
Crypto Scams: ఆధునిక టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ దాని నుంచి వస్తున్న ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ కొత్త మార్గాలను అన్వేషిస్తూ ప్రజల ఖాతాల నుంచి డబ్బు కొట్టేయటం, పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడటం పెరుగుతోంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నేరగాళ్లు ఎక్కువగా సీనియర్ సిటిజన్లను, రిటైర్డ్ ఉద్యోగులను, పెద్ద వయస్సు వాళ్లను టార్గెట్ చేయటమే.
ఇటీవల భారత వైమానిక దళంలో మూడు దశాబ్ధాలకు పైగా పనిచేసి రిటైల్ అయిన ఉద్యోగి ప్రశాంతమైన జీవనం గడపాలని నిర్ణయించుకున్నారు. కానీ సైబర్ నేరగాళ్లు చేసిన మోసంతో అతని కల తలకిందులైంది. సైబర్ స్కామర్ల చేతిలో మోసపోయిన రిటైల్డ్ ఉద్యోగి తన జీవితకాలం కష్టపడిన రిటైర్మెంట్ సొమ్ము రూ.20 లక్షలు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అంటూ పరిచయమైన మోసగాళ్ల పాలైంది. ఇటీవలి కాలంలో క్రిప్టో పెట్టుబడులకు ప్రాచుర్యం పెరగటాన్ని సైబర్ మోసగాళ్లు మోసాలకు అడ్డాగా మార్చుకోవటం చాలా మంది వాళ్ల వలలో చిక్కేలా చేస్తోంది.
క్రిప్టో పెట్టుబడులతో అధిక లాభాలంటూ మోసగాళ్లు సోషల్ మీడియా పోస్టులు, మెసేజ్ లు, తప్పుడు యాప్స్, నకిలీ వెబ్ సైట్లు, ఈమెల్స్ ద్వారా సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్నారు. అయితే అసలు వాటికి నకిలీలకు మధ్య తేడాలు గుర్తించలేకపోతున్న చాలా మంది చివరికి జీవితాంతం కష్టపడిన సొమ్మును కోల్పోతున్నారని జియోటాస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ వెల్లడించారు.
మోసగాళ్ల నుంచి సీనియర్ సిటిజన్లు సేఫ్ గా ఉండటానికి పాటించాల్సి సూత్రాలు..
* ముందుగా క్రిప్టోల్లో పెట్టుబడి గురించి, అసలైన క్రిప్టో ఎక్స్ఛేంజీల గురించి సమాచారం తెలుసుకోవటం ముఖ్యం. దేశంలోని నిజమైన క్రిప్టో ట్రేడింగ్ సంస్థలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటాయి. వీటి గురించి తెలుసుకునేందుకు సదరు యాప్ లేదా వెబ్ సైట్ రివ్యూలను గమనించటం కొంత రీసెర్చ్ చేయటం ముఖ్యం.
* ఇక రెండవ జాగ్రత్త అధిక ఆదాయం లేదా లాభాలు ఆశజూపే నేరగాళ్లు, వాళ్లు చెప్పే కొత్తకొత్త స్కీమ్స్ కి దూరంగా ఉండటం. ఇలాంటి మాయమాటలు చెప్పారంటే ముందు వారికి దూరంగా ఉండాలని గుర్తుంచుకోండి. ఈక్విటీల్లాగానే క్రిప్టోల్లో పెట్టుబడులు కూడా ఓలటాలిటీతో పాటు రిస్క్ కలిగి ఉంటాయి కాబట్టి లాభాలు, నష్టాలు అనేవి తప్పక ఉంటాయని గుర్తుంచుకోండి. ప్రసిద్ధ క్రిప్టో ఎక్స్ఛేంజీలు అధిక రాబడులు వస్తాయంటూ తమ కస్టమర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఫోన్ కాల్స్ లేదా మెసేజీలు పంపవు. అలాంటి మెసేజ్ లేదా కాల్స్ వచ్చాయంటే అవి ఫేక్ అని గుర్తుంచుకోండి.
ALSO READ : 10 ఏళ్లలో ఏడు రెట్లు పెరిగిన మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు.. ఎక్కువ డబ్బు ఆ స్కీమ్స్ లోకే..!!
* ఇక మోసగాళ్లు ఫాలో అయ్యే మరో టెక్నిక్ అచ్చం ఒరిజినల్ వెబ్ సైట్లు, యాప్స్ మాదిరిగా ఉండే వాటిని సృష్టించి ప్రజలను మోసగించటం. వీటిని గుర్తించటానికి యూఆర్ఎల్ అక్షర దోషాలు లేకుండా ఉందో లేదో మెుదట గమనించాలి. అలాగే ఒరిజినల్ సైట్లకు URLs అని ఉంటాయి. వీటిలో వెబ్ సైట్ పేరు ప్రారంభం "https://" తో ఉంటూ ఒక ఆకుపచ్చని తాళం వేసి ఉంటుంది. అంటే మీరు చూస్తున్న సైట్ సేఫ్ అని అర్థం.
* మీరు పెట్టుబడి ఖాతాలను నిర్వహించేటప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ వినియోగించటంతో పాటు ఖాతాల పాస్ వర్డ్ ఇతరులతో పంచుకోకుండా ఉంచటం మంచిది. పెట్టుబడి ఖాతాలను పబ్లిక్ వైఫైలో ఓపెన్ చేయకపోవటం మంచిది. పెట్టుబడి గురించి ఇంట్లోని వ్యక్తులకు సమాచారం అందించటం ఆర్థిక సలహాదారులను కలిసి ఎప్పటికప్పుడు పోర్ట్ ఫోలియోను గమనించటం మంచిది.
* ఇక చివరిగా సైబర్ మోసాల నుంచి రక్షణ పొందటానికి కావాల్సింది మారుతున్న టెక్నాలజీ, రోజురోజుకూ పుట్టుకొస్తున్న కొత్త మోసాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవటం రక్షణ గోడగా నిలుస్తుందని సీనియర్ సిటిజన్లు గుర్తుంచుకోవాలి. ఆధునిక యుగంలో డిజిటల్ ఫైనాన్స్ గురించి తెలుసుకోవటం.. వాటిలో పాటించాల్సిన సేఫ్టీ మెజర్స్ గురించి అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు కంగారు పడకుండా తగిన సమయం తీసుకుని క్రిప్టో పెట్టుబడులు, వాటి పర్యవసానాలు, దేశంలోని రిజిస్టర్డ్ క్రిప్టో సంస్థలు, క్రిప్టోల నిర్వహణ వంటి అన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఇది సీనియర్ సిజిటన్లకు తమ క్రిప్టో పెట్టుబడులపై నమ్మకాన్ని పెంచుతుంది. వారి పెట్టుబడి ప్రయాణాన్ని రక్షణాత్మకంగా మారుస్తుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవటం మంచిదని జియోటాస్ లాంటి సంస్థల ద్వారా పెట్టుబడులు సురక్షితమైనదిగా విక్రమ్ సుబ్బురాజ్ అభిప్రాయపడ్డారు.