అభయ యాప్ తో ఆటో ప్రయాణికుల భద్రత : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

అభయ యాప్ తో ఆటో ప్రయాణికుల భద్రత : ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్

మహబూబాబాద్, వెలుగు: నూతనంగా రూపొందించిన అభయ యాప్​ద్వారా ఆటోలలో సురక్షిత ప్రయాణం పొందవచ్చని మహబూబాబాద్ ​ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో 1281 ఆటోలకు “మై టాక్సీ సేఫ్ ” అనే అభయ యాప్‌కు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ స్టికర్లు అతికించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటో నడిపే వ్యక్తులను ఒక సంస్థతో అనుసంధానం చేసి, ప్రతి ఏడాది రూ.350  ప్రీమియంతో ప్రమాదంలో మరణానికి రూ.లక్ష బీమా అందే విధంగా ఏర్పాటు చేశామన్నారు. 

ఆటోలో రక్షణ లేదని అనుకుంటే ప్రయాణికులు ఆటోపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే డ్రైవర్‌ ఫొటో, వ్యక్తిగత వివరాలు, వాహన సమాచారం తెలుస్తుందన్నారు. మహిళా ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి వివరాలు చూసుకోవచ్చన్నారు. అసభ్య ప్రవర్తన, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి నడపడం, ఢీకొట్టి పారిపోవడం వంటి ఘటనలను ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. 

కార్యక్రమంలో మహబూబాబాద్​ డీఎస్పీ తిరుపతి రావు, టౌన్​ సీఐ మహేందర్ రెడ్డి, బయ్యారం సీఐ రవి కుమార్, డోర్నకల్ సీఐ చంద్రమౌళి, ట్రాఫిక్ ఎస్సై అరుణ్ కుమార్, అభయ యాప్ రూపకర్త అభిచరన్, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.