కేసీఆర్ లెక్కనే..మోదీకి భంగపాటు తప్పదు

కేసీఆర్ లెక్కనే..మోదీకి భంగపాటు తప్పదు
  •     పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ 

ఎల్​బీనగర్,వెలుగు :  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేస్తూ .. దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారని        పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ మండిపడ్డారు. మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డికి మద్దతుగా ఆదివారం చంపాపేటలో వాకర్స్ తో నిర్వహించిన సమావేశంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. పదేండ్లు పాలించిన కేసీఆర్ .. మూడోసారి తనదే అధికారం అని విర్రవీగి భంగపాటుకు గురయ్యాడని విమర్శించారు.

ప్రస్తుత లోక్ సభ ఎన్నికలల్లోనూ  మోదీకి కూడా భంగపాటు తప్పదన్నారు. కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికలు దేశంలో అత్యంత కీలకమైనవని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో 15 ఎంపీ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన మల్కాజ్ గిరి సీటును మళ్లీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నారు.

పార్టీ అభ్యర్థి పట్నం సునీతారెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. రాష్ట్ర రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి, పీసీసీ ప్రతినిధి జక్కిడి ప్రభాకర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ సామ రమణారెడ్డి,డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు  శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.