
కాజోల్ దేవగణ్ లీడ్ రోల్‌లో రూపొందుతున్న హారర్ మూవీ ‘మా’. విశాల్ ఫూరియా దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్‌తో కలిసి అజయ్ దేవగణ్, జ్యోతి శాంతా సుబ్బరాయన్ నిర్మిస్తున్నారు. గురువారం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఓ అడవి మార్గంలో తన కూతురుతో కలిసి కారులో వెళ్తున్న కాజోల్‌పై దెయ్యాలు దాడి చేస్తున్న సీన్స్‌తో టీజర్ మొదలైంది. వాళ్లు ఓ పురాతన బంగ్లాకు వెళ్తారు. ఆ పక్కనే ఓ పెద్ద మర్రిచెట్టు. అక్కడ ఉన్న దెయ్యం ఆ చిన్నారిని ఎత్తుకెళ్తుంది. అప్పటికే అక్కడ చాలామంది అమ్మాయిలు అలా కనపడకుండా పోయినట్టు తెలుస్తుంది. కాజోల్ తన కూతురిని ఆ దెయ్యం చెర నుంచి ఎలా విడిపించుకుంది అనేది మిగతా కథ. మర్రి ఊడలు బందించినట్టుగా చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.
వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న సీన్స్‌తో హారర్ జానర్‌ను ఇష్టపడే వారికి విజువల్ ఫీస్ట్‌లా ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. నీ తల్లి నీతో ఉన్నంత వరకూ నిన్నెవరూ ఏమీ చేయలేరు అనే డైలాగ్, టీజర్ చివర్లో కాళీ మాతను చూపించడం ఆకట్టుకున్నాయి. అజయ్ దేవగణ్ ‘షైతాన్’ సినిమా బ్యాక్‌డ్రాప్ అని మేకర్స్ ముందే చెప్పినప్పటికీ.. కథాపరంగా దర్శకుడు విశాల్ ఫూరియా గత చిత్రాలైన చోరి, చోరి 2 చిత్రాలు గుర్తొస్తాయి. రోనిత్ రాయ్, సుభద్ర సేన్ గుప్త, ఇంద్రనీల్, జితిన్ జ్యోతి గులాటీ ఇతర పాత్రలు పోషించారు. జూన్ 27న సినిమా విడుదల కానుంది.