హన్వాడ, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి ఆదివారం సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, ఎఫ్‌ఐఆర్ నమోదు విధానం, పెండింగ్ కేసులు, రౌడీ షీట్స్, సీజ్ ప్రాపర్టీ, సీసీటీఎన్‌ఎస్ ఆన్‌లైన్ అప్‌డేట్స్ తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ప్రతీ కేసును సమయానుకూలంగా నమోదు చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తులో నాణ్యత, పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది ద్విచక్ర వాహనాలు నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, హెల్మెట్ లేని సిబ్బందిని స్టేషన్‌లోకి అనుమతించవద్దని ఆదేశించారు. అనంతరం సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నవారు ప్రతీ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో తనను నేరుగా కలవవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణ, రూరల్ సీఐ గాంధీ నాయక్, హన్వాడ ఎస్ఐ వెంకటేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
