మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభం

మహిళలకు బస్సుల్లో ఫ్రీ జర్నీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను ఇవాళ ప్రారంభం అయ్యాయి. మహాలక్ష్మీ ఫ్రీ బస్ స్కీం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10లక్షలకు పెంపు పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అసెంబ్లీ నుంచే ఈ పథకాలను ప్రారంభించారు.

 సీఎం రేవంత్ రెడ్డి  జీరో చార్జ్ టికెట్ ను మంత్రులు, సీతక్క, కొండా సురేఖకు ఇచ్చారు. ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.  తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామని తెలిపారు.   డిసెంబర్ 9న తెలంగాణ ప్రజల అకాంక్షలను సోనియాగాంధీ నెరవేర్చారని చెప్పారు. మరోవైపు  బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందించారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కిలోమీటర్లు అయినా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచితంగా జర్నీ చేయవచ్చు. 

మహాలక్ష్మి స్కీమ్ గైడ్ లైన్స్ ఇవే.. 

  • ఫ్రీ జర్నీకి బాలికలు, మహిళలు, ట్రాన్స్ జెండర్లు అర్హులు 
  • పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ లలో మాత్రమే స్కీమ్ వర్తింపు 
  • ఫ్రీ టికెట్ కు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులలో ఏదో ఒకటి చూపాలి 
  • రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా, ఎన్ని కిలోమీటర్లు అయినా ఫ్రీ 
  • రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే పథకం వర్తింపు

స్కీమ్ అమలుకు 7,200 బస్సులు 

ప్రస్తుతం రోజూ సుమారు 14 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని సజ్జనార్ తెలిపారు. నాలుగైదు రోజులు గడిస్తే రోజూ ఎంత మంది మహిళలు జర్నీ చేస్తున్నారనే విషయంలో కచ్చితమైన లెక్కలు వస్తాయన్నారు. ప్రస్తుతం రోజువారీ జర్నీలో 40 శాతం మహిళలు ఉన్నారని, స్కీమ్ అమలు తర్వాత ఇది 55 శాతానికి పెరగొచ్చన్నారు.

‘‘ఈ స్కీమ్ అమలుకు 7,200 బస్సులను వినియోగిస్తున్నం. దీనిపై అన్ని డిపోల మేనేజర్లు, ఆర్ఎంలకు ఆదేశాలు ఇచ్చాం. రాష్ర్ట సరిహద్దు వరకే ఈ ఫ్రీ జర్నీ వర్తిస్తుంది. రాష్ట్రంలో ఎన్ని కిలోమీటర్లు అయినా జర్నీ చేయొచ్చు. ఫ్రీ టికెట్ ఇచ్చేముందు స్థానికతను తెలియజేసే ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డులలో ఏదైనా ఒకటి చూపించాల్సి ఉంటుంది” అని సజ్జనార్ వివరించారు. స్కీమ్ పై అవగాహన కల్పించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, శుక్రవారం జూమ్ ద్వారా 30 వేల మంది కార్మికులు, ఉద్యోగులతో మాట్లాడామన్నారు. ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని, ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.
 
ఏటా రూ. 3 వేల కోట్లు.. 

మహాలక్ష్మి స్కీమ్ అమలు ద్వారా ఏడాదికి రూ. 3 వేల కోట్ల భారం పడుతుందని, ఈ నిధులను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్ రూపంలో ఇస్తుందని సజ్జనార్ చెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీకి రోజూ రూ.14 కోట్ల రెవెన్యూ వస్తుండగా, ఈ స్కీమ్ అమలు తర్వాత డైలీ రెవెన్యూ రూ.7 కోట్లకు తగ్గుతుందన్నారు. త్వరలో 1,000 కొత్త బస్సులు వస్తున్నాయని, రూరల్ ప్రాంతాలకు 500 కేటాయిస్తామన్నారు. కరోనా తర్వాత ప్రైవేట్ వెహికల్స్ పెరగడంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అయితే, ఆర్టీసీలో మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందన్నారు.