శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. జగన్ ను ఆహ్వానించాం.. మోడీకి కూడా ఆహ్వానం..

శ్రీశైలంలో మహా కుంభాభిషేకం.. జగన్ ను ఆహ్వానించాం.. మోడీకి కూడా ఆహ్వానం..

ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో  శ్రీశైలంలో మహా కుంభాభిషేకం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. శ్రీశైలంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది..ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో జగన్‌ను ప్రత్యేకంగా కలిసి మహాకుంభాభిషేక ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైల దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఈవో లవన్న, వేద పండితులు. అనంతరం స్వామివారి లడ్డూ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేసి.. శేషవస్త్రాలతో సీఎం జగన్‌ను సత్కరించారు.

ప్రధాని మోడీని కూడా ఆహ్వానిస్తున్నాం..

మహా కుంభాభిషేకానికి సీఎం జగన్ ను ఆహ్వానించాం.. ప్రధాని మోడీని ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి. మహా కుంభాభిషేకంలో భాగంగా శివాజీ గోపురం కలిశా ప్రతిష్టాపన చేయనుంది దేవస్థానం.. మహా కుంభాభిషేక సమయంలోనే పంచమఠ లింగాల ప్రతిష్టాపన చేయనున్నట్టు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ వెల్లడించారు. వీర శైవ ఆగమ శాస్త్రం, బ్రాహ్మణ ఆగమ శాస్త్రం ప్రకారం కలశ ప్రతిష్ట పనులు నిర్వహించాలన్నారు.. బ్రాహ్మణ, వీరశైవులకు సమాన అవకాశం ఇవ్వాలని ఈవోని కోరుతున్నాం అన్నా జగద్గురు పీఠాధిపతి.

ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో శ్రీశైలం

దేశంలోనే ప్రఖ్యాత శైవ క్షేత్రాలలో శ్రీశైలంలో ఒకటి. నల్లమల ఫారెస్ట్‌లో కృష్ణానది ఒడ్డున.. శ్రీశైలం డ్యామ్‌ పరిసరాల్లో ఈ ఆలయం ఉంది. శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రంగా గుర్తింపు పొందింది. అంతేకాదు..ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం రెండవది కావడం విశేషం. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఆరోది కూడా శ్రీశైలమే.  దీంతోపాటు దశ భాస్కర క్షేత్రాల్లో ఆరోది. అందుకే శ్రీశైలాన్ని శ్రీగిరి, సిరిగిరి అని భక్తులు పిలుస్తుంటారు. శ్రీశైలం అంటే సంపద్వంతమైన పర్వతమని పండితులు పేర్కొన్నారు. ఇక, ఈ క్షేత్రంలో మే 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు.

శ్రీశైల ఆలయ ప్రాంగణంలో జరిగే మహాకుంభాభిషేక మహోత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి సమీక్షించారు. మహా కుంభాభిషేకం సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలల ఏర్పాట్లను పరిశీలించారు. మహాకుంభాభిషేక మహోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. క్యూ లైన్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా నిరంతరం మంచినీరు సరఫరా చేయాలని సూచించారు.