
- న్యాయం కోసం బాధితుల రిలే దీక్షలు
- కంపెనీల వ్యర్థాలతో పొలాలు, భూగర్భ జలాలు కలుషితం
- ఇండ్ల జాగాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న రియల్టర్లు
- తమ సమస్యలను పరిష్కరించాలంటున్న భూ నిర్వాసితుల హక్కుల వేదిక
మహబూబ్‌నగర్,వెలుగు :మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లమండలంలోనిపోలేపల్లిసెజ్ భూనిర్వాసితులు ఆందోళన బాట పట్టారు. పరిహారం కింద ఇచ్చిన ఇండ్ల స్థలాలపై ఆంక్షలు ఎత్తివేసి హక్కులు కల్పించాలని, పర్మినెంట్ జాబ్ లు ఇవ్వాలని, పరిశ్రమల వ్యర్థాలను బయటకు వదులుతూ పొలాలు, భూ గర్భ జలాలను కలుషితం చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రియల్ఎస్టేట్వ్యాపారులు ఇండ్ల జాగాలను అక్రమంగా రిజిస్ర్టేషన్ చేసుకోగా.. వాటిని రద్దు చేసి, తమకు న్యాయం చేయాలని భూ నిర్వాసితుల హక్కుల వేదిక, గ్రామ యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం నుంచి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని భూ నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు.
కలుషితమైన కుంటలు, చెరువులు
పోలేపల్లి సెజ్‌లో 40 పరిశ్రమలు ఏర్పాటు చేయగా.. ఇందులో దాదాపు 25 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఆయా పరిశ్రమలు రీ సైకిల్ చేయకుండా తూములు, పైపులైన్ ద్వారా బయటకువదులుతున్నాయని, తద్వారా పొలాలు, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని రైతుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
రంగమ్మకుంట, అవుసులవారి చెరువు(గండి కుంట), కుమ్మరికుంట, పల్లె చెరువు, పెద్దకుంట, చిన్నకుంట కలుషితంగా మారుతున్నాయని పేర్కొంటున్నారు. కలుషిత నీటి కారణంగా కుంటలు, చెరువుల్లోని చేపలు చనిపోతున్నాయని,గతంలోనే పలుమార్లు ఆందోళనలు చేసినట్టుచెబుతున్నారు. ఈ ప్రాంతంలోని భూ గర్భ జలాలను వాడుతుంటే చర్మ రోగాల బారిన పడుతున్నామని సమీప ప్రాంతాల్లోని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్మినెంట్ జాబ్ లకు హామీ ఇచ్చి..
2007లో స్పెషల్ఎకనామిక్ జోన్ (సెజ్) ఏర్పాటైంది. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 282 మంది రైతుల నుంచి 950 ఎకరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ర్టియల్ఇన్ఫ్రాస్ర్టక్చర్కార్పొరేషన్ (ఏపీఐఐసీ) సేకరించింది.
అరెకరం, ఎకరం, రెండెకరాలు, ఐదెకరాలు ఇలా ఎంత భూమి ఉన్నా.. అందరికీ ఒకే విధంగా పరిహారంగా రూ.70 వేలు చెల్లించింది. అది సరిపోవట్లేదని బాధితులు ఆందోళన చేయడంతో అప్పటి ప్రభుత్వం భూ నిర్వాసిత కుటుంబాల్లోని యువతకు కంపెనీల్లో పర్మినెంట్ జాబ్ లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాకుండా 167 కుటుంబాలకు జాబ్‌కార్డులు కూడా జారీ చేసింది. ఇందులో పోలేపల్లిలో 134, ముదిరెడ్డిపల్లెలోని 33 కుటుంబాలకు జాబ్‌కార్డులు వచ్చాయి.
మరో 126 కుటుంబాలకు సెజ్‌లోని కంపెనీల్లో రెగ్యులర్ జాబ్ లు ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. జాబ్‌కార్డులు ఇచ్చి ఏండ్లు దాటినా ఇంతవరకు కల్పించడం లేదు. స్థానికులకు కాకుండా స్థానికేతరులకు పర్మినెంట్ జాబ్ లను కంపెనీలు ఇస్తున్నాయి. నిర్వాసిత కుటుంబాలకు డైలీ వైజ్‌గా పనులు కల్పిస్తున్నాయి.
రియల్టర్ల చేతుల్లోకి నిర్వాసితుల ప్లాట్లు
అప్పటి ప్రభుత్వం ప్రతి పట్టాదారుడికి 2009, జులై 25న 200 గజాల చొప్పున సర్వే నం. 458, 459లో ప్లాట్లను కేటాయించింది. మొత్తం 329 ప్లాట్లను జీపీ లేఔట్ చేయగా, 282 మందికి ప్లాట్లను అలాట్ చేసింది. పట్టాలు పొందినవారు పేదలు కావడంతో ఎవరూ ఇండ్లు కట్టుకోలేదు. ప్రభుత్వమే కట్టి ఇవ్వాలని అప్పట్లో బాధితులు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. కాగా.. ఆ ప్లాట్లు నేషనల్హైవే-– 44ను ఆనుకొని ఉండగా 2018 తర్వాత భారీగా డిమాండ్ఏర్పడింది.
దీంతో కొందరు రియల్టర్లు పలువురు భూ బాధితులకు అప్పులుగా ఇచ్చి ప్లాట్ల డాక్యుమెంట్లను తీసుకున్నారు. వాటిని అక్రమంగా రియల్టర్లు రిజిస్ర్టేషన్లు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్రమ రిజిస్ర్టేషన్లను రద్దు చేసి, బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్తెరమీదకు వచ్చింది.
ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం
ప్రభుత్వం మా డిమాండ్లను పరిశీలించాలి. వాటిని త్వరగా పరిష్కరించి మాకు న్యాయం చేయాలి. లేకుంటే సెజ్‌లోని కంపెనీలను ముట్టడిస్తాం. అయినా స్పందన రాకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం. హై వేపై ధర్నాలు, రాస్తారోకోలు చేస్తాం. మా డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం.
- సత్య, భూ నిర్వాసితుడు, పోలేపల్లి-