- ఆలయాల్లో వీఐపీ కల్చర్, ప్రత్యేక దర్శనాలు సరికాదు..
- దేవుడి ముందు అందరూ సమానులే: మద్రాస్ హైకోర్టు
- తాము ఏ సమయంలోనైనా గుడికి వెళ్లవచ్చని,
చెన్నై: దేవాలయాల్లో వీఐపీల కోసం ప్రత్యేక దర్శనాలు ఎందుకని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది. తాము ఏ సమయంలోనైనా గుడికి వెళ్లవచ్చని, దేవుడు తమ కోసం ఎదురుచూస్తాడని మంత్రులు, ఎమ్మెల్యేలు అనుకోకూడదని పేర్కొంటూ..దేవుడి ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది.
దేవాలయాల్లో వీఐపీ, ప్రత్యేక దర్శనాలను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఉత్తర తమిళనాడు విభాగం అధ్యక్షుడు పి. చొక్కలింగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
సనాతన ధర్మం ధనిక, పేద తేడా లేకుండా అందరినీ సమానంగానే చూస్తుందని, మత గ్రంథాల్లో ఎక్కడా అదనపు డబ్బులు చెల్లించి దర్శనాలు చేసుకునే విధానమే లేదని ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. ప్రభుత్వం ఆదాయం కోసం, భక్తులను దోపిడీ చేయడానికే వీఐపీ పద్ధతిని తెచ్చిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, నూతన వధూవరులు, దేశ అధినేతలకు మాత్రం దీనినుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. అలాగే, దేవాదాయ శాఖ పరిధిలోని ప్రతి దేవాలయంలో వృద్ధుల కోసం వీల్ చైర్స్ ఉంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ వి. లక్ష్మీనారాయణల ధర్మాసనం శుక్రవారం విచారించింది.
మే 15న ఒక మంత్రి దర్శనం కోసం తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయ ముగింపు సమయాన్ని ఆలస్యం చేశారా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై ఏఏజీ బాలసుబ్రమణియన్ స్పందిస్తూ.. ఆలయ సమయాన్ని ఆలస్యం చేయలేదని పేర్కొంటూ నివేదికను సమర్పించారు. దీనిపై పూర్తి కౌంటర్ దాఖలు చేయడానికి ఆయన సమయం కోరారు. ఇందుకు అంగీకరించిన ధర్మాసనం.. విచారణను 6 వారాలు వాయిదా వేసింది.
