న్యాయదేవుతే తలదించుకునే ఘటన ఇది. న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయమూర్తే స్వయంగా బాధితురాలి పట్ల నీచంగా ప్రవర్తించాడు. కామాంధుల చేతుల్లో నలిగిపోయిన ఓ బాధితురాలు.. తనకు న్యాయం చేయండని న్యాయస్థానం తలుతడితే.. ఎలా జరిగిందో..? ఎక్కడ గాయాలయ్యాయో..! బట్టలిప్పి చూపించమని స్వయంగా మెజిస్ట్రేటే బాధితురాలిని ఆదేశించాడు. ఈ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది.
రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఓ యువతిపై మార్చి 19న ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 20-22 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు వ్యక్తులు యువతి తల్లిదండ్రులు లేని సమయంలో.. ఆమెను ఇంటి నుంచి నుంచి కిడ్నాప్ చేసి ఈ దారుణానానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై మార్చి 27న హిందౌన్ సదర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు మార్చి 30న విచారణకు రాగా.. హిందౌన్ కోర్టు మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తన గాయాలు చూసేందుకు బట్టలు విప్పమని అడిగాడని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందుకు ఆమె నిరాకరించింది. ఆపై కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన అనంతరం మేజిస్ట్రేట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా భారతీయ శిక్షాస్మృతి మరియు ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టంలోని సెక్షన్ 345 కింద మేజిస్ట్రేట్ పై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని రాజస్థాన్ హైకోర్టు సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసును రాజస్థాన్ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ అజయ్ సింగ్ జాట్ నేతృత్వంలోని బృందానికి బదిలీ చేసినట్లు వెల్లడించారు. కరౌలిలో అత్యాచారం బాధితురాలిని సందర్శించి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశాసినట్లు చెప్పారు.
పరారీలో నిందితులు
ఈ ఘటన జరిగిన నాటి నుంచి నిందితులు, వారి కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి జాడ కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నట్లు వెల్లడించారు.