మహాశివరాత్రి: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి: శివాలయాలకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా  శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హరహర మహా దేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో మారుమోగిపోతున్నాయి. ప్రముఖ ఆలయాలకు వెళ్లేందుకు ఆర్టీసి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశారు.శ్రీశైలం మల్లన్న దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.  శ్రీశైలంలో ఈరోజు రాత్రి మల్లన్న కల్యాణం జరగనుంది. వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి సందర్భంగా మూడు రోజులపాటు ఉత్సవాలు జరగనున్నాయి.

ఉమ్మడి వరంగంల్ జిల్లావ్యాప్తంగా శైవ క్షేత్రాలల్లో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, సిద్దేశ్వర ఆలయం, మడికొండలోని మెట్టుగుట్ట రామ లింగేశ్వర ఆలయం, పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసంహస్వామి గుడి,  ములుగులోని రామప్ప గుడి, ఐనవోలు మల్లికార్జున స్వామి గుడిల్లో భక్తుల రద్దీ నెలకొంది.  మహాశివరాత్రి సందర్భంగా దేవాలయంతో పాటు వేయిస్తంభాల గుడి,  కల్యాణ మండపాన్ని విద్యుత్తు దీపాలతో అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చనలు, అభిషేకాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎండ నుంచి రక్షణ కోసం చలువ పందిళ్లు , ప్రత్యేక క్యూ బారికెట్స్ ఏర్పాటు చేశారు అలయ అధికారులు. జాగరణ ఉండే భక్తుల కోసం ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.  

భక్తుల శివనామ స్మరణతో  వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతుంది. స్వామివారి దర్శనానికి భక్తులు  క్యూ లైన్ లో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకుని కోడే మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు అర్చకులచే మహా లింగార్చన నిర్వహించనున్నారు పూజారులు.

కీసర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. పురాతన, చరిత్ర కలిగిన దేవాలయం కావడంతో శివరాత్రి పర్వదినాన ఉదయం నుండే కీసర ఆలయానికి జనాలు పోటెత్తుతున్నారు.  ఉదయం 4 గంటలకు మహణ్యా పూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో  ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి. రోజంతా ప్రత్యేక పూజలు జరగనున్నట్లు అర్చకులు తెలిపారు. శివరాత్రి ఏర్పాట్ల కోసం  దేవాదాయశాఖ కోటి రూపాయల నిధులను విడుదల చేసింది.  భక్తులకు దర్శనార్థం 6 క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

పెద్దపల్లి జిల్లా ఓదెల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివలింగానికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ శివాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, సాయంత్రం సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తుల అభిషేకాలు, పూజలు ప్రారంభించారు.  యాదగిరిగుట్ట, రాచకొండలోని తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం, కొలనుపాక  శివాలయంలో భక్తుల సందడి నెలకొంది. చెర్వుగట్టు, వాడపల్లి చింతపల్లి, పురాతన ఛాయా, పచ్చల సోమేశ్వర ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.