వంశీకృష్ణకే మాదిగల మద్దతు

వంశీకృష్ణకే మాదిగల మద్దతు
  •        కాంగ్రెస్‌‌తోనే దళితుల సంక్షేమం: ఎంహెచ్‌‌డీ నాయకుడు రేగుంట సునీల్ మాదిగ 
  •        బీజేపీని గెలిపిస్తే దళితుల హక్కులను కాలరాస్తుందని ఆరోపణ 
  •        ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్‌‌‌‌ను అరెస్టు చేయాలి: వివేక్ వెంకటస్వామి 
  •        రాజకీయ లబ్ధి కోసం దళితుల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్: గడ్డం వంశీకృష్ణ 

మంచిర్యాల/ బెల్లంపల్లి వెలుగు : పెద్దపల్లి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకే మాదిగల మద్దతు ఉంటుందని మాదిగ హక్కుల దండోరా (ఎంహెచ్‌‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీనే దళితుల సంక్షేమానికి పాటుపడుతున్నదని చెప్పారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, దుర్గం నరేశ్‌‌లతో కలిసి బుధవారం మంచిర్యాలలోని వివేక్ నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. 

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ 2002 జూన్ 9న నిజాం కాలేజీ గ్రౌండ్స్‌‌లో జరిగిన సభలో గుజరాత్‌‌లో మోదీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని, ఆర్ఎస్ఎస్‌‌ను నిషేధించాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌కు మద్దతు ఇవ్వడమే కాకుండా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు బీజేపీకి మాదిగలు సపోర్ట్ చేయాలని చెప్పడం వెనుక మర్మం ఏంటని సునీల్‌‌ ప్రశ్నించారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్ర మంత్రులతో పాటు ఆ పార్టీ నాయకులు చెప్తున్నారన్నారు. 

అంబేద్కర్ అందించిన రాజ్యాంగంతోనే దళితులకు హక్కులు లభించాయని, బీజేపీ రాజ్యాంగాన్ని మారిస్తే మళ్లీ వెనుకటి పరిస్థితులు వస్తాయని చెప్పారు. బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్ దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. మందమర్రిలోని లెదర్ పార్కును పూర్తిచేస్తే 15 వేల మంది దళితులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలొస్తాయని, ఈ మేరకు వివేక్ వెంకటస్వామి మాట ఇచ్చారని తెలిపారు. 

మాదిగల ఆత్మగౌరవాన్ని చాటేలా ఊరూరా మాదిగ భవన్‌‌ల నిర్మాణాలకు కూడా హామీ ఇచ్చారన్నారు. గడ్డం వంశీకృష్ణకు మంచి విజన్ ఉందని, ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎన్నికల్లో ఆయనను భారీ మెజారిటీతో గెలిపించడానికి మాదిగలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 

రాష్ట్రంలో వార్‌‌‌‌ వన్‌‌ సైడ్‌ ‌:  వివేక్​

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌ను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ప్రభుత్వ పర్మిషన్‌‌తో దేశ భద్రత కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారని, కానీ బీఆర్‌‌‌‌ఎస్ హయాంలో ప్రతిపక్షాలను అణచివేయడం కోసం ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు. తన ఫోన్‌‌ను సైతం ట్యాపింగ్ చేశారని చెప్పారు. దిగజారుడు రాజకీయాలు చేసిన బీఆర్‌‌‌‌ఎస్‌‌కు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

 పంద్రాగస్టు లోపు రైతు రుణమాఫీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో చర్చిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉందని, కాంగ్రెస్‌‌కు 14 ఎంపీ సీట్లు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదని, బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చినా తెలంగాణకు ఒరిగేదేమీ లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మందమర్రిలో స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్‌‌‌‌ను ప్రారంభించామని, చెన్నూర్‌‌‌‌లో త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

సింగరేణిలో కొత్త మైన్స్, జైపూర్ ఎస్టీపీపీలో 800 మెగావాట్ల యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. మందమర్రిలో లెదర్ పార్క్‌‌ను త్వరలోనే పూర్తి చేస్తామని, గ్రామాల్లో మాదిగ భవన్‌‌లను కూడా నిర్మిస్తామని వివేక్‌‌ హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మాట్లాడుతూ.. గత పదేండ్లలో బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. 

నిస్వార్థంగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్కటి జనార్దన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్లూరి శ్రీనివాస్, కుశ్నపెల్లి నారాయణ, కలాల రమేశ్, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కడారి రమేశ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కండె కుమారస్వామి, జగిత్యాల జిల్లా ఇన్‌‌చార్జి రామిళ్ల లక్ష్మణ్, నాయకులు అటికపురం సమ్మయ్య, ఎల్కపెల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్‌‌ది బ్రిటీషర్ల సిద్ధాంతం: వంశీకృష్ణ 

బ్రిటీషర్ల విభజించి పాలించు సిద్ధాంతాన్ని బీజేపీ, బీఆర్‌‌‌‌ఎస్ ఫాలో అవుతున్నాయని, దళితుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్రలు చేస్తున్నాయని కాంగ్రెస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థులు ఓటమి భయంతోనే తమ కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము కుల మతాలకు అతీతమని, పేదలకు సేవ చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పదవులు ఉన్నా, లేకున్నా ప్రజల మధ్యనే ఉన్నామని, విశాక చారిటబుల్ ట్రస్ట్, వెంకట స్వామి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. 

అనంతరం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బజార్ ఏరియాలో వంశీకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులను మోసం చేసిన బీజేపీకి.. రాష్ట్ర ఖజానాను లూటీ చేసిన బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో ఓట్లేయకుండా చిత్తుగా ఓడించాలని ప్రజలను కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో రెండు సార్లు గెలిచిన బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.  బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కాలేజ్, ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తాండూర్, కాసీపేట, నెన్నెల, కన్నేపల్లి, వేమనపల్లి, బెల్లంపల్లి, భీమిని మండలాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు.