మహబూబ్ నగర్, వెలుగు : మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కిందటి నవంబర్లో ప్రభుత్వం ఫండ్స్ ను రిలీజ్ చేసింది. ఈ స్పెషల్ గ్రాంట్స్ ను లీడర్లు ఉపయోగపడటం లేదు. ఈ ఫండ్స్ గురించి ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు తెలియకపోవడం ఆశ్చర్యం.కొన్ని చోట్ల జనరల్ వర్క్స్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు వచ్చినా పనులు స్టార్ట్ కాలేదు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైన్లు, బోరు మోటార్లు, జడ్పీహెచ్ఎస్ లు , మండల పరిషత్ స్కూళ్లు, యూపీఎస్ లలో డెవలప్మెంట్ పనుల కోసం ఖర్చు చేయాల్సి ఉంది. కానీ, ఇంత వరకు జనరల్ కోటా కింద 76 పనులకు, ఎస్సీ కోటా కింద 18 పనులకు, ఎస్టీ కోటా కింద 16 పనులకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు ఇచ్చారు. మూడు నెలలు పూర్తి కావస్తున్నా, ఎలాంటి పనులూ చేయడం లేదు. మండల పరిషత్ ల పరిధిలో కూడా ఇప్పటి వరకు ఈ నిధులతో పనులు చేసేందుకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు కూడా ఇస్తలేరు.
అటా ఇటా?
స్పెషల్ గ్రాంట్స్ ఏ పనులకు కేటాయించాలనే డైలమాలో ఆఫీసర్లు ఉన్నారు. ఈ ఫండ్స్ తో 50 శాతం నిధులు ‘మన ఊరు–మన బడి’కి వినియోగించాలని, మిగతా 50 శాతం నిధులను జనరల్ వర్కులకు కేటాయించాలని నెలన్నర కిందట కమిషనర్ నుంచి గైడ్ లైన్స్ వచ్చాయి. అందుకు తగినట్లు ఆఫీసర్లు ‘మన ఊరు–మన బడి’ స్కీం పనులను గుర్తించి ఎస్టిమేషన్లు రెడీ చేశారు. కానీ, ఈ స్కీంకు విడతల వారీగా కలెక్టర్ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఆఫీసర్లు ‘మన ఊరు–మన బడి’కి కేటాయించిన ఫండ్స్ ను ఏ పనులకు వినియోగించకుండా హోల్డ్ లో పెట్టారు. మిగతా 50 శాతం నిధులను జనరల్ వర్క్ కు కేటాయించాల్సి ఉన్నా, వాటిని కేవలం మెయింటెనెన్స్ లకే వినియోగించాలని ఉన్నతాధికారుల నుంచి నుంచి ఆర్డర్లు రావడంతో డెవలప్మెంట్ పనులకు కేటాయించడం లేదు.
సభ్యులకు సమాచారం కూడా లేదు
జడ్పీ స్పెషల్ గ్రాంట్స్ కింద నిధులు విడుదలైనా, ఇప్పటి వరకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలకు సమాచారం లేదు. ఈ నిధులతో చేస్తున్న పనుల గురించి కొందరు సభ్యులను ప్రశ్నించగా, వారి నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఆ నిధులేంటివో తెలియదని, ఆఫీసర్లను అడిగి కనుక్కుంటామని సమాధానం ఇస్తున్నారు. ఇంకొందరితో మాట్లాడగా 15వ ఫైనాన్స్ కింద మార్చిలో ఇచ్చిన వర్కులను పూర్తి చేశామని, స్పెషల్ గ్రాంట్స్ నుంచి తమకు ఇంత వరకు ఎలాంటి పనులు కేటాయించలేదని తెలిపారు.
గైడ్ లైన్స్ ప్రకారం ఫండ్స్ కేటాయిస్తాం
ప్రభుత్వం ఏ నిధులు విడుదల చేసినా, ఆ నిధులకు సంబంధించిన విధి విధానాలను జారీ చేస్తుంది. దాని ప్రకారమే నిధుల కేటాయింపులు చేస్తాం. విలేజ్ విజిట్ కు వెళ్లినప్పుడు గ్రామ సభల్లో తమ దృష్టికి వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు కూడా నిధులు వెచ్చిస్తాం. అలాగే మండల సభల్లో సభ్యులు చేసుకున్న తీర్మానాలకు సంబంధించిన పనులకు కూడా నిధులు కేటాయిస్తాం.
- స్వర్ణా సుధాకర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్, పాలమూరు
