హైదరాబాద్ సిటీ, వెలుగు: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆ అపార్ట్మెంట్ 'బ్లాక్ బి' రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ డీన్ వాస్కో ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మధు పార్క్ రిడ్జ్‌ను ఎప్పుడూ స్వాధీనం చేసుకోలేదని ఒకసారి, అపార్ట్మెంట్ నివాసితులు ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించారని మరోసారి సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ ప్రతిపాదనను తాము వ్యతిరేకించలేదని, అలాగని అంగీకరించనూ లేదని స్పష్టం చేశారు. కేవలం నోటి మాటలతో చెప్పే అంశాలను పరిగణనలోకి తీసుకోలేమన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రపోజల్ వచ్చినా, పూర్తి వివరాలతో లిఖితపూర్వకంగా ఉండాలని డిమాండ్ చేశారు.
