JanaNayagan: విజయ్ జన నాయగన్‌ సినిమాకు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ !

JanaNayagan: విజయ్ జన నాయగన్‌ సినిమాకు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ !

చెన్నై: తమిళ్ స్టార్ హీరో విజయ్‌ నటించిన ‘జన నాయగన్‌’ సినిమాకు విడుదల కష్టాలు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో మద్రాస్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది.

అంతేకాదు.. డివిజన్ బెంచ్ ఈ కేసును తిరిగి సింగిల్ బెంచ్కు పంపుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు CBFCకి కూడా అవకాశం ఇవ్వాలని సింగిల్ బెంచ్ జడ్జికి డివిజన్ బెంచ్ సూచించింది. CBFC నుంచి వాదనలు విన్న తర్వాతే సింగిల్ బెంచ్ ‘జన నాయగన్’ కేసులో నిర్ణయం తీసుకోవాలని మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది.

సంక్రాంతికే విడుదల కావాల్సిన విజయ్ ‘జన నాయగన్‌’ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి సర్టిఫికెట్ క్లియరెన్స్ రాకపోవడంతో ఈ వివాదం మద్రాస్ హైకోర్టు వరకూ వెళ్లింది. కోర్టులో ఈ కేసు వాయిదా పడుతూ వచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుతో విజయ్ సినిమా విడుదలకు రూట్ క్లియర్ అయిందని విజయ్ అభిమానులు ఆశించారు. మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులను తోసిపుచ్చడంతో మళ్లీ ‘జన నాయగన్’ వర్సెస్ సెన్సార్ బోర్డ్ వివాదం మొదటికి చేరింది.