వన్ నేషన్..వన్ రేషన్.. వన్ కమీషన్ విధానం అమలు చేయాలి

వన్ నేషన్..వన్ రేషన్.. వన్ కమీషన్ విధానం అమలు చేయాలి

న్యూఢిల్లీ :  దేశవ్యాప్తంగా వన్ నేషన్..వన్ రేషన్.. వన్ కమీషన్ విధానం అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అల్ ఇండియా రేషన్ డీలర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో  మంగళవారం మహా ధర్నా నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది ఆందోళనలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ఎంపీలు ఉత్తమ్, కోమటి రెడ్డి, నామా నాగేశ్వర్ రావు, బడుగుల లింగయ్య యాదవ్ లు మద్దతు తెలిపారు.  ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కమీషన్ విధానం అమలు చేయడం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని తెలంగాణ డీలర్స్ సంఘం అధ్యక్షులు నాయికోటి రాజు తెలిపారు. క్వింటాల్ కు రూ. 400 కమీషన్ ఇవ్వాలని.. నిత్యావసర వస్తువుల శాతాన్ని పెంచాలని  డిమాండ్ చేశారు.  కరోనా ఆపత్కాలంలో రేషన్ డీలర్స్.. కోట్లాది మందికి సహాయ పడ్డారని వివరించారు. తెలంగాణలో 97 మంది రేషన్ డీలర్స్ కరోనాతో మృతి చెందారని..బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేయాలని  కోరారు. రేషన్ డీలర్స్ కు ఆరోగ్య బీమా కల్పించాలని నాయికోటి రాజు డిమాండ్ చేశారు.