బీఆర్ఎస్​కు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నరు: మధుయాష్కీ

బీఆర్ఎస్​కు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నరు: మధుయాష్కీ

హైదరాబాద్, వెలుగు: వారెంట్ లేకుండా ఇండ్లు, ఆఫీసులపై అర్ధరాత్రి దాడులు ఏంటని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ఫైర్ అయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అర్ధరాత్రి సోదాలతో కుటుంబ సభ్యులను భయపెడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై సీఈవో వికాస్ రాజ్​కు శనివారం ఆయన ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు. 

పోలీసులు మాత్రం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పినట్లు పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్​కు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదన్నారు. తాను మాజీ ఎంపీ అని, నాలుగు సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని, ఇప్పటిదాకా ఇలాంటి ఘటనలు ఎన్నడూ ఎదుర్కోలేదని చెప్పారు. కొన్ని రోజుల కింద అర్ధరాత్రి తన ఇంట్లో సోదాలు చేసిన వనస్థలిపురం ఏసీపీ భీమ్ రెడ్డి, హయత్​నగర్ సీఐ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈసీఐ, డీజీపీకి కూడా ఫిర్యాదు చేస్తామన్నారు.