
- తాజాగా గోదావరి వరదలు చెప్పిన సత్యం
- పూర్తిగా దానిపైనే ఆధారపడితే భారీ ఖర్చు
- తుమ్మిడిహట్టి నుంచి నేరుగా నీళ్లొచ్చే చాన్స్
- సుందిళ్లకు లింక్ చేయాలంటున్న నిపుణులు
- గతంలోనే వేలకోట్లతో 70 శాతం కాల్వలు రెడీ
- 55 ఏండ్ల లెక్కల్లో.. ప్రాణహితలో కావల్సినన్ని నీళ్లు
కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత కూడా గోదావరి వరదను లిఫ్ట్ చేసుకోలేకపోవడం కొత్త అనుమానాలను తెరపైకి తెచ్చింది. ఈ ప్రాజెక్టు ప్రభుత్వం ఆశించిన ఫలితాలను ఇస్తుందా అన్న చర్చ మొదలైంది. మేడిగడ్డ నుంచి కోట్లాది రూపాయల ఖర్చుతో సుందిళ్ల వరకు లిఫ్ట్ చేసుకున్న నీళ్లను మళ్లీ కిందికి వదులుకోవాల్సి వచ్చింది. నీళ్లు ఎక్కువగా ఉంటాయనే మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టామని సర్కారు చెబుతుంటే, వరద వచ్చిందన్న కారణంతోనే అక్కడ నీళ్లను లిఫ్ట్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో మేడిగడ్డపై పూర్తిగా ఆధారపడితే లాంగ్ టర్మ్ లో రాష్ట్రానికి పెద్ద భారంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ కంటే తుమ్మిడిహట్టి నుంచే నేరుగా వరద నీళ్లను తెచ్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుందని వారు చెబుతున్నారు. కొన్నిరోజులుగా ప్రతిపక్ష నేతలు కూడా ఇదే వాదనను వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టి వరద వివరాలపై ‘వెలుగు’ స్పెషల్ రిపోర్ట్.
హైదరాబాద్, వెలుగు: ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సర్కారు, రెడీ అయిన పంపులతో 5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసింది. మేడిగడ్డ నుంచి అన్నారం బ్యారేజీ వరకు, అక్కడి నుంచి సుందిళ్ల వరకు రెండు దశల్లో ఎత్తిపోశారు. మూడో దశ లిఫ్ట్ కు రెడీ అయ్యే సమయానికే గోదావరిలో వరద వెల్లువెత్తింది. పైన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయిన తర్వాత కూడా వరద కొనసాగింది. దీంతో ఎల్లంపల్లిలో కొన్ని గేట్లు ఎత్తడంతో పాటు కింద ఉన్న సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గేట్లన్నీ ఎత్తి నీళ్లను కిందికి వదలాల్సి వచ్చింది. అప్పటికే కరెంటు బిల్లుకు కోట్లు ఖర్చు చేసి ఎత్తిపోసిన నీళ్లతో పాటు కొత్తగా వచ్చిన వరదను ప్రవాహంలోకి వదిలేశారు. కింద మేడిగడ్డ దగ్గర కూడా మరింత ఉద్ధృతంగా ప్రవాహం ఉండడంతో అక్కడా అన్ని గేట్లనూ ఎత్తి నీళ్లను కిందికి వదిలారు. మరోదిక్కు పంప్ హౌస్ లన్నీ పూర్తిగా నిలిపేశారు. నిజానికి మేడిగడ్డ దగ్గర ప్రవాహం బాగా ఉంటుందని చెప్పే సర్కారు రీడిజైన్ లో ఇక్కడ బ్యారేజీని ప్రతిపాదించింది. విచిత్రంగా ప్రవాహం ఎక్కువగా వచ్చినందుకే ఇక్కడ నీళ్లను లిఫ్ట్ చేసుకోలేకపోవడం సీనియర్ ఇంజినీర్లలో చర్చకు దారితీసింది.
కాళేశ్వరం లిఫ్టుల కోసం ఎన్ని వేల కోట్లైనా ఖర్చుచేస్తామని సర్కారు చెబుతున్నా, వచ్చిన వరదను నిల్వ చేసుకోలేనప్పుడు వృథా ఖర్చు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో ప్రతిపాదించినట్లుగా తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తెచ్చుకోవడమే మేలని చెబుతున్నారు. తుమ్మిడిహట్టి నుంచి పెద్దగా భారం లేకుండా నేరుగా నీళ్లను తెచ్చుకునే అవకాశం ఉండడమే దీనికి కారణం. అక్కడ 55 ఏండ్ల ప్రవాహం లెక్కలు చూసినా రాష్ట్ర అవసరాలకు కావాల్సినన్ని నీళ్లు అందుబాటులో ఉన్నాయని సీనియర్ ఇంజినీర్లు చెబుతున్నారు. ఇలాంటి వెసులుబాటును పక్కనబెట్టి పూర్తిగా మేడిగడ్డ నుంచి లిఫ్టుల మీద ఆధారపడితే దీర్ఘకాలంలో రాష్ట్రానికి పెను భారంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. మేడిగడ్డ నుంచి మూడుదశల్లో లిఫ్ట్ చేసి ఎల్లంపల్లికి తరలించడంతో పాటు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సర్కారు రూ.80వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది.
తుమ్మిడిహట్టి నుండి నేరుగా
గోదావరిలో 44 ఏండ్ల వరద లెక్కల ఆధారంగా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టును డిజైన్ చేశామని సర్కారు చెబుతోంది. తుమ్మిడిహట్టి దగ్గర 55 ఏండ్ల లెక్కలు ప్రకారం చూసినా కావాల్సినన్ని నీళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ మహారాష్ట్రకు సమస్య లేకుండా 148 అడుగుల ఎత్తు నుంచి మన అవసరాలకు సరిపడా నీళ్లను తెచ్చుకునే అవకాశం ఉందంటున్నారు. తుమ్మిడిహట్టి దగ్గర వరద రోజుల్లో 165 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని వాప్కోస్ తేల్చింది. అలాగే తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లి దిగువన సుందిళ్ల వరకు దాదాపు 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇందులో దాదాపు 70 కిలోమీటర్లు అంటే నెన్నెల మండలం కోనంపేట వరకు కాలువలు పనులు పూర్తై రెడీగా ఉన్నాయి. మిగిలిన 30 కిలోమీటర్ల మేర టన్నెల్ వేయాల్సి ఉంది. దీంతో పాటు తుమ్మిడిహట్టి ఎగువన ప్రధాన బ్యారేజీని నిర్మిస్తే ఎలాంటి లిఫ్ట్ లేకుండా నేరుగా సుందిళ్లకు నీళ్లు తీసుకపోవచ్చు. సుందిళ్ల ఎగువన ఉన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లిలోకి తీసుకోవచ్చు. ఈ లిఫ్ట్ లో ఒక్కో టీఎంసీని ఎత్తిపోయడానికి రూ.1.80 కోట్లు ఖర్చవుతుంది. ఇలా 165 టీఎంసీలను తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు తెచ్చి లిఫ్ట్ చేసుకుంటే అయ్యే ఖర్చు రూ.297 కోట్లు. మరోవైపు ఎల్లంపల్లిలో ఎలాంటి ఖర్చు లేకుండా ఏటా సగటున 35 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. ఇలా మొత్తం 210 టీఎంసీల నీళ్లను వాడుకునే అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి నుంచి అతి తక్కువగా 100 టీఎంసీల నీళ్లనే తెచ్చి లిఫ్ట్ చేసుకున్నా అయ్యే ఖర్చు రూ.180 కోట్లే. ఎల్లంపల్లికి చేరిన నీళ్లను రెండు దశల్లో లిఫ్ట్ చేసి మిడ్ మానేరుకు తీసుకెళ్లడం ప్రాణహిత పాత, కొత్త డిజైన్లలో కామన్ గా ఉంది.
మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేస్తే…
వాప్కోస్ లెక్కల ప్రకారం మేడిగడ్డ దగ్గర నీళ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచే లిఫ్ట్ చేస్తున్నామని సర్కారు చెబుతోంది. సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తుండే మేడిగడ్డ నుండి 148 అడుగుల ఎత్తుండే ఎల్లంపల్లికి మూడు దశల్లో లిఫ్ట్ చేయడానికి మూడు బ్యారేజీలు, మూడు పంప్ హౌస్ లు కట్టారు. వీటి ద్వారా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఒక టీఎంసీ నీళ్లు చేరడానికి అయ్యే కరెంటు ఖర్చు రూ.5.70 కోట్లు. ఇలా 165 టీఎంసీల నీళ్లని లిఫ్టు చేయడానికి రూ.940 కోట్లు ఖర్చవుతుంది.
కావాల్సినన్ని నీళ్లు
గోదావరి బేసిన్ లో మన రాష్ట్రం అవసరాలకు 400 టీఎంసీల నీళ్లు కావాలి. తుమ్మిడిహట్టి దగ్గర అన్ని నీళ్లు ఉండవు కాబట్టే డిజైన్ మార్చామని సర్కారు చెప్పింది. అయితే అధికారిక లెక్కల ప్రకారమే తుమ్మిడిహట్టి దగ్గర వరద రోజుల్లో నికరంగా 165 టీఎంసీలు తీసుకునే వీలుంది. మిగిలిన రోజుల్లో కాస్త ప్రవాహం తక్కువున్నా మొత్తం మీద 200 టీఎంసీలకు పైనే నీళ్లను తీసుకోవచ్చు. ఎల్లంపల్లిలో దొరికే 35 టీఎంసీలు కూడా వాడుకున్న తర్వాత ఇంకా అవసరం ఉంటే అప్పుడు మేడిగడ్డ నుండి లిఫ్ట్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తుమ్మిడిహట్టిని ఉపయోగించుకుంటే కరెంటు ఖర్చు భారం చాలా తగ్గిపోతుంది. ఒకవేళ ఎగువ గోదావరిలో వరద బాగుంటే రాష్ట్ర అవసరానికి 300 టీఎంసీల నీళ్లు సరిపోతాయి. అప్పుడు తుమ్మిడిహట్టి నీళ్లతోనే రాష్ట్ర అవసరాలు తీరతాయి. అలాంటప్పుడు మేడిగడ్డ నుంచి లిఫ్టుల కోసం వందలు, వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. తుమ్మిడిహట్టి నుంచి 165 టీఎంసీలను తీసుకోవడానికి అయ్యే ఖర్చు కంటే మేడిగడ్డ నుంచి 55 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.
ఖర్చు తేడా ఏటా 800 కోట్ల పైనే!
రాష్ట్రానికి 400 టీఎంసీలు అవసరం అనుకుంటే అంత మేరకు నీళ్లను తుమ్మిడిహట్టి నుంచి, మేడిగడ్డ నుంచి తీసుకోవడానికి ఖర్చులో చాలా తేడా ఉంది. తుమ్మిడిహట్టి నుంచి తెచ్చుకుంటే ఏటా రూ.800 కోట్లకు పైనే ఖర్చు తగ్గుతుందని అంచనా. తుమ్మిడిహట్టి దగ్గర వరద ఎక్కువున్న రోజుల్లో 165 టీఎంసీలు, వరద తక్కువున్న రోజుల్లో 45 టీఎంసీలపైనే నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. ఈ 210 టీఎంసీలు పైసా ఖర్చు లేకుండా సుందిళ్లకు చేరుతాయి. అక్కడి నుండి ఒకే లిఫ్ట్ తో ఎల్లంపల్లిలో పోయడానికి రూ.378 కోట్లు అవుతుంది. ఎల్లంపల్లిలో దొరికే 35 టీఎంసీలు కలిపితే 245 టీఎంసీలు అవుతుంది. రాష్ట్ర అవసరాల కోసం మరో 155 టీఎంసీలను మేడిగడ్డ నుంచి మూడు దశల్లో లిఫ్ట్ చేసుకుంటే కరెంటు ఖర్చు రూ.883 కోట్లు అవుతుంది. ఈ రెండూ ఖర్చులూ కలిపి రూ.1,261 కోట్లతో ఎల్లంపల్లి ద్వారా 400 టీఎంసీలను వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటి డిజైన్ ప్రకారం 365 టీఎంసీలను (ఎల్లంపల్లిలో 35 టీఎంసీలు మినహాయించి) పూర్తిగా మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయడానికి రూ.2080.50 కోట్లు ఖర్చవుతుంది. ఇలా తుమ్మిడిహట్టిని ఉపయోగించుకుంటే రూ.800 కోట్లకు పైగా ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
తుమ్మిడిహట్టే ఎందుకంటే…
పాత ప్రాణహిత ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ కట్టడానికి మహారాష్ట్ర సర్కారు ఒప్పుకోలేదు. ఈ ప్రాంతానికి దగ్గరలో వన్యప్రాణుల కేంద్రం ఉందంటూ అభ్యంతరం చెప్పింది. మహారాష్ట్రలో కొంత ముంపు ఉండడం మరో కారణం. దీంతో డిజైన్‌లో ప్రతిపాదించిన ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఎగువన 148 మీటర్ల ఎత్తులోనే బ్యారేజీ కడతామని తెలంగాణ సర్కారు చెబితే మహారాష్ట్ర ఒప్పుకుంది. ఈ డిజైన్‌లో 148 మీటర్ల ఎత్తు నుండి కూడా రోజుకు రెండు టీఎంసీల నీళ్లు తీసుకునే వీలుంది. వరద బాగున్నప్పుడు ఇంకిన్ని నీళ్లను తీసుకోవడానికి కాలువలను కాస్త లోతుగా తవ్వుకుంటే సరిపోతుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ విషయంలో గతంలోనే పెద్ద చర్చ జరిగింది. 148 మీటర్ల ఎత్తులోనే కావాల్సినన్ని నీళ్లను తీసుకోవచ్చని నిపుణులు, విపక్షాలు చెప్పినా సాధ్యం కాదంటూ సర్కారు వాదించింది. అయితే తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో 1, 3, 4 ప్యాకేజీల పనులు అప్పటికే పూర్తయ్యాయి. 2, 5 ప్యాకేజీల పనులు మాత్రమే మిగిలాయి. ఇందులో 2వ ప్యాకేజీలో ప్రధాన బ్యారేజీ కట్టాల్సి ఉంది. 5వ ప్యాకేజీలో దాదాపు 30 కిలోమీటర్ల టన్నెల్ పనులు కావాలి. వీటిని పూర్తిచేస్తే వరద ఉన్నంతకాలం రోజుకు 2 టీఎంసీల నీళ్లను తీసుకునే అవకాశం ఉంది.