
- రూ.8 లక్షల మహాలక్ష్మి పెన్షన్ డబ్బు రికవరీ
- బ్రాంచ్ పోస్ట్ మెన్ ఆధ్వర్యంలో స్కెచ్
నిజామాబాద్, వెలుగు: మహాలక్ష్మి స్కీమ్ పెన్షన్ పంచడానికి ఒక బీపీఎం తెచ్చిన డబ్బును చోరీ చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగల నుంచి రూ.8 లక్షలు, టు వీలర్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన బండి నరేందర్ లోకల్ పోస్ట్ ఆఫీస్‌లో బ్రాంచ్ పోస్టుమెన్‌గా పనిచేస్తున్నాడు. మహాలక్ష్మి స్కీమ్ కింద లబ్ధిదారులకు పెన్షన్‌గా పంచడానికి ఆగస్టు 29న నిజామాబాద్ హెడ్ పోస్టాఫీస్ నుంచి రూ.8 లక్షలు తెచ్చి రాత్రి ఇంట్లో పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సహ ఉద్యోగి ముబారక్‌నగర్‌కు చెందిన బీపీఎం పత్తి సాయికుమార్ చోరీకి ప్లాన్ వేశాడు.
ఇందుకు నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన కొండమొల్ల రాకేశ్‌ను రంగంలోకి దింపాడు. దీంతో మరుసటి రోజు బండి నరేందర్ వద్దకు కొండమల్ల రాకేశ్ వెళ్లి పత్తి సాయికుమార్ స్నేహితుడినని పరిచయం చేసుకొని రాత్రి అక్కడే ఉన్నాడు. బండి నరేందర్ నిద్రలోకి జారుకున్నాక డబ్బులు ఉన్న బ్యాగ్ తీసుకొని ఉడాయించాడు. అనంతరం పత్తి సాయికుమార్ వద్దకు వెళ్లి డబ్బులున్న బ్యాగ్‌ను ఇచ్చాడు. కొన్ని రోజులయ్యాక పంచుకుందామని నిర్ణయించుకున్నారు.
బాధితుడు బండి నరేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మాక్లూర్ పోలీసులు టెక్నికల్ ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసి నగదు రికవరీచేయడంతోపాటు రిమాండ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన నార్త్ సీఐ బి.శ్రీనివాస్, ఎస్సై రాజశేఖర్, కానిస్టేబుల్స్‌ను ఏసీపీ
అభినందించారు.