కేసీఆర్‌వి గల్లీ నాటకాలు: మధు యాష్కీ గౌడ్

కేసీఆర్‌వి గల్లీ నాటకాలు: మధు యాష్కీ గౌడ్

టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్. రాష్ట్రానికి ఏం కావాలో కేసీఆర్ కు అవగాహన లేదని విమర్శించారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సదస్సులో.. విభజన చట్టంలో పేర్కొన్న వాటి గురించి కేసీఆర్ సర్కార్ ప్రస్తావించలేదన్నారు. ఐటీఐఆర్ పార్క్, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఖాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై సదరన్ కౌన్సిల్ సమావేశంలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఈ అంశాలపై ఏడేళ్లలో ఏనాడైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసిందా.. కనీసం అడిగిందా అన్నారు.  మోడీ ప్రభుత్వానికి పార్లమెంట్ లో అండగా నిలిచిన కేసీఆర్.. ఇప్పుడు గల్లీల్లో నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.

కేంద్రంతో కుస్తీ పడుతున్నట్లు కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మధుయాష్కి విమర్శలు చేశారు. కేంద్రం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు లేవని అంటున్నారంటే.. ఇన్నేళ్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు తీసుకురాలేకపోయాని కేసీఆర్ ప్రభుత్వం అంగీకరించినట్లేనని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వానికి బీజేపీతో కుస్తీ డ్రామాలు ఆడేందుకు సమయం ఉంది కానీ.. పత్తి రైతులకు మద్దతు ధర ఇచ్చేందుకు సమయం ఉండదన్నారు. కేవలం వారం రోజుల్లోనే వెయ్యి రూపాయలు తగ్గి పత్తి రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్-బీజేపీలు ఇప్పటికైనా దోస్తీ-కుస్తీ నాటకాలు ఆపి.. పత్తికి మద్దతు ధర, ధాన్యం కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలన్నారు మధుయాష్కి.