సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మర్చిపోయారు

సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి మర్చిపోయారు
  • వెంటనే పోడు భూములకు పట్టాలివ్వాలి 
  • పౌర హక్కుల నేత ప్రొఫెసర్​ హరగోపాల్ 

హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ పోడు భూములకు పట్టాలిస్తారని లక్షలాది మంది ఆదివాసీలు ఉద్యమంలో భాగస్వాములయ్యారని, కానీ కేసీఆర్​ వాళ్లందరినీ మోసం చేశారని సామాజిక ఉద్యమకారుడు, పౌర హక్కుల నేత ప్రొఫెసర్​ హరగోపాల్ విమర్శించారు. ఇప్పటికీ అడవులను రక్షిస్తున్నది ఆదివాసీలేనని, వారిని గుర్తించకపోతే అడవిని, అటవీ సంపదను కాపాడలేరని ప్రభుత్వాలు గుర్తించాల్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​లో శనివారం పోడు రైతులకు పట్టాలివ్వాలనే డిమాండ్ తో మహాధర్నా నిర్వహించారు.

ధర్నాకు హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ.. పోడు భూములకు పట్టాలిస్తామని గతంలో బయట, అసెంబ్లీలో అనేకసార్లు ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోడు భూములకు పట్టాలివ్వకపోగా భూముల్లోకి వెళ్లకుండ ట్రెంచ్ లు వేస్తూ ఆదివాసీలను అడవుల నుంచి తరిమేస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వాలని, పోడు రైతులతోపాటు కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని, ఆదివాసీ చట్టాలన్నింటిని పకడ్బందీగా అమలు చేయాలని, ఆదివాసీలపై పెట్టిన కేసులు ఎత్తేయాలని మహాధర్నాలో తీర్మానించారు. 

 

ఇవి కూడా చదవండి

2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి

శ్రీలంకలో 50 రోజులుగా కొనసాగుతున్న నిరసనలు