న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ వేళ టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం (ఫిబ్రవరి 10) రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ప్రత్యేక వైద్య బృందం అతడికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గురువారం (ఫిబ్రవరి 12) నమీబియాతో మ్యాచుకు ముందే అభి ఆసుపత్రి పాలుకావడం ఆందోళనకరంగా మారింది.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా అమెరికాతో భారత్ ఆడిన తొలి మ్యాచు సమయంలో కూడా అభి అనారోగ్యంగానే ఉన్నాడు. అయినప్పటికీ అమెరికాతో జరిగిన మ్యాచులో బరిలోకి దిగాడు. కానీ ఈ మ్యాచులో గోల్డెన్ డకౌటై తీవ్ర నిరాశపర్చాడు. అభి ఆరోగ్య సమస్య కొంచెం తీవ్రంగా ఉండటంతో నమీబియాతో జరిగే మ్యాచ్‌కు అతడు డౌటేనని బీసీసీఐ వర్గాల సమాచారం.
మ్యాచ్ సమయానికి అభి కోలుకోకపోతే అతడి స్థానంలో సంజు శాంసన్ ఇన్సింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. 2026, ఫిబ్రవరి 15న దాయాదులతో జరగనున్న మహా సమరం నాటికి అభి కోలుకోవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ ధనాధన్ బ్యాటర్ త్వరగా కోలుకోవాలని అతడి అభిమానులు ప్రార్థిస్తున్నారు.
అభిషేక్ హెల్త్ కండిషన్‌పై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ అప్డేట్ ఇచ్చారు. నమీబియాతో మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలిపాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో అతడు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాకపోవడానికి కూడా ఇదే కారణమని చెప్పాడు. మరో రెండు రోజుల్లో అతడు కోలుకుంటాడని ఆశిస్తున్నామని పేర్కొన్నాడు.
