మన ఇళ్లలోకి, ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌లలోకి బల్లులు, కీటకాలు రావడం అనేది చాలా సాధారణ సమస్య. కొత్తగా ఇల్లు, అపార్ట్‌మెంట్‌లు నిర్మించేటప్పుడు పునాది నుంచే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఇల్లు పూర్తయిన తర్వాత ఇంట్లో గోడలపై, బాల్కనీలో లైట్ల దగ్గర వెలుతురు వల్ల బల్లులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ బల్లులు పోవడానికి కొని ఇంటి చిట్కాలు మీకోసం....
1. వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు
బల్లులు వచ్చే కిటికీలు, బాల్కనీ డోర్స్ దగ్గర నలిపిన వెల్లుల్లి రెబ్బలు లేదా ఉల్లిపాయ ముక్కలను ఉంచాలి. వీటి నుంచి వచ్చే ఘాటైన వాసన బల్లులకు అస్సలు నచ్చదు. ఒకటి లేదా రెండు రోజులకు ఒకసారి ఇలా చేస్తే సరిపోతుంది.
2. పెప్పర్ స్ప్రే
గోడల మూలల్లో, అల్మారా, ఫ్రిజ్ లేదా టీవీ వెనుక పెప్పర్ స్ప్రే చేయాలి. దీని వల్ల బల్లులకు చర్మంపై మంటగా అనిపించి అక్కడి నుండి పారిపోతాయి. గోడల రంగు పాడవకుండా ఉండాలంటే చాలా పల్చగా స్ప్రే చేయాలి.
3. కాఫీ, పొగాకు
కాఫీ పొడి, పొగాకు పొడిని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి బల్లులు తిరిగే దగ్గర, కప్‌బోర్డుల వెనుక ఉంచాలి. దీని వాసన ఘాటుగా ఉండటం వల్ల బల్లులు అక్కడికి రావు.
4. గుడ్డు పెంకులు
వంటగది మూలల్లో, కిటికీల దగ్గర గుడ్డు పెంకులను సగానికి పగలగొట్టి పెట్టడం వల్ల అక్కడ వేరే ఏదో జీవి ఉందనే భయంతో బల్లులు రావు. అయితే, తేమ ఎక్కువగా ఉండే వంటగదులలో ఈ పెంకుల వల్ల బ్యాడ్ స్మెల్ రాకముందే వాటిని మారుస్తూ ఉండాలి.
5. ఇల్లు పొడిగా ఉంచడం
బల్లులు మన ఇంట్లోకి రావడానికి ముఖ్య కారణం వాటికి దొరికే ఆహారం, పురుగులు. నల్లాలు, తడి మాపులు, సింక్ కింద తేమ ఉండటం వల్ల కీటకాలు చేరతాయి. కాబట్టి బాత్రూమ్, కిటికీల పరిసరాలను పొడిగా ఉంచాలి. కీటకాలు తగ్గితే బల్లులు కూడా దానంతట అవే పోతాయి.
6. చల్లటి నీరు చల్లడం
ఫర్నిచర్ లేదా వాషింగ్ మెషీన్ వెనుక బల్లులు దాక్కున్నప్పుడు వాటిపై చల్లటి నీటిని చల్లాలి. బల్లులు చల్లదనాన్ని తట్టుకోలేవు. ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం వల్ల అవి బయటకు పారిపోతాయి.
7. చిన్న చిన్న రంధ్రాలు
ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లు, డ్రైనేజీ పైపులు, స్లైడింగ్ కిటికీల పక్కన ఉండే చిన్న సందుల ద్వారానే బల్లులు లోపలికి వస్తాయి. కాబట్టి ఇలాంటి రంధ్రాలను కరెక్ట్ గా మూసివేయడం ద్వారా బల్లులు రాకుండా అడ్డుకోవచ్చు.
8. నాఫ్తలీన్ గోళీలు
అల్మారాలు, అంతగా వాడని స్టోర్ రూమ్ మూలల్లో నాఫ్తలీన్ గోళీలను పెట్టొచ్చు. వీటి ఘాటైన వాసనకు బల్లులు దూరంగా ఉంటాయి.
