మహబూబాబాద్, వెలుగు: విద్యార్థులు సైన్స్‌పై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. మంగళవారం మహబూబాబాద్ పట్టణంలోని అనంతారం మోడల్ స్కూల్లో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించగా ఆయన హాజరయ్యారు. విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకొని అభినందించారు. వైజ్ఞానిక ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందిస్తాయని చెప్పారు. చదువుల్లో బట్టీ పద్ధతిని వీడి, పాఠ్యాంశాలను అర్థం చేసుకోవాలని చెప్పారు. సైన్స్ఎగ్జిబిషన్లో 85 ఇన్ స్పైర్, 230 బాల వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు డీఈవో దక్షిణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, టీచర్లు పాల్గొన్నారు.
చెక్కు, చీరలు పంపిణీ
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ వడ్డీ లేని రుణాలకు సంబంధించి రూ.2.70 కోట్ల విలువైన చెక్కును మహిళా సంఘాల సభ్యులకు అందించారు. రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
