
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. మాగంటి సునీత పేరును జూబ్లీహిల్స్ అభ్యర్థిగా ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దివంగత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణే సునీత. ఈ టికెట్ కోసం పలువురు బీఆర్ఎస్ నేతలు పోటీ పడగా.. గులాబీ బాస్ సునీత వైపు మొగ్గు చూపారు. సానుభూతి కలిసి రావడంతో పాటు మహిళ అభ్యర్థి కావడంతో సునీత పేరును ఖరారు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం.
అనారోగ్యం కారణంగా మాగంటి గోపినాథ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో సిట్టింగ్ సీటు కాపాడుకోవడం కోసం అన్ని పార్టీల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఉప ఎన్నిక రంగంలోకి దిగింది. అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ రాకముందు నుంచే గోపినాథ్ సతీమణి సునీత నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా పార్టీ అభ్యర్థిగా ఎంపిక కావడంతో ఆమె మరింత స్పీడ్ పెంచనున్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ సీటు దక్కించుకుని ప్రజల్లో తమ ఆదరణ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఎలాగైనా జూబ్లీహిల్స్ గడ్డపై హస్తం జెండా ఎగరేసేందుకు గెలుపు గుర్రం కోసం కాంగ్రెస్ పార్టీ వేట సాగిస్తోంది. టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇవాళ, రేపో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.