- పోలేపల్లి గ్రామ సమీపంలోనే వేస్టేజీని పడేస్తున్న కంపెనీలు
మహబూబ్‌నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు : మహబూబ్‌నగర్ జిల్లా పోలేపల్లి గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూములు డంపింగ్ యార్డులుగా మారిపోతున్నాయి. పోలేపల్లి సెజ్‌లోని ఫార్మా కంపెనీలు, ఇతర రా మెటీరియల్ తయారీ కంపెనీలు వేస్టేజీని గ్రామ సమీపంలోని లెదర్ పార్క్‌కు సంబంధించిన ఖాళీ స్థలంలో పడేయడం, రాత్రి టైంలో వాటికి నిప్పు పెడుతుండడంతో తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో స్థానికులు రోగాల పాలవుతున్నారు.
950 ఎకరాల్లో సెజ్
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో 2007లో సెజ్ (స్పెషల్ ఎకనామిక్ జోన్)ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం పోలేపల్లి, బాలానగర్ మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 282 మంది రైతుల నుంచి 950 ఎకరాలను సేకరించారు.
ఆయా భూముల్లో ఇప్పటివరకు 45కు పైగా కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇందులో అత్యధికంగా 20కిపైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వీటిలో జనరిక్ మెడిసిన్, ఫార్మా కెమికల్స్, ఫార్మా ఉత్పత్తులు, సెల్యులోజ్ ఉత్పత్తుల యూనిట్లతో పాటు ట్యూబ్‌లైట్లు, ప్లాస్టిక్ పైప్‌లు, టైర్లు, ట్యాబ్లెబ్ కవర్లు, సిరంజి బాటిల్స్, కేబుల్స్, ఫైబర్, అల్యూమినియం, బేడ్లతో పాటు వ్యవసాయ పంపుసెట్లు, అట్టలు, స్పేర్ పార్ట్స్ వంటి తయారీ పరిశ్రమలు ఉన్నాయి.
లెదర్ పార్క్ భూముల్లో డంపింగ్
2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లీడ్‌క్యాప్ ఆధ్వర్యంలో ‘మలుపు’ స్కీంను తీసుకొచ్చి మినీ పరిశ్రమలను ఏర్పాటు చేయించింది. స్కీంలో భాగంగా పోలేపల్లి వద్ద మినీ లెదర్ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 25 ఎకరాల భూమిని సేకరించి, లీడ్‌క్యాప్ సంస్థకు అప్పగించారు.
సెజ్‌లోని కంపెనీలు.. లెదర్ పార్క్‌కు సంబంధించిన భూములను డంపింగ్‌యార్డుగా మార్చేశాయి. కంపెనీల నుంచి వెలువడే వ్యర్థాలను ఉదయం, సాయంత్రం ట్రాక్టర్లలో తీసుకొచ్చి లెదర్ పార్క్ భూముల్లో పడేస్తున్నాయి. రాత్రి సమయంలో నిప్పు పెడుతుండగా పొగ, దుర్వాసన వెలువడుతుండడంతో సమీపంలోనే ఉన్న పోలేపల్లి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రిపోర్ట్ సిద్ధం చేసిన ఆఫీసర్లు
జనావాసాలకు సమీపంలో వేస్టేజీని డంప్ చేస్తుండడంతో పోలేపల్లి గ్రామస్తులు విషయాన్ని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గత వారం డంపింగ్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే.. ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తారు.
స్పందించిన ప్రభుత్వం.. సెజ్ ప్రాంతాన్ని పరిశీలించిన నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మహబూబ్‌నగర్ అడిషనల్ కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్డీవో నవీన్, పరిశ్రమల జీఎం యాదయ్య, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టీఎస్‌ఐఐసీ, జడ్చర్ల రెవెన్యూ ఆఫీసర్లతో కలిసి పోలేపల్లిలోని లెదర్ పార్క్‌ను పరిశీలించారు. రసాయన వ్యర్థాలను పారబోస్తున్న విషయంపై రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సమాచారం.
