికావద్దని స్పష్టం చేశారు.
వార్డుల రిజర్వేషన్లపై స్వయంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు GHMC తో పాటు.. ఎంఎంసీ (MMC), సీఎంసీ (CMC)ల వార్డుల రిజర్వేషన్లపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అటు జీహెచ్ఎంసీ కానీ, ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ ఎలాంటి అధికారిక జాబితాను విడుదల చేయలేదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ క్లారిటీ ఇచ్చారు.
ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, ఫేక్ లిస్ట్‌లను వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయొద్దని ప్రజలకు, రాజకీయ పార్టీల నాయకులకు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారికంగా ఎలాంటి లిస్ట్ విడుదల చేసినా.. ప్రభుత్వం,ఎన్నికల సంఘం వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని, కాబట్టి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దని కోరారు.
