రైతు కథ: బిజినెస్ మ్యాన్ గా రైతు... ఆడపిల్లలే ఆయనకు ఆధారం

రైతు కథ:   బిజినెస్ మ్యాన్ గా రైతు... ఆడపిల్లలే ఆయనకు ఆధారం

మల్లయ్యను వెతుక్కుంటూ ఊళ్లోకి అడుగుపెట్టాడు రవీందర్. బాగా పేరున్న ఒక ఇంగ్లీష్ పత్రిక విలేకరి అతను.మల్లయ్యకు రైతుమిత్ర అవార్డు వచ్చిందని తెలిసి అతడిని ఇంటర్వ్యూ చేద్దామని పచ్చాడు రవీందర్. పెద్దగా కష్టపడే పని లేదు. ఊళ్లోకి అడుగుపెట్టగానే మల్లయ్య ఇల్లు తెలిసిపోయింది అతనికి.. కానీ, ఇంటికెళ్లి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు..ఇంటి పక్కనున్న వాళ్లను అడిగితే తోట దగ్గరికి దారి చూపించారు.

రవీందర్ ఆ దారి వెంట వెళ్తుంటే.. మల్లయ్య చిన్న కూతురు ఎదురొచ్చి. "మీరేనా సార్ ఫోన్ చేసింది?" అని అడిగింది. అతడిని పొలం వరకు తీసుకెళ్లి తండ్రి మల్లయ్యను పరిచయం చేసింది. ఆ వెంటనే తన చిన్నక్కతో కలిసి నారుమడి దున్నేపనిలో పడిపోయింది. మల్లయ్యకు ఆరుగురు కూతుళ్లు అందరూ పని రాక్షసులే. వారి రక్తంలోనే శ్రమ ఉంది. 'కొడుకులు లేరే అన్నలోటు ఆ తండ్రికి ఎప్పుడూ రానివ్వకుండాఉంటారు.పిల్లలు నీకు ఇంత గొప్ప పేరు తీసుకొచ్చారంటే  ఏమనిపిస్తది?" అని రవీందర్ అడిగితే, మల్లయ్య ఒకింత గర్వం నిండిన చిన్న నవ్వు నవ్వాడు. రవీందర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఆలోచిస్తున్నాడు మల్లయ్య..

మల్లయ్య పూర్తి పేరు బండి మల్లయ్య కష్టం తప్ప లోకం పోకడ తెలియని సామాన్య రైతు. పుట్టి, పెరిగిన ఆ చిన్న ఊరు తప్ప ఇంకేం తెలియని పల్లె జీవి. చదువుకోలేదు.పెళ్లిఅయిన రోజు నుంచే కంటే కొడుకునే కనాలని కలలు కన్నాడు. కానీ, ఆరుగురు వరుసగా పుట్టారు.. ఆడపిల్లలు.

రవీందర్ మల్లయ్య కథ వింటూ కూర్చున్నాడు. ప్రశ్నలు అడగడం మానేసి అతడినే  మాట్లాడమన్నట్లు సైగ చేశాడు."నిజానికి నాకు బిడ్డలతోనే కలిసొచ్చింది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు భూములకు అంత విలువ లేదు.   700 రూపాయల లెక్కన మూడెకరాలు కొన్నాము. కొడుకు కావాలన్న ఆశతోటి ఆరుగురు ఆడపిల్లల్ని కన్నాము. కానీ నాకిప్పుడు ఆ బాధ లేదు. కొడుకులు ఉన్నోళ్లకంటే బాగా నా కూతుళ్లు నన్ను చూసుకుంటున్నారు.  బిడ్డలకు పెండ్లి చేసినాను.నా  బిడ్డలు బంగారమసుంటోళ్లు. కష్టానికి భయపడేవారు కాదు. అలా భయపడితే ఇప్పుడు  25 ఎకరాల బత్తాయి తోట ఉండేది కాదు. మరికొంత భూమిని కౌలుకు తీసుకునేవాడిని కాను.

మా అయ్య 18 ఏండ్లకే నాకు పెండ్లి చేశాడు. ఆ తరువాత వచ్చిన భూమిలో  ఏడెకరాలు ఇచ్చాడు.  అందులో మూడెకరాలు మాగాణి. ఇంకో ఏడెకరాలు మెట్ట. మిగిలినదంతా ఎందుకు పనికిరాని భూమి. మా భార్య  పార్వతమ్మ, నేను కలిసి మూడెకరాల్లో  కందులు, ఆముదము, శనగలు పండించేవారం. మాకు మొదట ముగ్గురు బిడ్డలు. అప్పుడు నేను చాలా కాలం  గొర్రెలు కాయడానికిపోయాను. నేను గొర్రెలు కాయడానికి వెళితే పార్వతమ్మ ఇంటిదగ్గర  ఉండి పొలం చూసుకునేది. ఒక్కసారి జీవాల కాడికి పోయినమంటే... మళ్లీ మూడు రోజుల తరువాత ఇంటికి తిరిగొచ్చేది.


నాభార్య ..ఇప్పుడొచ్చినావా?" అనేది నేనొచ్చినప్పుడల్లా,ఆమెకు జరమొచ్చినా, పిల్లలకేమొచ్చినా, ఏమన్నా అయినా నాకు తెలిసేది కాదు. నాకేమన్నా నొప్పి వచ్చినా, రోగమొచ్చినా వాళ్లకు తెలిసేది కాదు.పార్వతమ్మ ఆ ముగ్గురు పిల్లలను గంపలో బెట్టుకుని పొలం కాడికి పోయేది. వాళ్లను చెట్టుకింద వదిలిపెట్టి అరకకట్టేది. పొద్దుగూకిన తరువాత ( చీకటి)  అరక విడిచి... పిల్లలను తీసుకొని ఇంటికొచ్చేది. ఆ తర్వాత మగపిల్లాడు పుడతాడని చూసుకుంటూ పోతే.. మళ్లీ ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. చివరి రెండు కాన్సుల్లో మగపిల్లలు పుట్టినా బతకలేదు  అని ఆగాడు మల్లయ్య. 

"అప్పుడేం అనుకున్నవు?” అనడిగాడు రవీందర్.

"ఏమనుకోలేదు, మగబిడ్డలు లేకపోతే ఏంది? అనుకున్నంక ఆడ బిడ్డలున్న విలువ అర్థమైంది. బిడ్డలందరికి  ఒకటి. ..రెండేళ్లు తేడా అంతే. ఒక్కొక్కళ్లు ఎదిగొచ్చినారు. చిన్నతనం నుంచి వాళ్లమ్మ పొలంలో పనిచేస్తుంటే చూస్తూ పెరిగారు. అట్ల అరక కట్టడం నుంచి ఎరువు చిమ్మడం, పొలం దున్నడం, వరలు తీయడం, నాట్లు, పచ్చగలుపు, పురుగుల మందు కొట్టడం, కోత, కుప్పనూర్పిడి... అన్ని పనులూ వాళ్లే చేపేవారు. కూలోళ్లు వచ్చింది  తెలియదు. అన్నీ మేమే చేసుకునేవాళ్లం. కానీ బిడ్డలు ఎవరినీ బడికి పంపలేకపోయినాను.

"ఎందుకు?"

అంతా అటు ఇటుగ ఒక్కకచ్చోళ్లు అవడం వల్ల ఒక్కసారే ఇంతమందిని బడికి పంపి ఏం చదివించగలుగుతాం ? అని భయపడ్డాను. మంచి బతుకు మాత్రం ఇయ్యాలనుకున్నాను.  ఉన్నకాడ కష్టం చేసుకుని బతికడం  నయమని నాకు తెలిసిన విద్య పొలంలోకి దింపాను. అయినా పిల్లలకు చదువుకోవాలని ఉండేది. అందుకే పొద్దంతా పనిచేసినా... రాత్రిపూట బడికి పోయేవాళ్లు పుస్తకాలు తెచ్చుకొని బాయి దగ్గర చదువుకునేటోళ్లు. అందరికీ చదవడం, రాయడం కూడా వచ్చు. ఇప్పుడు పొలం లెక్కలన్నీ వాళ్లే చూసుకుంటున్నారు."

ALSO READ : క్రిప్టోల పేరుతో సీనియర్ సిటిజన్ల టార్గెట్.. ఈ టిప్స్ ఫాలో అయితే డబ్బు సేఫ్!

"మగపిల్లలైతే చదివిద్దువా?!!!"ఇట్ల అడిగితే ఏం చెబుతానో తెలియదు సారు. ..ఏమో, చదివిద్దునేమో అనిపిస్తుంది. నా బిడ్డలు నేను చదివియ్యకున్నా వాళ్లే చదువుకున్నారంటే సంతోషంగా ఉంది" "వీళ్లను వ్యవసాయంలోకి తీసుకొచ్చిన తరువాత నీ జీవితం ఎట్ల మారింది?""చూస్తున్నరుగా! ఇయ్యాల.. రేపు ..వ్యవసాయమంటే ఏం లేదు. ఏదో ఒక రోజు రైతు సచ్చిపోయి, ఆ రైతు పేపర్ల కనిపించుడె. అట్లాంటిది నా జీవితంలో ఈ లెక్క వేరే ఉన్నదంటే నా పిల్లలే. ఇంటిల్లిపాదీ పొద్దుగాల లేచిన దగ్గరనుంచి పొలంతోనే ఉంటం. వృథా ఖర్చు పెట్టేటోళ్లు లేరు. అట్ల కొంత నిలదొక్కుకున్నం. గొర్రెలు అమ్మి ఇంకొంత భూమి కొన్నం. పొలమంతా తీసి బత్తాయి తోట పెట్టినం. అప్పటి నుంచిబిడ్డలు రెక్కలు ముక్కలు చేసుకున్నారు. వాళ్లు చేసిన పనిని మగపిల్లలు కూడా చేయలేరు.

పొలం దున్నడం దగ్గరనుంచి పంట ఇంటికొచ్చేదాక... పనిలో ఇంకొకరు చెయ్యి పెట్టాల్సిన అవసరం లేదు. పెద్దబిడ్డ పెండ్లి చేశాను. ఆ తర్వాత ఒక్కొక్కరికి చేశాను. తోటలోనే తలా మూడు ఎకరాలు కట్నం కింద ఇచ్చాను.అల్లుళ్లంతా వ్యవసాయం చేసేవాళ్లే. పొలంలో నా బిడ్డలు చేసినంత పని నా అల్లుళ్లు కూడా చేయలేరు. వాళ్లు పొలంలో పని చేస్తుంటే చుట్టుపక్కల బావులోళ్లు ఆశ్చర్యపోతారు.

 నా పెద్దబిడ్డ పని ఒక్కతే 15 ఎకరాల పొలంలో వరాలు తీస్తది. మూడో బిడ్డ కూడా అంతే కష్టం చేస్తది. ఆమెను ఊర్లనే ఇచ్చినాను. అందరూ పిల్లలను మంచిగ చదివిస్తున్నారు. పెద్దామె కూతురు ఇంజనీరింగ్ అయిపోయింది. మొత్తం నలుగురు మనవళ్లు. ఐదుగురు మనవరాళ్లు.  పండగలకు అందరు వస్తారు. ఇల్లంత సందడి సందడిగ ఉంటది." అని ఆగాడు మల్లయ్య.

" అమ్మా నాయనలకు కొడుకుల్లేని బాధ లేకుండా చూసుకోవాలి. అదొక్కటే ఉండేది. అట్ల చూసుకుంటున్నం. మా అక్క జెల్లలందరం పొలం పనులన్నీ చేస్తం నాన్నే ముందుండి నడిపిస్తడు. గొప్ప చదువులేం లేకపోయినా మా కాళ్లమీద మేం బతకగలమన్న ధీమా ఇచ్చాడని మల్లయ్య కూతుళ్లుఅంటున్నారు.

ఇంట్లోనే ట్రాక్టర్ ఉంది. ఎవరో డ్రైవర్ని పెట్టుకోవడం ఎందుకని మేమే పట్టుబట్టి నేర్చుకున్నం." అని గట్టిగా నవ్వారు.మల్లయ్య వాళ్లను చూసి మురుస్తుంటే, రవీందర్ చిన్నగా నవ్వాడు."నాతో పాటే గంగమ్మ, బాలనాగమ్మ కూడా ట్రాక్టర్ తోల్తారు. దున్నడం అయినా, దమ్మయినా వాళ్లే చేస్తరు. లోడు బండి కూడా నడుపుతారు. టౌన్ దాకాపోయి ఎరువులు తీసుకొస్తరు. నాగమ్మకు లైసెన్స్ కూడా వచ్చింది. మోటర్, పైడ్లైన్రిపేర్లన్నీ చూసుకుంటరు" అని గర్వంగా చెప్తున్నాడు మల్లయ్య.

ఇద్దరు కలిసి ఒక్క రోజులో 40 చెట్లకు పాదులు తీస్తరు. పొద్దుగాల ఆరింటికి తోటకు వచ్చినమంటే మళ్లీ చీకటి పడితేనే ఇంటికిపోయేది.వచ్చేటప్పుడే అన్నం తెచ్చుకొంటం. పేపరు తెచ్చుకుంటం. పిల్లలే వార్తలు చదివి వినిపిస్తరు. తోటలో ఓ పక్క కూరగాయలు వేసినం. పై ఖర్చులన్నీ వాటిమీదే . బిడ్డలకొచ్చిన తోటకూడా మేమే చూస్తున్నం. పెట్టుబడి పోను మిగతా సొమ్మువాళ్లకు పంపిస్తం. .చీకటి పడుతున్నది మేం ఇంటికి పోతామన్నట్టు కదిలారు మల్లయ్య కూతుళ్లు."నేను జరసేపట్ల వస్త పద" అన్నాడు మల్లయ్య.రవీందర్ వైపు తిరిగి చూస్తూ, "మొదట మొగపోరగాళ్లు లేదని బాధపడ్డా. కానీ, నా బిడ్డల చూస్తే సంతోషంగ ఉంటది. 

ఆడపిల్లలైనా మగోళ్ల కంటే ఎక్కువ కష్టం చేస్తరు. ఒట్టిగ కూసోసటం వాళ్లకు చేతకాదు. భయపడడం తెల్వదు. ఎంత రాత్రయినా సరే బాయికాడికి పోయి మోటర్ ఏస్తరు. సరుకులు తేవాలన్నా వాళ్లే బండి ఏస్కపోయి టౌన్ నించి తీస్కొస్తరు "అని చెప్తూ ఆగాడు మల్లయ్య.రవీందర్ మాత్రం మల్లయ్య ఏం మాట్లాడతాడా అనే చూస్తున్నాడు.

"నా బిడ్డలు వచ్చినంక, నేను ఇట్ల ఇయ్యాల అవార్డు కూడా తీసుకున్నంక ఏమనిపిస్తదంటే, రైతు అనేవాడు రాజు అయితడా కాదా అన్నది పక్కనబెడితే...  రైతు బిజినెస్ మ్యాన్ కావాలి. నా ఇంట్ల అడ పిల్లలే నన్ను బిజినెస్ మ్యాన్ని చేసిన్రు” అని నవ్వాడు మల్లయ్య.సూర్యుడి దిగిపోయి అప్పటికే కొద్దిసేపు దాటిపోయింది. రవీందర్.. మల్లయ్యను కలవడం ద్వారా ఏదో కొత్త విషయం తెలుసుకున్నట్టు లేచి అతనితో పాటే ఊళ్లోకి బయలుదేరాడు.