ఎన్నికల్లో నోటాకు పవర్​ తీసుకురావాలి: పద్మనాభరెడ్డి

ఎన్నికల్లో నోటాకు పవర్​ తీసుకురావాలి: పద్మనాభరెడ్డి

ఖైరతాబాద్, వెలుగు: ఎన్నికల సంఘం నోటాకు పవర్ తీసుకురావాలని ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ (ఎఫ్​జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. హర్యానా ప్రభుత్వం నోటా ప్రాధాన్యతను గుర్తించిందని.. తెలంగాణలోను స్థానిక సంస్థల ఎన్నికలలో నోటాకు అంతే గుర్తింపును తీసుకురావాలని తెలిపారు. మంగళవారం ‘పంచాయతీ ఎన్నికల్లో నోటా అమలు’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

 ఈ సందర్భంగా పద్మనాభరెడ్డి మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఆ ఎన్నికను రద్దు చేయాలని చెప్పారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాకు ప్రాధాన్యం కల్పించాలని పేర్కొన్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచులను వేలం ద్వారా పెత్తందారులు కొంటున్నారని ఆరోపించారు. అప్పుడు సామాన్యుడు ఓటు హక్కును వినియోగించే అవకాశాన్ని కోల్పోతాడని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి, ఎఫ్​జీజీ కార్యదర్శి సోమ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, లోక్​సత్తా ఉద్యమ సంస్థ తెలంగాణ అధ్యక్షుడు బండారు రామ్మోహన్ రావు, సంస్థ కోశాధికారి శ్రీదేవి, హన్మంతరావు, అబ్దుల్ కరీమ్, విద్య, వివి. రావ్ తదితరులు పాల్గొన్నారు.