ఎంపీ వీరేంద్ర కుమార్ కన్నుమూత

ఎంపీ వీరేంద్ర కుమార్ కన్నుమూత

కోజికోడ్(కేరళ): రాజ్యసభ ఎంపీ, మాతృభూమి మలయాళ దినపత్రిక ఎండీ, లోక్​తాంత్రిక్ జనతా దళ్(ఎల్జేడీ)నేత వీరేంద్ర కుమార్(84) హార్ట్ ఎటాక్​తో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కోజికోడ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ రోజు సాయంత్రం వయనాడ్​లోని కల్పేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
వీరేంద్ర కుమార్‌కు భార్య, నలుగురు పిల్లలు. సోషలిస్ట్ నాయకుడైన వీరేంద్ర కుమార్ 1987– -91 మధ్య కేరళ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1996లో కోజికోడ్ నుంచి ఎంపీగా గెలుపొందారు. హెచ్​డీ దేవె గౌడ, ఐకే గుజ్రాల్ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి అయ్యారు. 2004 లో మళ్లీ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 70 ఏళ్ల వయసులో మాతృభూమి దినపత్రికను స్థాపించి ఎండీగా పనిచేశారు. వీరేంద్ర కుమార్ తత్వశాస్త్రం, ఆర్థికశాస్త్ర అంశాలపై పుస్తకాలు రాశారు. సాహిత్య అకాడమీ, కేరళ సాహిత్య అకాడమీల అవార్డులు పొందారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ సంతాపం
వీరేంద్ర కుమార్ మృతికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని, అనుభవజ్ఞుడైన నాయకుడని కొనియాడారు. నిష్ణాతుడైన జర్నలిస్టు, గొప్ప రచయిత అని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఎంపీ వీరేంద్ర కుమార్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలు పక్షాన గొంతెత్తారని గుర్తుచేశారు. సమర్థవంతమైన శాసనసభ్యుడిగా, ఎంపీగా ఆయన మంచి గుర్తింపు పొందారని మోడీ ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ.. వీరేంద్ర కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు.